విశ్లేషణ
అయోధ్యలో రామమందిరం ప్రారంభం ఎన్నికల సునామీని సృష్టిస్తుందని బీజేపీ భావించింది. అందుకే దేవాలయం ప్రారంభించిన వెంటనే బీజేపీ ఏకంగా 370 సీట్లు కైవసం చేసుకుంటుందనీ, ఎన్డీయే కూటమి సంఖ్య 400 దాటుతుందనీ గట్టిగా ప్రకటించింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 400కు పైగా సీట్లు గెలుచుకుంది. అప్పటి నుంచి ఏ పార్టీ కానీ, కూటమి కానీ ఆ రికార్డును అధిగమించలేదు. బీజేపీ వంటి ఆచరణాత్మక పార్టీకి మూడింట రెండు వంతుల మెజారిటీని గెలవడం పిల్లల ఆట కాదని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అందుకే చేజారిపోతోందని భావిస్తున్న అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవడానికి అన్ని ఉపాయాలనూ ఆశ్రయిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీలో భారీ స్థాయిలో విశ్వాస లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీకి తన గెలుపు పట్ల కచ్చితంగా నమ్మకం ఉంటే, పార్లమెంటు ఎన్నికలకు ముందు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లను ఈడీ (ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) లేదా సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అరెస్టు చేసేవా?
ప్రతిపక్ష నేతలపై ఈ విధమైన దాడి, అనివార్యంగా మోదీకి మూడోసారి ప్రధాని పదవి చేపట్టడంపై నమ్మకం లేదన్న సందేశాన్ని పంపుతోంది. మోదీ, ఆయన మనుషులు ఈ దఫా ఎన్నికల్లో 370 సీట్లు గెలుస్తామనీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (నేషనల్ డెమో క్రటిక్ అలయన్ ్స) తరపున 400 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించుకుంటామనీ బహిరంగంగా ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ వాస్తవానికి వారు స్వీయ సందేహంతోనూ, భయాందోళనల తోనూ కొట్టుమిట్టాడుతున్నారు. అలా కాకపోతే, బీజేపీని గెలిపించేందుకు మోదీ తన పాలనలో ‘ప్రతిపక్ష ముక్త్’ (ప్రతిపక్షం లేకుండా) ఎన్నికలను నిర్వహించాలని ఎందుకు నిశ్చయించుకుంటారు?
మోదీ చాలా చురుకైనవారు. చాలా తెలివైనవారు. పైగా రాజీ పడని, కరడు గట్టిన వాస్తవికవాది. ఊహాజనిత, భ్రమలు కలిగించే ప్రపంచంలో ఆయన జీవించరు. ఓటర్లు గుడ్డిగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయరని ఆయనకు బాగా తెలుసు. నిస్సందేహంగా ఆయన భారతదేశంలో అత్యంత బలమైన, ఆకర్షణీయమైన నాయ కుడు. కానీ బీజేపీని విజయ తీరాలకు తీసుకెళ్లడానికి తన ముఖం, వ్యక్తిత్వం సరిపోవని ఆయనకు బాగా తెలుసు.
ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకుని ప్రజలు ఓట్లు వేస్తారని కూడా మోదీకి తెలుసు. నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది. ఒకవైపు నిరుద్యోగ సంక్షోభం, ఉద్యోగాలు పొందే అదృష్టవంతుల ఆదాయంలో స్తబ్ధత ఉండగా, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి, జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ధనవంతులు మరింత ధనికులుగా, పేదలు మరింత పేదలుగా మారడంతో అసమానత రోజురోజుకూ మరింత ప్రస్ఫుటమవుతోంది. మోదీ, ఆయన సహచరులు వేసుకుంటున్న అంతర్గత అంచనాలలో ఇవన్నీ బీజేపీ అవకాశాలపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి; వారిని గందరగోళానికి గురిచేస్తున్నాయి.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆఖరికి తమ మాజీ ముఖ్యమంత్రులను కూడా రంగంలోకి దింపేంత భయంకరమైన పరిస్థితి నెలకొంది. మధ్యప్రదేశ్‌కు చెందిన శివరాజ్‌సింగ్ చౌహాన్, కర్ణాటకకు చెందిన బసవరాజ్ బొమ్మై దీనికి ప్రధాన ఉదాహరణలు. అంతేగాక, పార్టీ అభ్యర్థుల భవితవ్యం తెలుసుకోవడం కోసం... ఉత్కంఠతతో, విరామం లేకుండా శ్రమిస్తున్న అగ్ర నాయకులు... సీటు తర్వాత సీటు విషయంలో కులపరమైన అంకగణితాన్ని బేరీజు చేసుకుంటున్నారు.
1994–95లో కాంగ్రెస్ పార్టీ సమర్పించిన పన్ను ఖాతాలపై, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆదాయపు పన్ను శాఖ మదింపు చర్యలను తిరిగి ప్రారంభించాల్సినంత తీవ్రమైన అభద్రతాభావంతో బీజేపీ ఇప్పుడు కొట్టుమిట్టాడుతోంది. ఇది ఖననం చేసిన మూడు దశాబ్దాల తర్వాత పోస్ట్‌మార్టం పరీక్ష కోసం శవాలను తవ్వినట్లే అవుతుంది. ఒకవైపు కాంగ్రెస్ అవినీతిపై గురిపెడుతూ, దాన్ని దొంగలు, దొంగల పార్టీ అని మోదీ, ఇతర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు నేరచరిత్ర ఉన్న నేతలను బీజేపీ ఆలింగనం చేసుకుంటోంది.
20 పోలీసు కేసులు, అడవులు, గనులను దోచుకున్నందుకుగాను తొమ్మిది సీబీఐ కేసులతోపాటు తనపై కేసుల్లో బెయిల్ కోసం జడ్జికి 40 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన గాలి జనార్దన్ రెడ్డిని ఇప్పుడు బీజేపీ తనలో (తిరిగి) చేర్చుకుంది! అధికార పక్షాన్ని వాషింగ్ మెషీన్ గా ప్రతిపక్షం అభివర్ణించడాన్ని ఇటువంటి ఫిరాయింపులు బలపరుస్తాయి. దీని ద్వారా కళంకిత నాయకులు నిష్కళంకంగా శుభ్రంగా బయటపడతారు.
ఎనిమిది నెలల క్రితం బీజేపీలో చేరిన ప్రఫుల్ పటేల్‌పై ఉన్న భారీ అవినీతి కేసుపై సీబీఐ గత వారం మూసివేత నివేదికను దాఖలు చేసింది. బీజేపీ సిగలో మరో కలికి తురాయి నవీన్ జిందాల్! ‘కోల్‌గేట్’ నిందితుడైన హరియాణాకు చెందిన ఈ కాంగ్రెస్ ఎంపీ, తన తల్లి సావిత్రి జిందాల్‌తో కలిసి భారతదేశాన్ని అభివృద్ధి చేయడం కోసం మోదీతో కలిసి పని చేసేందుకు బీజేపీలోకి వెళ్లారు. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకులను తన రెక్కల కింద పొదువు కోవడానికి బీజేపీని నడిపిస్తున్న కారణం ఏమిటి?
1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 400కు పైగా సీట్లు గెలుచుకుంది. అప్పటి నుంచి ఏ పార్టీ కానీ, కూటమి కానీ ఆ రికార్డును ఇప్పటి వరకూ అధిగ మించలేదు. 1984 తర్వాత మూడు దశాబ్దాల పాటు ఏ ఒక్క పార్టీ కూడా 272 సీట్లు కూడా గెలుచుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అసంఖ్యాక వైఫల్యాలను ఉపయోగించుకుని ‘అచ్ఛే దిన్’ (మంచి రోజులు) వాగ్దానం చేయడం ద్వారా బీజేపీకి 282 సీట్లు వచ్చాయి. ఇక 2019లో, పుల్వామాలో కేంద్ర బలగాలపై జరిగిన మారణకాండను ఉపయోగించుకోవడం ద్వారా బీజేపీ తన సంఖ్యను అనూహ్యంగా 303కు పెంచుకుంది.
పుల్వామాలో రక్తపాతానికి ముందు, బీజేపీ చాలా తక్కువ సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశారు. కానీ పుల్వామా ఆ పార్టీకి గేమ్ ఛేంజర్ అయింది. జనవరి 22న అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన తర్వాత, అది ఏప్రిల్–మేలో ఎన్నికల సునామీని సృష్టిస్తుందని బీజేపీ భావించింది. అందుకే దేవాలయం ప్రారంభించిన వెంటనే బీజేపీ ఏకంగా 370 సీట్లు కైవసం చేసుకుంటుందనీ, ఎన్డీయే సంఖ్య 400 దాటుతుందనీ, లౌకిక–ఉదారవాద భారత్‌పై హిందుత్వ విజయానికి సంకేతంలా గొంతెత్తి ప్రకటించడం ప్రారంభించింది.
కానీ బీజేపీ వంటి ఆచరణాత్మక పార్టీకి ఈసారి మూడింట రెండు వంతుల మెజారిటీని గెలవడం పిల్లల ఆట కాదని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఉత్తర భారతదేశంలో బీజేపీకి ఇప్పటికే ఉన్న దానికంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకునే అవకాశం లేదు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో దాని సంఖ్యను పెంచుకోవడానికి సంస్థాగతమైన శక్తి లేదు. 2019లో కర్ణాటకలోని 28 ఎంపీ స్థానాలకు గానూ బీజేపీ 25 స్థానా లను కైవసం చేసుకుంది.
కానీ ఇప్పుడు సిద్దరామయ్య, శివకుమార్‌లు అధికారంలో ఉన్నందున, బీజేపీ తక్కువ సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదు. ఏక్‌నాథ్ షిండేకి చెందిన శివసేనతో, అజిత్ పవార్‌కి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ద్వారా మహా రాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ, ఎన్ డీఎ 2019లో గెల్చుకున్న 48 సీట్లలో 41 స్థానాలకు మళ్లీ చేరుకునే అవకాశం లేదు. అదే విధంగా బిహార్‌లో ఎన్డీఎ 40కి 39 ఎంపీ సీట్లు గెలుచుకుంది. నితీష్ కుమార్ ఎన్ డీఎలోకి తిరిగి వచ్చినప్పటికీ ప్రస్తుత చిత్రం అంత ఆశాజనకంగా లేదు.
ఈ అంశాలన్నీ బీజేపీ విశ్వాస సంక్షోభాన్ని, తీవ్రమైన అభద్ర తను, నిర్వీర్యపర్చే సందేహాలను వివరిస్తాయి. అందుకే నిజానిజాలు బయటపడే తరుణంలో బీజేపీ భయాందోళనలకు గురవుతోంది.అందుకే చేజారిపోతోందని భావిస్తున్న అధికారాన్ని ఎలాగైనా నిల బెట్టుకోవడానికి అన్ని ఉపాయాలనూ ఆశ్రయిస్తోంది.
ఎస్‌ఎన్‌ఎమ్ ఆబ్ది
వ్యాసకర్త విదేశాంగ విధానం, దేశీయ రాజకీయాల వ్యాఖ్యాత
(‘ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment