మాంచి లంక పుగాకు చుట్ట వెలిగించి ఆబగా పొగ లాగి గాల్లోకి వదిలాడు గిరీశం. పేపర్ చదూతోంటే గోపాత్రుడు వచ్చాడు. యామివోయ్ మై డియర్ గోపాత్రుడూ ఏంటి అలా డల్‌గా ఉన్నావ్ అని ఆరా తీశాడు. ఏం లేదు గురువుగారూ... ఈ కరోనా ఏంటో వేరియంట్లు ఏంటో చాలా భయంగా ఉంది అన్నాడు. వాటికి భయపడాల్సింది లేదోయ్. అని భరోసా ఇచ్చాడు గిరీశం. మన దేశంలో ఏ వేరియంట్లు ఉన్నాయ్ గురువు గారూ అని అడిగాడు గోపాత్రుడు. ఎల్లో వేరియంట్... కాంగ్రెస్ వేరియంట్ బాగా తిరిగేస్తున్నాయిరా మన దేశంలో అన్నాడు గిరీశం. గోపాత్రుడు వెర్రిమొగం వేశాడు.
అవేం వేరి యంట్లు గురువుగారూ అని ఆశ్చర్యంగా అడిగాడు. ఇవి పొలిటికల్ వేరియంట్లు లే. అని.. గోపాత్రుడు అర్థం కానట్లు చూడ్డంతో వివరించడం మొదలు పెట్టాడు గిరీశం. ఎల్లో వేరియంట్ అంటే టీడీపీ వేరియంట్ అన్న మాట. చాలా వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్ ఇది. డెల్టా వేరియంట్ ఏ శరీరంలోకి అయినా ఎలా చొచ్చు కుపోతుందో.. ఎల్లో వేరియంట్ అలా ఏ పార్టీలోనైనా చొరబడిపోతుందన్నమాట. మోస్ట్ డేంజరస్ వేరి యంట్ ఇది. అన్నాడు గిరీశం. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు గురువు గారూ అన్నాడు గోపాత్రుడు. వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా...
ఇపుడు 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది కదా. అధికారానికి దూరంగా ఉంటే నా శిష్యుడు చంద్ర బాబు నాయుడికి నిద్ర పట్టదు కదా, అంచేత అధికారంలో ఉన్న బీజేపీలోకి తనకు నమ్మకస్తులైన నలుగురు రాజ్యసభ సభ్యులను పంపేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌లోనూ మన మనిషి ఉంటే బాగుంటుందని రేవంత్ రెడ్డిని పంపేశారు. మరో నేత రమణను అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌లోకి పంపారు. వీళ్లంతా ఎల్లో వేరియంట్లలో మ్యుటేషన్ చెందిన వారే. టీడీపీ లాగే కాంగ్రెస్ నుండి కూడా ఇలాగే చాలా మంది నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేశారు. వారంతా కాంగ్రెస్ వేరియంట్లు. అయితే కాంగ్రెస్ నుండి వేరే పార్టీల్లో చేరిన వాళ్లు ప్రమాదకారులు కారు.
టీడీపీ నుండి వెళ్లిన ఎల్లో వేరియంట్లు మాత్రం ఏ పార్టీలో చేరినా అక్కడ పదవులు పొంది పనులు చేయించుకుంటూనే టీడీపీ అజెండాను భుజాలకెత్తుకుంటారు. చంద్రబాబుకు మేలుచేసే విధంగానే మాట్లాడతారు. కాంగ్రెస్‌కూ ఎల్లో వేరియంట్లకూ ఉన్న తేడా అదే అన్నాడు గిరీశం. ఎల్లో వేరియంట్లను చంద్రబాబే ఇతర పార్టీల్లోకి చొప్పించారు. అని వివరించాడు గిరీశం. మరయితే చంద్రబాబు మీ శిష్యుడన్నారేంటి? అని అడిగాడు గోపాత్రుడు. అవును నా లాంటి వందమంది కలిస్తే ఓ చంద్రబాబు. ఒక విధంగా నన్ను చూసి అతను ఇన్సై్పర్ అయినా.. గురువును మించిన శిష్యుడన్నమాట. నేను పూటకో అభిప్రాయం మారిస్తే చంద్రబాబు నిముషానికి అరవై అభిప్రాయలు మార్చగలరు. మన వారసుడే అనుకో అని గిరీశం తెగ పొగిడేశాడు.
సరిగ్గా అప్పుడే వీధి తలుపు ఎవరో కొడితే.. గోపాత్రుడు వెళ్లి చూసి వచ్చి మీ కోసం ఆయన వచ్చారు అన్నాడు. ఎవర్రా అని గిరీశం ఆత్రంగా అడిగాడు. అదే.. మీ శిష్యుడు చంద్రబాబునాయుడు వచ్చారు మీతో మాట్లాడాలట అన్నాడు గోపాత్రుడు. చంద్రబాబు పేరు వినగానే గిరీశానికి ముచ్చెమటలు పట్టాయి. నేను లేనని చెప్పు అన్నాడు. గోపాత్రుడు అలాగే అని చెప్పి చంద్రబాబును పంపేశాడు. అదేంటి గురువుగారూ మీరు భయపడ్డం మొదటిసారి చూస్తున్నాను అన్నాడు. ఇందాకే చెప్పాను కదా. చంద్రబాబు చాలా డేంజరస్. నేను చెప్పిన ఫిలాసఫీని కాపీ కొట్టేసి అందరూ నన్ను మర్చిపోయేలా చేశాడు. ఇప్పుడు చాలా మందికి గిరీశం అంటే తెలీదు. కారణం నా ప్లేస్‌ని ఇమేజ్‌ని చంద్రబాబు కొట్టేశాడు. ఇపుడు ఇంట్లోకి రానిస్తే ఇంకేం చేస్తాడో అని హడలి చచ్చా అన్నాడు గిరీశం. గిరీశం గారు నాకు గురువైతే.. చంద్రబాబు నాయుడు జగద్గురువు అన్నమాట అనుకున్నాడు గోపాత్రుడు మనసులో. - సి.ఎన్.ఎస్. యాజులు
Comments
Please login to add a commentAdd a comment