అభిప్రాయం
ఎన్నికల్లో ఒంటరిగా నెగ్గే రాజకీయ పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోదు.ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ–టీడీపీ–జనసేనల పొత్తును ఈ నేపథ్యంలో అర్థంచేసుకోవాలి. దక్షిణ భారతంలో ప్రవేశా నికి పాటుబడుతున్న బీజేపీకి ఇది దక్షిణ. ప్రజల ప్రయోజనానికే ఈ పొత్తు అని బాబు ప్రకటన బూటకమే. చిలకలూరి పేట వద్ద బొప్పూడిలో మార్చి 17న జరిపిన కూటమి ప్రజాగళం సభలో ప్రధాని ఆనకట్టలు, ప్రత్యేక హోదా, పరిశ్రమలు, రాజధాని నిర్మాణం, విశాఖ ఉక్కు అమ్మకం వంటి ప్రజల సమస్యల మాట ఎత్తలేదు. ‘కూటమిని గెలిపించండి. వైసీపీ– కాంగ్రెస్‌లు ఒక్కటే. వాటిని ఓడించండి’ అన్న పలుకులే విని పించాయి. కల్యాణ్, బాబులు మోదీని దైవీకరించారు.
ఆటకు ముందే ఓటమిని వల్లించిన ఉత్తర కిరీటి పవన్. సైన్యమే లేని జన సేన భవిష్యత్తు ప్రశ్నార్థకం. టీడీపీ ఇప్పుడు రెండవ తరం వృద్ధ నాయ కత్వంలో ఉంది. మూడవ తరం యువ నాయకునికి సముద్ర తీరం తెలియదు. ఉత్తర భారతంలో (వైదిక సమీకరణతో) 2024 గెలుపు ఖాయ మనీ, తమ ప్రయత్నాలు 2029కేననీ, అందుకు దక్షిణంలో ప్రవేశానికి తమతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీల భుజాలపై స్వారీ చేసి 2029కి వాటి స్థానాన్ని ఆక్రమించాలనీ, 2034 ఎన్నికల నాటికి వాటిని లేకుండా చేయాలనీ మోదీ యోచన.
బీజేపీతో పొత్తుపెట్టుకున్న ప్రాంతీయ పార్టీలన్నీ బలహీన పడ్డాయి. మూతబడ్డాయి. వాటి స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. ప్రాంతీయ మతతత్వ శిరోమణి అకాలీదళ్ బీజేపీ పొత్తుతో పతనమయింది. బీజేపీ కేరళలో క్రైస్తవులను దువ్వుతోంది. ముస్లివ్‌ులను బెదిరిస్తోంది. ప్రముఖ కాంగ్రెస్ నాయకుల సంతా నాన్ని (ఎ.కె. ఆంటోని కొడుకు, కె.కరుణాకరన్ కూతురు) తన వైపు తిప్పుకుంటోంది. సంప్రదింపుల శక్తి లేని లోకేశులు ఇందుకు అతీతులా? అసోంలో 2016 రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)లతో జతకట్టింది.
తర్వాతి బోడోల్యాండ్ ట్రైబల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీపీఎఫ్‌ను చెత్తలో వేసి ప్రమోద్ బోరో నాయకత్వంలోని యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీ–ఎల్)తో కలిసింది. బాగా బలహీనపడిన బీపీఎఫ్ 2022 లో మరలా బీజేపీతో జత కట్టింది. నేటి టీడీపీ లాగా! ఏజీపీ నీడ కూడా కనిపించడం లేదు. బిహార్‌లో నితీశ్ కుమార్‌ను బలహీనపర్చడానికి రాం విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్‌ను వాడుకుంది. 2024 నాటికి నితీశ్ జేడీయూ ఉనికిలో ఉండవచ్చు. 2029 నాటికి మాయమవక తప్పదు. హరియాణాలో దుష్యంత్ చౌతాలా జేజేపీ కథ ముగిసినట్లే.
మహారాష్ట్రలో ఏకత్వ భావజాల చిరకాల మిత్రపక్షం శివసేనను బీజేపీ ముక్కలు చేసింది. శరద్ పవార్ ఎన్సీపీ నుండి అజిత్ పవార్‌ను వేరుచేసింది. బీజేపీ లేనిదే అజిత్ ఎన్సీపీకి మనుగడ, భవిష్యత్తు లేవు. మన రాష్ట్రంలో కొడి గట్టిన దీపం, బలహీన టీడీపీతో పొత్తుకు ఈ ప్రాతిపదికలే కారణం. 2029 నాటికి మూడో తరం టీడీపీ నాయకత్వం పూర్తిగా బలహీనమవుతుంది. దానిని అప్పుడు సులభంగా భవిష్యత్తు బీజేపీలో కలుపుకోవచ్చు.
ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ అమలుచేసిన పౌరసత్వ సవరణ చట్టంతో మొత్తం ముస్లివ్‌ులు వైఎస్సార్‌సీపీ వైపునకు రావచ్చు. కూటమిలో సీట్ల కేటాయింపుపై విభేదాలు భగ్గు మన్నాయి. సీట్ల కేటాయింపులో వైఎస్సార్‌సీపీ సామాజిక న్యాయాన్ని ప్రజాబాహుళ్యం గమనించింది. సంక్షేమాలు తగు పాత్ర పోషిస్తాయి.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి
వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి ‘ 94902 04545
Comments
Please login to add a commentAdd a comment