అమెరికాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అధ్యక్ష ఎన్నికలు వాటికై అవి దగ్గర పడవు. అధ్యక్షులే తమకై తాము ఎన్నికలకు దగ్గర పడుతుంటారు!రెండేళ్లే అయింది అధ్యక్షుడిగా నేనొచ్చి. ఇంకో రెండేళ్ల సమయం మిగిలే ఉంది. అప్పుడే మొదలు పెట్టేశారు.. ‘‘జో బైడెన్ రెండో టెర్మ్‌కి ఫిట్‌గా ఉంటారా?!’’ అని!! కరోనాని డీల్ చేశాను. అఫ్గానిస్తాన్‌ని డీల్ చేశాను. రష్యాను డీల్ చేస్తున్నాను. డీల్ చేయవలసినవి ఇంకా ఉన్నాయి. వీటి గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు! ‘‘నెక్స్‌ట్ ఎలక్షన్స్‌కి తనని తను డీల్ చేసుకోగలడా బైడెన్?’’... సెనెట్‌లో ఇదే, హౌస్‌లో ఇదే, నా చాటున వైట్ హౌస్‌లోనూ ఇదే డిబేట్! అమెరికాలో ఓట్ల కన్నా ఎక్కువగా దడిబే ట్‌లే అధ్యక్షుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి.
నా సొంత డెమోక్రాట్‌లు కూడా నా ఫిట్‌నెస్ మీద నమ్మకం ఉంచడం లేదు! ‘‘ఇప్పుడే 80 అంటే రెండో టెర్మ్‌కి 82 వచ్చేస్తాయి. 82 ఏళ్ల వయసులో బైడెన్ తన కాళ్లపై తను నడవగలడా?!’’ అని వారి సందేహం!‘‘మిస్టర్ ప్రెసిడెంట్.. మీరెంతో ఫిట్‌గా ఉన్నారు. మెంటల్‌గా, ఫిజికల్‌గా కూడా..’’ అంటున్నారెవరో! హిప్నాటిస్టుగానీ కాదు కదా!! మెల్లిగా కళ్లు తెరిచి చూశాను. ‘‘ఎవరు మీరు? నేనెక్కడ ఉన్నాను?’’ అని అడిగాను. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్.. నా పేరు కెవిన్ ఒకానర్. ప్రజాహితార్థం ఏడాదికొకసారి మీ ఆరోగ్య స్థితిని అమెరికా సంయుక్త రాష్ట్రాలకు నివేదించడం కోసం వాషింగ్టన్ శివార్లలో ఉన్న వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్‌లో ప్రత్యేక నియామకంపై విధి నిర్వహణలో ఉన్న మీ వ్యక్తిగత వైద్యుడిని. ప్రస్తుతం మీరు నా పర్యవేక్షణలోనే ఉన్నారు. అంతేకాకుండా...’’ అతడింకా ఏదో చెప్పబోతున్నాడు. ఆగమన్నట్లు సైగ చేశాను. ఆగాడు. ‘‘మిస్టర్ కెవిన్. మీరొక వైద్యుడని మాత్రమే నేను అర్థం చేసుకోగలిగాను.
అలాగే మీరు చెబుతున్నది నా ఫిట్‌నెస్ గురించేనని నేను అర్థం చేసుకోవచ్చా?’’ అన్నాను. ‘‘ష్యూర్ మిస్టర్ ప్రెసిడెంట్. 6 అడుగుల ఎత్తూ, 80.7 కిలోల బరువూ కలిగి ఉండి; గత ఏడాదిగా నడకలో గానీ, మాటలో గానీ ఏ విధమైన మార్పునూ కనబరచని; మరియు.. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లేమీ లేని 80 ఏళ్ల జో బైడెన్ అనే ఒక రివట వంటి మనిషి ఫిట్‌నెస్ గురించే నేను మీతో మాట్లాడుతున్నాను..’’ అన్నారు డాక్టర్ కెవిన్ తన వైద్య పరిభాషలో! ఆయన చేతిలో ఉన్నవి నా మెడికల్ రిపోర్ట్సే కావచ్చు. ‘‘ఇట్స్ ఓకే మిస్టర్ కెవిన్..’’ అని నవ్వాను. నేను అలా నవ్వుతూ ఉన్నప్పుడు జొనాథన్ ఫైనర్ అక్కడికి వచ్చాడు! యు.ఎస్. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అతడు. ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ మిస్టర్ ప్రెసిడెంట్.. ఒక ఫోన్ కాల్‌ని మీకోసం చాలాసేపటిగా హోల్డ్ చేసి ఉంచాను. కలపమంటారా?’’ అని అడిగాడు జొనాథన్.
‘‘ఎవరు?’’ అన్నాను. కాస్త సంశయించి, ‘‘సర్.. ఆయన.. మీ బద్ధశత్రువైన మిస్టర్ డొనాల్డ్ ట్రంప్’’ అన్నాడు జొనాథన్. కనెక్ట్ చెయ్యమన్నాను. మెడికల్ సెంటర్ నుంచి నేను బయటికి వస్తుండగా కాల్ కనెక్ట్ అయింది. ‘‘హవ్యూ మిస్టర్ ట్రంప్?’’ అని అడిగాను. ‘‘ఫైన్ అండ్ ఫిట్.. మిస్టర్ బైడెన్. థ్యాంక్యూ. మీరెలా ఉన్నారని అడిగేందుకే మీకోసం ట్రై చేస్తున్నాను..’’ అన్నారు ట్రంప్. ‘‘నేను కూడా ఫైన్ అండ్ ఫిట్.. మిస్టర్ ట్రంప్. థ్యాంక్యూ..’’ అని నవ్వాను. ‘‘మనమెప్పుడూ ఫిట్‌గానే ఉంటాం మిస్టర్ బైడెన్. కానీ మన చుట్టూ ఉన్నవాళ్లే.. మన ఫిట్‌నెస్‌పై నిరంతరం సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు ..’’ అని పెద్దగా నవ్వారు ట్రంప్. ఆ సమయంలో ట్రంప్ నాకు ఆప్త శత్రువులా, బద్ధ మిత్రుడిలా అనిపించారు!
Comments
Please login to add a commentAdd a comment