డాక్టర్‌ అంబేడ్కర్‌... జాతినిర్మాణ రూపశిల్పి | Rajasekhar Undru Article On Ambedkar Birth Anniversary | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ అంబేడ్కర్‌... జాతినిర్మాణ రూపశిల్పి

Published Wed, Apr 14 2021 2:23 AM | Last Updated on Wed, Apr 14 2021 11:42 AM

Rajasekhar Undru Article On Ambedkar Birth Anniversary - Sakshi

స్వాతంత్య్రోద్యమ కాలంలో సామాజిక, రాజకీయ హక్కుల కోసం అంబేడ్కర్‌ నిరంతర పోరాటం చేయడమే కాకుండా పౌరుల స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం సమాంతర ఉద్యమాన్నే తీసుకొచ్చారు. ఈ అంశంపై జాతిని అంగీకరించేలా చేశారు. 

మహాత్మాగాంధీ నేతృత్వంలో సాగిన స్వాతంత్య్ర ఉద్యమానికి సమాంతరంగా నిలబడి, భారతీయ సామాజిక అణచివేత చట్రాన్ని సవాలు చేసిన మహనీయ మూర్తులలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఒకరు. స్వాతంత్య్రానంతరం తొలి చరిత్రకారులు అంబేడ్కర్‌ను విస్మరించినప్పటికీ, నేడు మనం నివసిస్తున్న భారత దేశాన్ని తీర్చిదిద్దడంలో అంబేడ్కర్‌ ముద్రను, ఆయన పాత్రను గుర్తించడానికి ఎక్కువ కాలం పట్టలేదు.

బ్రిటిష్‌ వారి నుంచి స్వాతంత్య్రం అంటే దేశ స్వాతంత్య్రమేనని అర్థం చేసుకున్న అంబేడ్కర్‌ స్వతంత్ర దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రం అనే సమస్యపై చర్చ జరగడానికి ప్రయత్నించారు. ఒకసారి బ్రిటిష్‌ వారు దేశంనుంచి వెళ్లిపోయాక, ప్రజలు దోపిడీ, పీడన లేకుండా స్వేచ్ఛగా, సమానత్వంతో జీవిస్తారా అన్నదే ఆయన ప్రశ్న. స్వాతంత్య్రోద్యమ కాలంలో భారత రాజకీయ, సామాజిక రంగంపై అంబేడ్కర్‌ జోక్యం చేసుకున్న తీరు బలమైన ముద్ర వేయడమే కాకుండా, రాజ్యాంగ రచనా సమయంలో పౌరులందరి సామాజిక, రాజ కీయ సమానత్వం పట్ల విస్తృతమైన ఆమోదానికి వీలు కల్పిం చింది. పైగా పీడకస్వభావంతో ఉంటున్న సామాజిక చట్రం, దాని ఆచారాల కింద నలిగిపోయిన వారిని ఉద్ధరించే రీతిలో రాజ్యాం గాన్ని రూపొం దించడానికి అంబేడ్కర్‌ బాటలేశారు. స్వాతంత్య్రం తీసుకురావడంతో గాంధీ పాత్ర ముగిసిపోగా, జాతి మొత్తంలో సామాజిక, రాజకీయ సమానత్వా న్ని తీసుకురావడం కోసం అంబేడ్కర్‌ పాత్ర ప్రారంభమైంది.

రాజకీయరంగంలో అంబేడ్కర్‌ తొలి జోక్యం ఒక మనిషికి ఒక ఓటుతో మొదలైంది. బ్రిటిష్‌ కాలంలో సార్వత్రిక వయోజన ఓటు ఉండేది కాదు. పన్ను చెల్లింపుదారులు, విద్యావంతులు మాత్రమే ఓటు వేసేవారు. అంబేడ్కర్‌ సార్వత్రిక ఓటు హక్కుకై పోరాడారు. మహిళల ఓటుహక్కు ఉద్యమం దీర్ఘకాలం పోరాడిన తర్వాత బ్రిటన్‌ మహిళలు 1928లో ఓటు హక్కు పొందగలిగారు. అమెరికాలో సైతం మహిళలు 1920లో మాత్రమే ఓటు హక్కు పొందగలిగారు. 1930లో ఆ తర్వాత కూడా రౌండ్‌ టేబుల్‌ సదస్సులో ఈ డిమాండును లేవనెత్తడానికి అంబేడ్కర్‌ తనకు అందుబాటులో ఉన్న ప్రతి వేదికనూ ఉపయోగించుకున్నారు. స్వాతంత్య్రానికి, ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ఒక అత్యవసరమైన అంశం అనే అభిప్రాయాన్ని అంబేడ్కర్‌ సృష్టించగలిగారు. నిరక్షరాస్యత అంశం ప్రాతిపదికన ఓటింగ్‌ హక్కులు కల్పించడంపై రాజ్యాంగ సభలో అంబేడ్కర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత నెహ్రూ సాయంతో అంబేడ్కర్‌ రాజ్యాంగంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కును ముందుకు తీసుకొచ్చారు.

ఏ కమ్యూనిటీ అయినా, వ్యక్తుల బృందాలు అయినా స్వయం నిర్ణయాధికార హక్కును కలిగి ఉండాలనే అంశాన్ని అంబేడ్కర్‌ నొక్కి చెప్పేవారు. ఏ కమ్యూనిటీకైనా ఏది మంచిది అనే విషయాన్ని ఇతరులు ఆదేశించకూడదని అంబేడ్కర్‌ భావించేవారు. పైగా తమకు ఏది మంచిది అని ప్రజలే నిర్ణయించుకునే హక్కు ఉండాలని చెప్పేవారు. రాజ కీయ అంగాల ప్రాతినిధ్య హక్కు భావనను రౌండ్‌ టేబుల్‌ సదస్సులో పోరాడి సాధించడం ద్వారా శాసనసభల్లో దళితులకు ప్రాతినిధ్యం కల్పించడంలో అంబేడ్కర్‌ ఘనవిజయం సాధించారు. ఆయన ప్రతిపాదించి అమలులోకి తీసుకొచ్చిన ఈ భావన తర్వాత పార్లమెంటులో గిరిజన ప్రాతినిధ్య హక్కుల పరికల్పనకు కూడా వీలు కల్పించింది. పంచాయతీలు, పురపాలక సంస్థల్లో కూడా దళితులకు, వెనుకబడిన వర్గాలకు కూడా ప్రాతినిధ్య హక్కులు లభించాయి. 

అణచివేత స్వభావంకల భారత సామాజిక చట్రం, అసమానమైన మత వ్యవస్థ, ఆచారాలపై నిరంతర చర్చ మొదలెట్టి, సవాలు చేయగలడం ద్వారా అంబేడ్కర్‌ సామాజిక రంగంలో గణనీయ పాత్ర పోషించారు. 1930-32 కాలంలో లండన్‌లో రౌండ్‌ టేబుల్‌ సదస్సులలో దళితుల ప్రతినిధిగా ఎలుగెత్తిన అంబేడ్కర్‌ దళితులకు రాజకీయ ప్రాతి నిధ్యం సాధించడంతో తన పేరు మార్మోగిపోయింది. 1932 సెప్టెంబర్‌లో పూనా ఒడంబడికపై సంతకం చేయడం ద్వారా గాంధీ ప్రాణాలను కాపాడటంలో అంబేడ్కర్‌ నిర్వహించిన పాత్రతో విశిష్టమైంది. 1932 ఒడంబడిక తర్వాతే గాంధీ దళితులకు దేవాలయ ప్రవేశంపై ఉద్యమం ప్రారంభించారు. కానీ 1935 అక్టోబర్‌ 13న హిందువుగా జన్మించాను కానీ హిందువుగా మరణించను అనే సుప్రసిద్ధ ప్రకటన ద్వారా అంబేడ్కర్‌ పాతుకుపోయిన భారతీయ మత చట్రాన్ని సవాలు చేశారు.

ఈ విస్పోటనా ప్రకటన ద్వారా అన్ని మతాలు, మతనేతలను తమలోకి తాము తొంగి చూసుకునేలా చేశారు. సమాజంలో వ్యక్తి సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, న్యాయంపై మతాలు ఏం చెబుతున్నప్పటికీ వాటి ఆచారాలను, మత వ్యవస్థలను మళ్లీ మదింపు చేసుకోవాలని అంబేడ్కర్‌ వారిని కోరారు. 1935లో ఆయన చేసిన ఈ చారిత్రక ప్రకటనతో ప్రతి ఒక్కరూ స్త్రీపురుషుల సమానత్వం, న్యాయమైన సమాజం పట్ల తమ మతవిశ్వాసాలను, ఆచారాలను లోతుగా పునఃపరిశీలించుకోవలసి వచ్చింది. చివరకు గాంధీజీ సైతం ఈ చర్చలో పాల్గొన్నారు. ఇక 1936లో అంబేడ్కర్‌ చేయలేకపోయిన సుప్రసిద్ధ ప్రసంగం ‘కులనిర్మూలన’తో మరొక సవాల్‌ విసిరారు. ఈ ప్రసంగంలో మతం, మానవ సమానత్వం పాత్రను అంబేడ్కర్‌ లోతైన విశ్లేషణ చేశారు.

1940లలో తీసుకొచ్చిన ఆలయ ప్రవేశ చట్టాలను అంబేడ్కర్‌ గుర్తించలేదు. కేవలం ఆలయాల్లోకి ప్రవేశం కల్పించడం ద్వారా మాత్రమే రహదారులు, నీరు, విద్య వంటి అంశాలపై దళితులకు, పౌరులకు పౌర హక్కులు, సామాజిక హక్కులు కల్పించలేరని అంబేడ్కర్‌ తప్పుపట్టారు. దళితులకు ఆంక్షలు లేకుండా నీరు కల్పించడానికి 1927లో అంబేడ్కర్‌ మొదలెట్టిన మహద్‌ సత్యాగ్రహం కానీ, 1932లో నాసిక్‌లోని కాలారాం ఆలయ ప్రవేశం కోసం తాను చేసిన ప్రయత్నం కానీ.. భారతీయ సామాజిక చట్రం దళితులకు ఈ హక్కులను తిరస్కరిస్తోందనడానికి నిదర్శనాలుగా మిగి లిపోయాయి. 

స్వాతంత్య్రోద్యమ కాలంలో సామాజిక, రాజకీయ హక్కుల కోసం అంబేడ్కర్‌ నిరంతర పోరాటం చేయడమే కాకుండా పౌరుల స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం సమాంతర ఉద్యమాన్నే తీసుకొచ్చారు. ఈ అంశంపై జాతి లేచి నిలబడి చర్చించి, అంగీకరించేలా చేశారు. ఇది 1950లో భారత రాజ్యాంగంలో ఈ హక్కులన్నింటినీ పొందుపర్చడానికి దారి తీసింది.


డాక్టర్‌ రాజశేఖర్‌ ఉండ్రు
వ్యాసకర్త ఐఏఎస్‌ అధికారి, హరియాణా ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement