క్రిప్టో నియంత్రణకు సమయం ఇదే! | Pavan Duggal Article On Cryptocurrency | Sakshi
Sakshi News home page

క్రిప్టో నియంత్రణకు సమయం ఇదే!

Published Thu, Nov 25 2021 12:58 AM | Last Updated on Thu, Nov 25 2021 10:13 AM

Pavan Duggal Article On Cryptocurrency - Sakshi

దేశంలో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెడుతున్న వారిలో చాలామంది బోలెడన్ని లాభాలు వచ్చిపడతాయన్న నమ్మకంతో ఉన్నారు. కొంతమందికి డబ్బుల లాటరీ తగలడం వరకూ నిజమే కావచ్చు. కానీ.. మిగిలిన చాలామంది నష్టాల బారిన పడే అవకాశాలే ఎక్కువ. క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై భారత్‌లో ఇప్పటికీ సరైన చట్టాలు లేవన్న విషయం గుర్తుంచుకోవాలి. క్రిప్టో వ్యవహారాలు చాలావరకూ అంతర్జాతీయ ప్లాట్‌ఫార్మ్‌పై, బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తూంటాయి.

కాబట్టి నిషేధం విధించడం ఏ రకంగానూ పరిష్కారం చూపదని నిపుణుల భావన. క్రిప్టో కరెన్సీని నిషేధించడం కంటే, దాని నియంత్రణే సరైన మార్గమని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. దీంతో క్రిప్టో కరెన్సీని చట్టబద్ధంగా పన్ను పరిధిలోకి తీసుకొచ్చి లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుందని ఖాయంగా తెలుస్తోంది.

భారత్‌ ఇప్పుడు ఓ కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది! క్రిప్టో కరెన్సీలు, ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతున్న వారు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నారు. వార్తాపత్రికలు, టెలివిజన్‌ ఛానళ్లలో ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ప్రకటనలు క్రిప్టో క్రేజ్‌ను మరింత పెంచాయి. క్రిప్టో సంబంధిత ఆస్తులు, కరెన్సీలపై అన్నివైపులా ఉత్సాహం వెల్లువెత్తుతున్న విషయం నిజమే అయినప్పటికీ ఈ అంశం చుట్టూ ఉండే పరిస్థితులు మాత్రం అంత అనుకూలంగానైతే లేవు. క్రిప్టో కరెన్సీ, ఆస్తుల విషయాల్లో ప్రభుత్వాలు విధానపరంగా ఎలా వ్యవహరిస్తాయి? తప్పులు జరక్కుండా ఎలా నియంత్రిస్తారు? వంటి ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాలు రావాల్సి ఉంది.

క్రిప్టో వ్యవహారాల్లో ఎలా వ్యవహరించాలన్న అంశంపై భారత ప్రభుత్వం ఇప్పటికీ కొంత అస్పష్టతతోనే ఉన్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ఆర్‌బీఐ క్రిప్టో వ్యవహారాలు నిర్వహించే చట్టబద్ధ సంస్థలకు బ్యాంకింగ్‌ సర్వీసులు అందవని ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తరువాత సుప్రీంకోర్టు దీన్ని పక్కనబెట్టింది. అయితే ఈ క్రమంలోనే క్రిప్టో అంశాలపై అన్ని నిర్ణయాలు తీసుకునే నోడల్‌ అథారిటీ ఆర్‌బీఐ మాత్రమేనని కూడా తన చారిత్రాత్మక తీర్పు ద్వారా స్పష్టం చేసింది కూడా. ఇంకోపక్క ఆర్‌బీఐ స్వయంగా తనదైన క్రిప్టో, డిజిటల్‌ కరెన్సీలను ప్రవేశపెట్టవచ్చునన్న ప్రకటనలూ కొన్ని వెలువడ్డాయి. 

అయితే ఇక్కడ కొన్ని విషయాలను స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేశంలో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెడుతున్న వారిలో చాలామంది బోలెడన్ని లాభాలొస్తాయన్న ఆశతో ఉన్నారు. కొంతమందికి డబ్బుల లాటరీ తగలడం వరకూ నిజమే కావచ్చు. కానీ.. మిగిలిన చాలామంది నష్టాల బారిన పడే అవకాశాలే ఎక్కువ. 2000 నాటి ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాన్నే తీసుకుంటే.. క్రిప్టో వ్యవహారాలకు, దీనికీ అస్సలు పొంతన లేకుండా ఉంటుంది.

ఈ చట్టంలో క్రిప్టో కరెన్సీ, ఆస్తుల విషయంలో ఎలా వ్యవహరించాలన్న విషయానికి ఏ విధమైన వెసలుబాట్లూ లేవు. క్రిప్టో కరెన్సీలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన చట్టమే కాదు ఇది. ఐటీ చట్టాన్ని 2008లో చివరిసారి మార్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నో మార్పులు వచ్చిపడ్డాయి. మరీ ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో క్రిప్టో కరెన్సీ, ఆస్తుల వ్యవహారాలు గణనీయంగా పెరిగాయి. ఈ నిమ్మకు నీరెత్తిన ధోరణి ఏమాత్రం సరికాదన్న స్పృహ ఇప్పుడిప్పుడే భారత్‌ గుర్తిస్తోంది. దీనిపై స్పష్టమైన విధానాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంది. 

నిషేధం మార్గం కానే కాదు...
క్రిప్టో వ్యవహారాలపై నిషేధం విధిస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే నిషేధాలు అంత మంచిపని కాదన్నది ఇప్పటికే చాలా అంశాల విషయంలో స్పష్టమైంది. పైగా ఇంటర్నెట్‌ పుణ్యమా అని ప్రపంచమంతా ఒక కుగ్రామమైపోయిన ఈ రోజుల్లో అస్సలు సరి కాదు. క్రిప్టో వ్యవహారాలు చాలావరకూ అంతర్జాతీయ ప్లాట్‌ఫార్మ్‌పై, బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తూంటాయి. కాబట్టి నిషేధం విధించడం ఏ రకంగానూ పరిష్కారం చూపదు. కాబట్టి నిషేధం కంటే.. క్రిప్టో వ్యవహారాలకు చట్టపరమైన గుర్తింపునివ్వడమే కాకుండా.. కనీస నియంత్రణకు విధానాలు రూపొందించడం మేలు.  బెలరూస్, మాల్టాలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు.

బ్లాక్‌చెయిన్‌ ఐలాండ్‌గా పేరొందిన మాల్టాలో వీటికి సంబంధించి మూడు వేర్వేరు చట్టాలు చేశారు. క్రిప్టో వ్యవహారాలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న దేశాలు కూడా మనం ఏ రకంగా వ్యవహరించాలో తెలిపే సూచికలు అవుతాయి. మొత్తమ్మీద చూస్తే... మన దేశానికి సరిగ్గా సరిపోయే విధానం ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో ప్రత్యేకంగా లేదు. అంటే.. పలు దేశాల విధానాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని వాటిల్లోని మంచి అంశాలతో మనకు ఉపయోగపడే విధానాన్ని రూపొందించుకోవాలి. 

క్రిప్టో వ్యవహారాల్లో కరెన్సీ అంశంపై భారత్‌కు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. క్రిప్టో కరెన్సీ కోసం ప్రత్యేకంగా బ్యాంకులేవీ లేని నేపథ్యంలో ఇవేవీ అర్థం చేసుకోలేనంత క్లిష్టమైనవీ కావు. ఈ నేపథ్యంలో భారత్‌ క్రిప్టో కరెన్సీ విషయంలో సంప్రదాయ మార్గాల ద్వారానే విధాన రూపకల్పన చేయవచ్చు. అందుబాటులో ఉన్న ఆచరణ సాధ్యమైన అంశాలతో మొదలుపెట్టి క్రమేపీ చట్టం పరిధిని విస్తరింపజేయవచ్చు కూడా. 

ఇంకో ముఖ్యమైన విషయం. బ్లాక్‌చెయిన్‌/క్రిప్టో వ్యవహారాల్లో పెట్టుబడులు పెడుతున్న వారి రక్షణ కోసం తగిన చట్టాలు అవసరం. అంతేకాదు. క్రిప్టో వ్యవహారాల్లో సేవలందించే వారి కోసం ప్రత్యేక నియమ నిబంధనల అవసరం ఏమీ ఉండరాదు. క్రిప్టో వ్యవహారాలు కేవలం భవిష్యత్తు అంచనాలపైనే ఆధారపడి ఉంటాయన్న విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ అవి కాలంతోపాటు పెరుగుతూనే ఉంటాయి.

కాబట్టి ఈ అంశంలో మాత్రం ఏ చట్టం కూడా సాయపడదు. కానీ.. పెట్టుబడులు పెట్టే వారి హక్కులకు రక్షణ ఉండేలా చట్టంలో కొన్ని ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి. పెట్టుబడిదారుల హక్కుల రక్షణ అన్న అంశం అస్పష్టమైందే. కానీ నిపుణులతో సంప్రదింపులు జరపడం ద్వారా స్పష్టత సాధించాల్సిన అవసరం ఇప్పుడు ప్రభుత్వానికి ఏర్పడింది. క్రిప్టో వ్యవహారాల నియంత్రణకు భారత్‌ ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా... పలు దేశాలు దీనిపై దృష్టి పెడతాయన్నది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. సంపూర్ణమైన, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకునే నిర్ణయం ప్రస్తుతం చాలా అవసరం. 

క్రిప్టో వ్యవహరాలు వర్తమానానికి సంబంధించినవే అయినప్పటికీ అవి భవిష్యత్తుకు సూచికలన్న విషయం మరచిపోరాదు. కాబట్టి క్రిప్టో వ్యవస్థ అభివృద్ధిని ఏ విధంగానూ కుంచించని, తక్కువ చేయని విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. వ్యాపార, చట్ట అవసరాల దృష్ట్యా మాత్రమే కాకుండా.. వినియోగదారులు, పెట్టుబడులు పెట్టే వారి అందరి ప్రయోజనాలను కాపాడే విధంగా ఈ క్రిప్టో చట్టాలు ఉండాలి. అదే సమయంలో దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రతలపై ఏమాత్రం రాజీ పడాల్సిన అవసరం లేకుండా జాగ్రత్త పడాలి.

క్రిప్టో కరెన్సీ నియంత్రణ దిశగా...
భారత్‌లో క్రిప్టోకరెన్సీపై ప్రజలు మక్కువ చూపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మితిమీరుతున్న క్రిప్టో కరెన్సీ వాడకంపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీల నిషేధానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అదే సమయంలో ప్రభుత్వం ఆమోదించే డిజిటల్‌ కరెన్సీని ప్రోత్సహించనున్నారు. ఈ అంశంపై ఇటీవలే వివిధ మంత్రిత్వ శాఖలు, ఆర్బీఐ అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత సమావేశం నిర్వహించారు.

అయితే ప్రపంచమంతటా విస్తృతంగా అమల్లో ఉన్న క్రిప్టో కరెన్సీని నిషేధించడం తగదని, దాని నియంత్రణే సరైన మార్గమని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. దీంతో క్రిప్టో కరెన్సీని చట్టబద్ధంగా పన్ను పరిధిలోకి తీసుకొచ్చి లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించింది. నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 23 వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ నియంత్రణపై కేంద్రప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుందని తెలిసింది.

క్రిప్టో కరెన్సీని అధికారికంగా గుర్తించాలనే డిమాండ్‌ పెరుగుతున్నం దున అటు ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలను నిషేధించడం, ఇటు ‘ది క్రిప్టో కరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫీషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్‌ 2021’ని పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఖాయమని తెలుస్తోంది. – పవన్‌ దుగ్గల్, సైబర్‌ చట్టాల నిపుణుడు 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement