
రాజకీయాలలో అవినీతి, విలువల గురించి చంద్రబాబు నాయుడు ఒక మీడియా సమావేశంలో ప్రసంగించారని వార్త వచ్చింది. అది ఆశ్చర్యం కలిగిం చేది కాదు. ఎవరు ఏమి అను కున్నా ఆయన పెద్దగా ఫీల్ కారు. అది రాజకీయ నేతలకు ఉండవల సిన ముఖ్య లక్షణమని ఆయన భావిస్తుండవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంస్థలలో పెట్టుబడుల గురించి, ఆదాయపన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు గమనించండి. జగన్ సంస్థలలో పెట్టుబడులు అవినీతి కాదని ఆదాయపన్ను శాఖ అంటే ఈ దేశంలో చేయగలిగింది ఏమీ లేదని ఆయన అన్నారట.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కలిసి జగన్‌పై చంద్రబాబు కేసులు పెట్టించారన్నది బహిరంగ రహస్యం. సోనియాగాంధీ ఆదేశాలను జగన్ ధిక్కరించడమే ఆమె ఆగ్రహానికి కారణం. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు రాసిన లేఖ, ఆ తర్వాత దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు, మరో నేత అశోక్ గజపతిరాజు కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అవడం, దానిపై హడావుడిగా న్యాయ వ్యవస్థ సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వడం, తదుపరి ఆ న్యాయ మూర్తికి ఏపీలో ఒక ఉన్నత పదవి లభించడం... ఇవన్నీ చరిత్ర చెరిపేస్తే చెరగని గుర్తులు. ఏ కేసులో లేని విధంగా జగన్‌ను 16 నెలలు జైలులో ఉంచడంలో సోనియా, చంద్ర బాబు సఫలం అయి ఉండవచ్చు. ఏ కేసు అయినా సాధా రణంగా 90 రోజులలో బెయిల్ ఇవ్వాలని నిబంధన ఉన్నా, ఈ కేసులో మాత్రం జగన్‌కు బెయిల్ లభించక పోవడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఇలాంటి కేసులో జగన్ తప్ప ఇంకెవరు ఉన్నా 3 రోజులలో బెయిల్ వచ్చేదని ఒక ప్రముఖ న్యాయవాది నాతో ఒకసారి చెప్పారు.
1978లో కాంగ్రెస్–ఐ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్పుడు ఏమి చేసింది చంద్రబాబు మర్చిపోయి ఉండ వచ్చు. తన మామ అధికారంలోకి రావడంతోనే వెంటనే టీడీపీలోకి దూకేసి, తదుపరి కర్షక పరిషత్ పదవి పొందడం విలువలతో కూడినదే అనుకోవాలి. అప్పట్లో ఈయనపై ఒక ప్రముఖ దినపత్రిక ఈయనపై పది, పర కకు లొంగరు అంటూ వేసిన కార్టూన్ గురించి కొందరు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ తర్వాతి పరిణామాలలో చంద్రబాబుకు ఆ పత్రిక యజమాని అత్యంత సన్నిహితు డుగా మారి ఉండవచ్చు. అది వేరే సంగతి!
ఆదాయ పన్ను శాఖకు సలహాలు ఇస్తున్న చంద్ర బాబు తాను 1989 శాసనసభ ఎన్నికలలో ఏడాదికి 36 వేల రూపాయల ఆదాయాన్ని చూపారు. ఆ తర్వాత ఆయన ఆదాయం కోట్లకు వెళ్లింది. అదంతా పాలు, మజ్జిగ అమ్మి సంపాదించిందని అప్పట్లో టీడీపీ నేతలు ఆయనకు మద్దతుగా చెప్పేవారు. కానీ చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు, వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారు? అసలు ఎన్నికలను ఖరీదైన వ్యాపారంగా మార్చిందే చంద్రబాబు. అప్పటి ముఖ్యమంత్రి అయిన తన మామ ఎన్.టి. రామారావును పదవి నుంచి లాగేసి తాను ఆ సీటులోకి ఎక్కిన తర్వాత 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు మొదలు 2019లో జరిగిన ఎన్నికల వరకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారో ఆయన ఆత్మను అడిగితే చెబుతుంది.
సుజనా చౌదరికి రెండుసార్లు ఏ ప్రాతిపదికన రాజ్య సభ సీటు ఇచ్చారు? ఒక సమావేశంలో మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డి ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిం చినప్పుడు పార్టీకి సుజనా ఎంత ఇచ్చింది వెల్లడించి ఆయన నోరు మూయించింది అవాస్తవమా? ఆ తర్వాత కాలంలో సుజనా గ్రూప్ బ్యాంకులకు ఎన్నివేల కోట్లు ఎగ వేసిందో బయటపడింది కదా? మరో ఎంపీ సి.ఎం.రమేష్ మొదట ఏ వ్యాపారం చేసింది, ఆ తర్వాత ఆయన ఎలా కాంట్రాక్టర్ అయింది... ప్రస్తుతం తన ఇంటి పక్కనే ఉంటున్నారు కదా, ఆదాయపన్ను శాఖ దాడులు చేసి ఏమి కనిపెట్టింది... ఇవన్నీ చంద్రబాబుకు తెలియదనుకోవాలి. వీరందరి సంగతి ఎందుకు... తన వద్ద సుదీర్ఘకాలం పీఎస్‌గా పనిచేసిన వ్యక్తి ఇంటిపై సీబీఐ దాడి చేసి రెండువేల కోట్ల మేర అక్రమాలు కనుగొన్నట్లు అధికారిక ప్రకటనే వచ్చింది కదా! దాని గురించి ఎన్నడైనా చంద్ర బాబు వివరణ ఇచ్చారా?
తన సొంత కంపెనీ హెరిటేజ్ షేర్లపై రాజకీయ పక్షాలు ఒక ఆరోపణ చేస్తుంటాయి. చంద్రబాబు అధికా రంలో ఉంటే షేర్ విలువ పెరిగిపోతుందట. అంతేకాదు, డిమానిటైజేషన్‌కు ముందుగా ఆయన కంపెనీ షేర్లను విక్రయించడంలో మతలబు ఏమిటని కూడా కొందరు ప్రశ్నించారు. తన వెనుక పెద్ద మచ్చ పెట్టుకుని ఎదుటి వారికి మచ్చలున్నాయని ప్రచారం చేయడం రాజకీయా లలో ఒక విశిష్ట లక్షణం.
నిజానికి జగన్‌పై కేసులు పెట్టించడం వల్ల ఏపీకి రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోయాయి. దీనికి కారణం సోనియాగాంధీ, చంద్రబాబు, సీబీఐ అధికారి ఒకరు అని చెప్పవచ్చు. ఉదాహరణకు చీరాల వద్ద భారీ పరిశ్రమలు స్థాపించడం కోసం 13 వేల ఎకరాల భూమి సేకరించారు. అక్కడ పవర్ స్టేషన్లు, ఓడరేవు తదితర పలు పరిశ్రమలు వస్తాయని భావించారు. కానీ ఈ కేసు కార ణంగా మొత్తం ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. నిజానికి పరి శ్రమలు పెడతామని పెట్టకపోతే వారిపై చర్యలు తీసు కోవడమో, అవసరమైతే అరెస్టులు చేయడమో జరగాలి. కానీ మన దేశంలో పరిశ్రమలు పెట్టి వేలమందికి ఉపాధి కల్పిస్తున్న పారిశ్రామికవేత్తలను, తమ అధికారాన్ని ధిక్క రించేవారిని అరెస్టు చేస్తుంటారు. బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టేవారు, పరిశ్రమలు పెడతామని పెట్ట కుండా మోసం చేసేవారు మాత్రం అధికార పార్టీలో ఉంటే కేసులే ముందుకు కదలవు. ఇది దేశానికి ఎంతవరకు ప్రయోజనమో అందరూ ఆలోచించాలి.
వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు