నిజం... నిజం... డార్వినిజం | Charles Darwin Jayanthi Special Story By Katha Satya Prasad | Sakshi
Sakshi News home page

నిజం... నిజం... డార్వినిజం

Published Sat, Feb 12 2022 12:48 AM | Last Updated on Sat, Feb 12 2022 5:46 AM

Charles Darwin Jayanthi Special Story By Katha Satya Prasad - Sakshi

ఈ భూమి మీద మానవునితో సహా సకల జీవజాతులూ యథాతథంగా సృష్టించబడ్డాయనీ సంప్రదాయంగా ఉన్న వాదనలను సవాలు చేశాడు డార్విన్‌. ఆయన ప్రవచించిన జీవపరిణామ సిద్ధాంతం సైన్సుకు నూతన దృక్కోణాన్ని ప్రసాదించింది. ఆయన వాదనలను వ్యతిరేకించేవాళ్లు అప్పుడే కాదు, ఇప్పుడూ ఉన్నారు. ‘కోతి నుండి మనుషులొస్తే ఇంకా కోతులెందుకున్నాయి?’ అని ప్రశ్నించే రాజకీయ తరగతి ఒకటి బయలుదేరింది. కానీ నిరూపిత సత్యాలను విశ్వాసాలు ఎదుర్కోలేవు. ఆఖరికి గత నెలలో పంది గుండెను మనిషికి అమర్చారన్న వార్త ఏం సూచిస్తున్నది? పాలిచ్చే జంతువులైన పంది, మనిషి మధ్య ఒక సజీవ సంబంధం ఉందనేగా! వెలుగు చూస్తున్న నూతన సమాచారం డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంత ఔన్నత్యాన్ని పెంచుతూనే ఉంది.

సమస్త చరాచర జగత్తు భగవంతుని సృష్టి అని ప్రబలంగా విశ్వసిస్తున్న కాలంలో ఒక వినూత్న ఆలోచనకు బీజం వేసినవాడు బ్రిటన్‌కు చెందిన ప్రకృతి, జీవ, భూగర్భ శాస్త్రవేత్త ఛార్లెస్‌ డార్విన్‌ (1809–1882). జీవ జాతుల పుట్టుకపై 1859వ సంవత్సరంలో డార్విన్‌ రాసిన ‘జాతుల ఆవి ర్భావం’ (ఆరిజిన్‌ ఆఫ్‌ స్పీషీస్‌) ఒక సత్యాన్ని ఆవిష్కరించింది. ఆ సత్యమే ‘పరిణామం’. అప్పట్లో అదొక సంచలనం. ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. ఈ భూమిపై నెలకొన్న అనంత జీవవైవిధ్యం పరిణామ ఫలితమని చాటాడు డార్విన్‌. 

మనం చూస్తున్న జీవులు, వాటి పూర్వీకుల నుండి పరిణామం చెంది భిన్న రూపాలను సంతరించుకున్నవే. తద్వారా నాటి వాతా వరణ పరిస్థితులను తట్టుకొని పరిణతి చెందటం జరిగింది. ఆ క్రమంలో సమర్థవంతంగా అనుకూలనం (అడాప్టేషన్‌) చెందినవి బతికి బట్ట కట్టాయనీ, తట్టుకోలేనివి నశించాయనీ చెప్పాడు. అలా నిలబడిన జీవులను ప్రకృతి ప్రోత్సహిస్తుందనీ, ఎంపిక చేస్తుందనీ సూత్రీకరించాడు. అదే డార్విన్‌ ప్రకృతివరణ సిద్ధాంతం (నేచురల్‌ సెలక్షన్‌ థియరీ)గా ప్రసిద్ధి చెందింది. 

ఇదేదో ఊహాజనిత వాదం కాదు. విస్తృత పరిశీలన, అధ్యయనం దీనికి మూలం. డార్విన్‌ చరిత్రాత్మక నావ ప్రయాణం ‘హెచ్‌.ఎం.ఎస్‌. బీగిల్‌’లో 1831లో మొదలైంది. 1836 వరకు ఐదేళ్లపాటు కొన సాగింది. ఆ నావ ప్రయాణంలో చూసిన అబ్బురపరిచే జీవ వైవిధ్యం, డార్విన్‌ మదిలో కొత్త ఆలోచనలకు తెర తీసింది. జీవజాతులు ఎందుకు భిన్నత్వాన్ని చూపుతాయి? వాటి మధ్య ఉన్న సంబంధానికి కారణమేమిటన్న ప్రశ్నలు, వాటికి జవాబుల శోధనలో డార్విన్‌ లెక్కకు మిక్కిలి సాక్ష్యాలను సేకరించాడు. పురాతన జీవులకు చెందిన శిలాజాలనెన్నింటినో సేకరించి భద్రపరిచాడు. 

డార్విన్‌ పరిశోధనకు పసిఫిక్‌ మహాసముద్రంలోని గెలాపాగోస్‌ దీవుల(ఈక్వెడార్‌) సందర్శన ఎంతో మేలు చేసింది. రాకాసి తాబేళ్ళు ఒక దీవి నుండి మరొక దీవికి విభిన్నంగా ఉన్నాయి. అక్కడి పక్షుల ముక్కు... ఆకారంలో, నిర్మాణంలో విశిష్ట అనుకూలనాన్ని ప్రదర్శిం చింది. గడ్డి మైదానాల్లో నివసించే జంతువులు సైతం విభిన్నత కన బరిచాయి. అర్జెంటీనాలో ఉండే జంతువులకూ, ఆస్ట్రేలియా గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థలో జీవించే జీవులకూ మధ్య పోలికే లేదు. ఇవేవీ ఐరోపా జంతువులను పోలి లేవు. ఈ వైవిధ్యం జీవ పరిణామ సిద్ధాంతానికి ఒక శాస్త్రీయ ప్రాతిపదికనిచ్చింది. అదే సమయంలో తన దేశానికే చెందిన ప్రకృతి శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్‌ రస్సెల్‌ వాలెస్‌ మలే సియాలో చేసిన క్షేత్రస్థాయి పరిశోధనలు కూడ జీవులు పరిణామం ద్వారానే ఆవిర్భవించాయనే భావనకు బలం చేకూర్చాయి. వాలెస్‌ అధ్యయనం దాదాపు రెండు దశాబ్దాల డార్విన్‌ ఊగిసలాటకు తెరదిం చింది. నిర్ణయం తీసుకోవడాన్ని వేగిరపరిచింది. ఎట్టకేలకు తన సిద్ధాంతాన్ని ‘జాతుల ఆవిర్భావం’గా ప్రతిపాదించాడు. 

జీవులు సృష్టి కాదనీ, పరిణామ క్రమంలో ఏర్పడ్డాయనీ, జీవుల మధ్య పరస్పర సంబంధం ఉన్నదనీ పరిణామ సిద్ధాంతం వెల్లడిం చింది. జీవ ప్రపంచం అంతా యథాతథ సృష్టి అనే సృష్టివాదానికి జీవ పరిణామ సిద్ధాంతం పెను సవాల్‌ విసిరింది. వేళ్ళూనుకుని ఉన్న మత విశ్వాసాన్ని కాదని సైన్సును అగ్ర భాగాన నిలిపింది. దీనిలో డార్విన్‌ సిద్ధాంతంపై పలు కోణాల నుండి విమర్శలు వచ్చాయి. జీవ పరిణామ శాస్త్రవేత్తలు హేళనకూ, కవ్వింపులకూ గురయ్యారు. థామస్‌ హక్సలే వంటి ఎందరో జీవశాస్త్రవేత్తలు సృష్టివాదుల విమర్శ లకు దీటుగా సమాధానం చెప్పారు. 

తొలినాళ్లలో డార్విన్‌ సిద్ధాంతం విమర్శలను ఎదుర్కోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ నేడు 21వ శతాబ్దిలో సైతం పరిణామ సిద్ధాంతంపై దాడులు ఆగటం లేదు. ‘కోతి నుండి మనుషులొస్తే ఇంకా కోతులెందుకున్నాయి? కోతి నుండి మనిషి రావడాన్ని చూడలే’ దనే రాజకీయ తరగతి ఒకటి బయలుదేరింది. నిజాన్ని చూడటం, సత్యాన్ని గ్రహించటం కొందరి వల్ల కాదు. ముఖ్యంగా సత్యాన్ని చూడ టానికి ఇష్టపడని వాళ్లకు. దాచేస్తేనో, దాడి చేస్తేనో కనుమరుగయ్యేది కాదు సత్యం. రుజువులు చూపి సత్యాన్ని నిరూపించేదే సైన్సు. అందుకే జీవ పరిణామ సిద్ధాంతం ప్రపంచ ఆలోచనా విధానాన్ని మార్చి వేసింది. భౌగోళిక విస్తరణ, విభిన్న జీవుల్లో కనిపించే ఏకరూప శరీర నిర్మాణాలు, పిండదశలో జీవులు చూపించే సారూప్యత, శిలాజ నిదర్శనాలు డార్విన్‌ సిద్ధాంతానికి బలం చేకూర్చాయి. డార్విన్‌ తరు వాతి కాలంలో అభివృద్ధి చెందిన సైన్సు సైతం జీవ పరిణామ సిద్ధాంతానికి మెరుగులు దిద్దటం విశేషం. వివిధ ప్రాంతాల తవ్వ కాల్లో దొరికిన పురాతన శిలాజాలు పూర్వీకుల లింకులను బయట పెట్టాయి. చేపల నుండి మనుషుల వరకు పిండాలన్నీ ఆరంభంలో ఒకే రకంగా ఉండటం జీవుల మధ్య సంబంధానికి గొప్ప రుజువు. 

వాతావరణ పరిస్థితులకు ‘అనుకూలనం’ చెందటాన్ని పరిణా మంలో కీలకంగా డార్విన్‌ భావిస్తే, మెండల్‌ పరిశోధనలు జీవుల లక్ష ణాలు ఒక తరం నుండి మరో తరానికి ఎలా బదిలీ అవుతాయో చూపించాడు. ఆ అనువంశిక లక్షణాలే జీవులు ‘అనుకూలనం’ చెంద టంలో కీలక పాత్ర పోషిస్తాయని బలమైన రుజువులు చూపాడు. జీవుల్లో మార్పులకు ‘ఉత్పరివర్తనాలు’ (మ్యుటేషన్స్‌) కారణమని చెప్పాడు. మెండల్‌ కాలానికి కూడా ఉత్పరివర్తనం చెందేవాటి భౌతిక రూపం తెలియదు. అందుకే మెండల్‌ వాటిని ‘కారకాలు’గా పేర్కొ న్నాడు. ఆధునిక జీవశాస్త్రం, ముఖ్యంగా జన్యుపదార్థం–డీఎన్‌ఏ ఆవి ష్కరణ తర్వాత వీటి వెనుక దాగిఉన్న రహస్యం ‘జన్యువులు’ (జీన్స్‌) అని తేల్చింది. నాటి నుండి నేటి వరకు వెలుగు చూస్తున్న నూతన సమాచారం డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంత ఔన్నత్యాన్నీ, సత్యాన్నీ ఆవిష్కరిస్తూనే ఉంది.

గత నెలలో పంది గుండెను మనిషికి అమర్చారన్న వార్త ఏం సూచిస్తున్నది? పాలిచ్చే జంతువులైన పంది, మనిషి మధ్య ఒక సజీవ సంబంధం ఉందనేగా! కోతుల నుండి మనుషులు వచ్చారని డార్విన్‌ ఎక్కడా చెప్పలేదు. కోతులు, కొండముచ్చులు, చింపాంజీల వంటి జాతులకూ, మానవ జాతికీ మధ్య దగ్గరి పోలికలున్నాయనీ, ఇవన్నీ ఒకే మూలం నుండి వచ్చాయనీ, చింపాంజీల డీఎన్‌ఏ మనుషుల డీఎన్‌ఏతో 98.8 శాతం పోలి ఉంటుందనీ 2005లో వెలువరించిన చింపాంజీ జీనోమ్‌ చెబుతున్నది. సూక్ష్మజీవి నుండి మనిషి వరకూ అన్ని రకాల జీవులు ఒకేవిధమైన జీవన క్రియలను చూపుతాయి. అన్నింటిలో శ్వాసక్రియ ఒకే రకం. అన్ని జంతువులూ ఆక్సిజన్‌ తీసు కుని కార్బన్‌ డయాక్సైడ్‌ను వదులుతాయి. ప్రొటీన్లు, డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, జీవాణువులు జీవజాతులన్నింటిలో ఒకే రకమైన పదా ర్థాలతో నిర్మితమై ఉంటాయి. ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి? జీవుల మధ్య పరస్పర సంబంధం ఉందనే కదా! పరిణామం చెందటం ద్వారానే శాఖోపశాఖలుగా విస్తరించాయని కదా! 

జీవ పరిణామ సిద్ధాంతం ఒక సైన్సు. కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటుందనీ, ఉండాలనీ కోరుకునే వాళ్లకూ... ప్రతిదీ మార్పు చెందు తుందనీ, మార్పు సహజమనీ, ప్రపంచ గమనానికి మార్పు ఇరుసూ అని నమ్మేవాళ్లకూ మధ్య నాటి నుండి నేటి వరకూ ఘర్షణ జరుగు తూనే ఉంది. ‘‘ప్రస్తుతం పాతకొత్తల మధ్య, సత్యాసత్యాల మధ్య పోరాటం జరుగుతున్నది. బుద్ధిమంతులైనవారు ఏ పక్షంలో చేరాలో, అంతిమ విజయం ఎవ్వరిదో చెప్పనక్కర్లేదు. ఈ సంగ్రామం సుదీ ర్ఘంగా సాగవచ్చు. తీవ్రంగా ఉండవచ్చు. అయితే జ్ఞానం అజ్ఞానాన్ని, సత్యం అసత్యాన్ని తప్పక జయిస్తాయి’’ అన్న కందుకూరి వీరేశలింగం మాటలు నేటికీ, ఏనాటికీ కూడా అక్షర సత్యాలే.జీవ పరిణామ సిద్ధాంతం సత్యశోధకుల చేతుల్లో ఒక ఆయుధం వంటిది. ఫిబ్రవరి 12 అంతర్జాతీయ డార్విన్‌ దినోత్సవ సందర్భంగా సైన్సు ప్రేమికులు, శాస్త్ర ప్రచార కార్యకర్తలు సామాజిక మార్పు కోసం యువతలో హేతుబద్ధ ఆలోచనా బీజాలు నాటాలి.

వ్యాసకర్త జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఉపాధ్యక్షుడు

మొబైల్‌: 94900 98918

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement