మతాలు కాదు... మనిషే ప్రధానం | Sakshi Guest Column On Religions Human Beings | Sakshi
Sakshi News home page

మతాలు కాదు... మనిషే ప్రధానం

Published Sun, Jun 19 2022 1:12 AM | Last Updated on Sun, Jun 19 2022 1:12 AM

Sakshi Guest Column On Religions Human Beings

అన్నిరకాలుగా నాశనమవుతూ ఉన్న మనిషిని బతికించుకోవాల్సిన అవసరం వచ్చింది. తన అలసత్వం, అజ్ఞానం, మూర్ఖత్వం వల్ల మనిషి తన ఉనికికే ప్రమాదకారి అవుతున్నాడు. మనిషి సజీవంగా ఉంటేనే ప్రభుత్వాలైనా, హక్కుల పోరాటాలైనా ఉనికిలో ఉంటాయి. అందుకే భూమి మీద ప్రమాదంలో ఉన్న మనిషిని ముందు బతికించు కోవాలి. అందుకు తగిన అవగాహన పెంచుకోవడానికే ఈ జూన్‌ 21ని మనం ‘హ్యూమనిస్ట్‌ డే’గా జరుపుకొంటున్నాం.

అన్ని దశల్లో అన్నివేళలా మానవాభ్యుదయాన్ని కాంక్షించేదే మానవ వాదం. ఫెడ్రిక్‌ ఇమ్మాన్యుల్‌ నైథమ్మర్‌ తొలిసారి 1808లో ‘హ్యూమనిజం’ అనే పదాన్ని రూపొందించాడు. పద్దెనిమిది, పంతొమ్మిది శతాబ్దాలలో మానవ అవసరాల మీద శ్రద్ధ పెట్టడం, పనికిరాని విశ్వాసాల్ని పక్కకు నెట్టడం, ప్రతి దానికీ కారణాన్ని అన్వేషించడంతో ప్రారంభమై ‘మానవ వాదం’ ఒక ఆలోచనా ధోరణిగా రూపుదిద్దుకోవడం మొదల య్యింది.

ఆ ఆలోచనా ధోరణి అన్ని కళల్లోకి వ్యాపించింది. మానవవాద దృక్పథంలోంచి లలిత కళలు, కవిత్వం, విద్య, వైద్యం వంటి రంగాలన్నీ బలపడుతూ వచ్చాయి. ప్రతిచోటా, ప్రతి రంగంలో ప్రశ్నకు విలువ పెరుగుతూ వచ్చింది. ఆ ప్రశ్న లకు సమాధానాలు అన్వేషించుకునే క్రమంలో హేతువాదంతో కూడిన మానవవాదం, శాస్త్రీయ అవగాహనా వ్యాప్తి చెందాయి.

తొలిసారిగా 1933లో ‘హ్యూమనిస్ట్‌ మానిఫెస్టో’ చికాగో విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో విడుదల అయ్యింది. ఆ మానిఫెస్టో ప్రధానంగా... కారణం, నైతికత, సామాజిక–ఆర్థిక న్యాయం, సమన్వయం అనే సూత్రాల మీద ఆధారపడింది. వీటన్నింటితోపాటు మరొక విషయం ప్రత్యేకంగా చర్చించ బడింది. అదేమిటంటే– ఆధారం లేని విశ్వాసాలు, మూఢ నమ్మ కాలను పక్కకు నెట్టి, వైజ్ఞానిక అవగాహనను పెంపొందించా లనీ, దానిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉందనీ కూడా మాని ఫెస్టోలో రాశారు.

మానవవాదం గురించి అవగాహన పెరుగు తున్న దశలో ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ నిఘంటువు ఒక వ్యతిరేకమైన అర్థాన్ని ప్రచురించింది. దాన్ని రూపొందించిన బృందంలో ఒక ఇంగ్లిష్‌ వాడు, హ్యూమనిస్ట్‌లంటే చులకన భావం గలవాడు ఆ అర్థాలు రాశాడు. ‘దైవ భావనను ధిక్కరించేవారు’, ‘ఉట్టి మానవతావాదులు’, ‘అరాచక వాదులు’, ‘ఆస్తులను దోపిడీ చేయువారు’ అని రాశాడు. బహుశా అతను విశాలమైన భావ జాలంతో, ప్రగతిశీల ధోరణితో ఆలోచించలేనివాడై ఉంటాడు.

అందువల్ల అతను తన అక్కసును అలా వెళ్లగక్కుకున్నాడు. అది మాత్రమే కాదు, అలాంటి మరికొన్ని సంఘటనలు జరుగుతూ రావడం వల్ల సహజంగా మతతత్వ వాదులకు వెయ్యేనుగుల బలం చేకూరింది. అదే సమాజంలో వేళ్లూనుకుని పోయింది. తరతరాలుగా ప్రపంచవ్యాప్తంగా దైవభావన బలం పుంజు కుంది. దాని పర్యవసానంగానే మతాన్ని, దైవాన్ని ప్రశ్నించిన వారు దుర్మార్గులు, పాపాత్ములు, చెడ్డవారు అనే ముద్ర వేయ బడుతూ వచ్చారు. అందుకే చూడండి. పరిస్థితి ఈనాటికీ పూర్తిగా మారలేదు. మత విశ్వాసాలలో పడి కొట్టుకుపోయే వారిని మామూలు మనుషులుగా పరిగణిస్తున్నారు. స్వేచ్ఛాలో చనతో హేతుబద్ధంగా మాట్లాడేవాళ్లను ‘పిచ్చి’వాళ్ల కింద జమ కడుతున్నారు.

విశాల హృదయంతో ఆలోచించలేని వారినీ, ఈ దేవుడు కాదు – ఆ దేవుడనీ, ఈ మతం కాదు ఆ మతమనీ కొట్టుకు చచ్చేవారిని – సమాజంలో అక్కడక్కడ అప్పుడప్పుడు కొందరు మహాను భావులు హెచ్చరిస్తూనే వచ్చారు. వాస్తవంలోంచి ఆలోచించం డనీ, కారణాల్ని వెతకండనీ బోధిస్తూనే వచ్చారు. అలాంటి వారిలో ఎర్నెస్ట్‌ రెనన్‌ పేరు తప్పక చెప్పాలి.

‘జ్ఞానం యొక్క భవిత: 1848 నాటి ఆలోచనలు’ – అనే గ్రంథంలో ఆయన ఇలా రాశాడు... ‘‘భవిష్యత్తులో మతమేదైనా ఉంటే, అది మా‘నవ’ వాదం – అని నేను మనస్ఫూర్తిగా నమ్ము తున్నాను. శాఖోపశాఖలుగా ఉన్న ఈ విశ్వాసాలన్నీ ఒక్కతాటిపై కొచ్చి, నైతిక విలువలతో కూడిన మా‘నవ’వాదంగా రూపు దిద్దుకుంటుంది– తప్పదు!’’ దుర్మార్గాల్ని ఆపే శక్తి సంప్రదా యాలకు లేదు– వైజ్ఞానిక అవగాహన పెరిగితేనే మానవత్వం వికసిస్తుంది!

డాక్టర్‌ దేవరాజు మహారాజు 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, జీవశాస్త్రవేత్త
(జూన్‌ 21న ‘హ్యూమనిస్ట్‌ డే’ సందర్భంగా...) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement