బిహార్‌లో 2020 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల సంరంభం సాదాసీదాగా ప్రారంభమైంది. ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుం దని, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘటబంధన్ (మహాకూటమి) ఈ ఎన్నికల్లో విఫలం కానుం దని, లేదా ప్రత్యర్థిని దృఢంగా ఎదుర్కోలేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, తర్వాత్తరువాత పరిణామాలు మారసాగాయి. నితీశ్–బీజేపీ కూటమి ఇప్పటికే గెలిచేసిందని, కానీ లాలూ జైలు నుంచి విడుదలై ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. అయితే కరోనా లాక్ డౌన్ వ్యథలు, వరదల కారణంగా ప్రతిష్ట కోల్పోయిన నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని అందరూ అంగీకరిస్తున్నా తేజస్వి ప్రభావంపై మాత్రం పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. నితీశ్ తన తొలి రెండు దఫాల పాలనలో రహదారులు, విద్యుత్, శాంతిభద్రతలను గణనీయంగా మెరుగుపర్చారు కానీ తన మూడో దఫా పాలన మాత్రం ప్రజల ఆశల్ని వమ్ముచేసింది. అయితే ప్రజలు ఇంకా తేజస్విని తమ నాయకుడిగా గుర్తించడానికి సిద్ధం కానందున నితీశ్‌కి ఈ ఎన్నికల్లో ప్రత్యామ్నాయం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా, పరిణామాలు అలాగే ఉంటున్నాయి. కానీ మహాకూటమి ఒక స్థిరమైన రూపం తీసుకోగా, ఎల్జేపీ మాత్రం ఎన్డీఏ నుంచి విడివడి ఒంటరిపోరుకు సిద్ధమై నితీశ్‌పై తీవ్ర దాడికి దిగుతుండటంతో అధికార కూటమి షాక్ తింది. జేడీయూ నుంచి ఎగువ కులాల ఓట్లను కొల్లగొట్టడానికి లోక్ జనశక్తి నేత చిరాగ్ పాశ్వాన్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. నితీశ్ పార్టీ పోటీ చేస్తున్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఎగువ కులాల అభ్యర్థులనే పోటీకి దింపడం ద్వారా చిరాగ్ బీజేపీకి కూడా చికాకు పుట్టించారు.
ఏదేమైనా, మహాకూటమి ఈ మొత్తం వ్యవహారంలో అతిపెద్ద లబ్ధిదారు అయింది. ఎన్డీఏలో అనైక్యతను ప్రాతిపదికగా చేసుకుని తన్ను తాను సంఘటితం చేసుకుంది. పైగా తనను గెలిపిస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానంటూ చేసిన ఎన్నికల హామీ వల్ల యువ ఓటర్లు ఒక్కసారిగా తేజస్వి పార్టీపట్ల ఆకర్షితులయ్యారు. ఎందుకంటే బిహార్‌లో నిరుద్యోగిత ఎప్పుడూ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటమే కాదు.. ఉద్యోగాలు, ఉపాధికోసం తరాలుగా బిహారీ యువత వలస బాట పడుతోంది. అయితే తేజస్వి యాదవ్ ఉపాధి హామీ ఆచరణ సాధ్యం కాదని బీజేపీ, జేడీయూ మొదట్లో కొట్టిపారేసినప్పటికీ తేజస్వి హామీ పట్ల ప్రజలు అసాధారణంగా స్పంది స్తుండటంతో తమ వైఖరి మార్చుకుని తమను గెలిపిస్తే 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కొత్త పాట మొదలెట్టాయి. మొత్తంమీద ఈ అంశంలో మహా కూటమి ఎన్డీఏని ఆత్మరక్షణలోకి నెట్టేసింది.
మహాకూటమి ఇంకా ఏర్పడక ముందు సీఎస్‌డీఎస్–లోక్‌నీతి సంస్థ నిర్వహించిన పోల్ సర్వే ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తేజస్వి యాదవ్ కంటే నితీశ్ కేవలం నాలుగు పాయింట్ల ఆధిక్యతలో ఉండేవారు. కానీ ఆ సర్వే తర్వాత ఎన్డీఏ వోటు షేర్ తగ్గిపోతూ వచ్చింది. అదే సమయంలో మహాకూటమి పుంజుకుంటూ వచ్చింది. పైగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరి ప్రజాదరణ ఈ ఎన్నికల్లో తగ్గుముఖం పడుతూ వస్తోందని, ముఖ్యంగా నితీశ్‌కి మరో దఫా అధికారం కట్టబెట్టకూడదని సర్వేలకు స్పందిస్తున్న వారిలో మెజారిటీ భావిస్తున్నారు. అయితే మహా కూట మిపై ఎన్డీఏ ఇప్పటికే ఆరు పాయింట్ల ఆధిక్యతతో ఉన్నందున ఎన్డీఏ సులువుగా గెలుస్తుందని సర్వేలు ఇప్పటికీ అంచనా వేస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి అలా కనిపించడం లేదు. ఎందుకంటే నలుగురు ఓటర్లలో ఒకరు నేటికీ తామెవరికి ఓటెయ్యాలో తేల్చుకోవడం లేదని ప్రచారం ముగిసిన తర్వాత తమ అభిప్రాయం మారవచ్చని చెబుతున్నారు. దీంతో విశ్లేషకులు సైతం తమ స్వరం మార్చారు. తాజాగా బిహార్‌లో ఎవరు సీఎం అనే దాంతో పనిలేకుండా సీట్లవారీగా పోటీ తీవ్రరూపం దాల్చిందని వీరు చెబుతున్నారు.
కాగా 2010లో ఎల్జేపీతో పొత్తుకుదుర్చుకున్న ఆర్జేడీ.. లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 22 స్థానాలతో సరిపెట్టుకుంది. కానీ ఈ దఫా ఎన్నికల్లో ఆర్జేడీ కనీసం 60 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు చెబుతున్నప్పటికీ, మహా కూటమి వంద స్థానాలు చేజిక్కించుకుంటుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కోవన తన తండ్రి లాలూతో పోలిస్తే తేజస్వి యాదవ్
తన పార్టీ విజయావకాశాలను గణనీయంగా మెరుగుపర్చినట్లేనని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం తండ్రీ కుమారుల నాయకత్వ శైలిలో వ్యత్యాసాలే. లాలూ ప్రసాద్ ఎల్లప్పుడూ అహంభావంతో, దృఢవైఖరితో ఉండగా, పరిస్థితులకు తగ్గట్టుగా మారటం, ముందుచూపుతో వ్యవహరించడం వల్ల సౌమ్యుడైన, నమ్రత కలిగిన నేతగా తేజస్వి యాదవ్ ముందుకొచ్చారు. లాలూతో పోలిస్తే మహాకూటమికి వెలుపల ఉన్న ఓటర్లలో తేజస్వి పట్ల వ్యతిరేక భావం లేకపోవడం. బలహీన వర్గాల పట్ల పూర్తి సానుకూలత, ఎగువకులాల పట్ల బహిరంగ వ్యతిరేకతకు లాలూ చాంపియన్ కాగా, తేజస్వి ఈ ఉచ్చులో ఇరుక్కోకుండా ఓబీసీల నేత మాత్రమే అనే బ్రాండ్‌కు దూరం జరిగారు.
సామాజిక న్యాయం అనే ఒక్క అంశంపై లాలూ తన దృష్టి కేంద్రీకరించేవారు. కానీ తేజస్వి మాత్రం ఆర్థిక న్యాయం భావనకు కూడా ప్రాధాన్యతనిచ్చి ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు కూడా ప్రాధాన్యమిస్తూ ఇటీవల ప్రకటనలు చేశారు. పైగా మహాదళితులు, గ్రామీణ పేదలు, ప్రత్యేకించి సీపీఐ(ఎమ్‌ఎల్) వంటి ప్రజాపునాది కలిగిన వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి తేజస్వి ప్రయత్నించి నెగ్గారు కూడా. తండ్రి లాలూ మాత్రం సివాన్ ప్రాంతంలో ఎమ్‌ఎల్ నాయకత్వాన్ని నిర్మూలించడానికి సహాబుద్దీన్ వంటి బలమైన ఆర్జేడీనేతలను పురికొల్పారు. సామాజిక, ఆర్థిక కోణంలో ఎమ్‌ఎల్ పార్టీకున్న ప్రజా పునాదిని గుర్తించిన తేజస్వి తన తండ్రి పంథాను తిరుగుముఖం పట్టించి మహాకూటమిలో ఎమ్‌ఎల్ పార్టీని చేర్చుకోవడం ద్వారా అదనపు లబ్ధి పొందారు. దీనికోసం ఆర్జేడీకి బలంగా ఉన్న కొన్ని సీట్లను వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు.
పైగా, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై తేజస్వి చేసిన సాహస ప్రకటన ఎన్డీఏ ఓటర్లలోని యువతను కూడా ఆకర్షించింది. ఉద్యోగాల కల్పన పైనే ఆర్జేడీ ఈ ఎన్నికల్లో పోరాడుతోందని సీఎస్‌డీఎస్ సర్వేలో పాల్గొన్నవారిలో మెజారిటీ అబిప్రాయపడ్డారు. అందుకే లాలూ పాలనలో తీవ్రస్థాయిలో జరిగిన అవినీతి, దుష్పరిపాలన గురించి య«థా ప్రకారం ఎన్డీఏ ప్రచారం చేపట్టినా ఈ ఎన్నికల్లో అది పనిచేయడం లేదు. ఎందుకంటే తండ్రి చేసిన తప్పులు తనయుడికి అంటవని ప్రజల మనోగతం. ఈ క్రమంలోనే తేజస్వి మచ్చలేని నేతగా ముందుకొచ్చి ప్రజల హృదయాలను గెల్చుకున్నారు. పైగా ఎగువకులాల్లోని విద్యావంత యువతలో గణనీయమైన భాగం ఈసారి ఉద్యోగాల కల్పన ప్రాతిపదికన మహాకూటమికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో లాలూ యాదవ్ ఆర్జేడీ పట్ల వీరికున్న తీవ్ర వ్యతిరేకత ఇప్పుడు తేజస్వి నాయకత్వంలోని ఆర్జేడీ పట్ల కనిపించడం లేదు.
అయితే కొంతకాలం క్రితం వరకు ఎన్డీఏకు ఏకపక్ష గెలుపు తథ్యమని, తేజస్వి నాయకత్వంలోని మహాకూటమి విజయవంతం కాదని కొనసాగుతూ వచ్చిన అభిప్రాయాలు మారుతున్నాయని భావించవచ్చు. అస్తిత్వ, కుల ప్రాతిపదిక సమీకరణాలతో ప్రధానంగా నడిచే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏనే ముందంజలో ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఈబీసీలు, మహాదళితులు, మహిళా ఓటర్లలో మెజారిటీ నితీశ్‌కు మద్దతిస్తుండగా, ఎగువకులాలు, బనియాలు బీజేపీని బలపరుస్తున్నారు. ఇది మహాకూటమికంటే బలమైన దన్ను కలిగి ఉంది. అదే సమయంలో మహాకూటమికి ముస్లింలు, యాదవుల మద్దతు మాత్రమే అధికంగా ఉంటోంది. ఇక వామపక్షాల మద్దతు కారణంగా మహాదళితులు, ఈబీసీలలో కొంతమంది బలం కూడా ఈసారి తేజస్వికే దక్కవచ్చు. మరి ఓటర్ల నిర్ణయం మారుతోందంటున్న వార్తలు మీడియా కల్పన మాత్రమేనా.. క్షేత్రవాస్తవానికి ఇది పూర్తి భిన్నంగా ఉందా అంటే సమాధానం కాదు అనే చెప్పాలి.
నితీశ్ ఓటుబ్యాంక్ ఈసారి జాగరూకతతో ఉంటూండటం ఎన్డీయేకు అయోమయం కలిగిస్తోంది. పైగా ఎల్జేపీ ద్వారా నితీశ్‌కు బీజేపీ మొండి చేయి చూపనుందన్న అంచనా కూడా ఉంటోంది. దీంతో ఎగువ కులాల ఆధిక్యత మళ్లీ బిహార్‌లో పెరిగే అవకాశం ఉందని ఓటర్లు భయపడుతున్నారు. బిహార్ సామాజిక, రాజకీయ చరిత్రలో ఎగువ కులాల ఆధిక్యతకు వ్యతిరేకంగా ఓబీసీలు, ఈబీసీలు, మహాదళితులు, మైనారిటీలను సంఘటితపర్చాలంటే బలహీన వర్గాల ప్రాధాన్యతావాదమే ఎప్పుడూ ముందుపీటికి వచ్చి నిలబడేది. పైగా ఈసారి జాగరూకతతో ఉంటున్న వర్గాలు సైతం యాదవుల ఆధిపత్యం పట్ల పెద్దగా భయపడటం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2015లో ఆర్జేడీతో పొత్తు కలపటం ద్వారా నితీశ్ స్వయంగా ఈ మార్పునకు నాంది పలకడమే. లాలూతో పోలిస్తే తేజస్వియాదవ్ పట్ల జనంలో ఏర్పడిన సానుకూలత దీనికి బోనస్‌గా పనిచేస్తోంది.
మారుతున్న ఈ సామాజిక గతిశీలతే బిహార్ ఎన్నికల సమీకరణాలను మార్చివేస్తోంది. బలహీనస్థానంలో ఉన్న నితీశ్‌కు సహాయం అందించకపోవడం ద్వారా అంతిమంగా మహాకూటమికే బీజేపీ పరోక్షంగా అనుకూలతను సృష్టించిపెట్టింది. ఎన్డీయే తన ఇంటిని చక్కదిద్దుకోవడంలో విజయవంతమైతే, నితీశ్ ద్వారా ఈబీసీ, మహాదళిత ఓటర్లలోని మెజారిటీనీ తనవైపు తిప్పుకుని బీజేపీ విజయం సాధించగలదు. కానీ బిహార్‌లో ఏదీ నిశ్చితంగా ఉండదు. ఎన్డీయేలో అంతర్గత పోరువల్ల తేజస్వి నేతృత్వంలోని మహాకూటమి ఈ ఎన్నికల్లో జేడీయూ ఓటుబ్యాంకును దెబ్బ తీస్తున్నందున ఏక పక్ష ఎన్నికలుగా నిన్నమొన్నటిదాకా భావిస్తూ వచ్చినవి ఇప్పుడు ఒక్కో సీటుకు తీవ్రమైన పోటీ తప్పని ఎన్నికలుగా మారిపోయాయి. ఈ ఒక్క అంశమే బిహార్ గడ్డపై తేజస్వి బలమైన నేతగా ఆవిర్భవిస్తున్నట్లు సంకేతాలు పలుకుతోంది.
(ది వైర్ సౌజన్యంతో)
రాజన్ పాండే
వ్యాసకర్త రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు,
రాయల్ గ్లోబల్ యూనివర్సిటీ, గౌహతి
Comments
Please login to add a commentAdd a comment