మీనా స్వామినాథన్ (1933–2022)
మీనా స్వామినాథన్ మరణం తరాలుగా ఆమె పని నుండి స్ఫూర్తిని పొందిన పరిశోధకులకు, అభ్యాసకులకు, కార్య కర్తలకు తీరని లోటు. అన్నింటికంటే కూడా భారతదేశ అంగన్‌వాడీ రంగానికి నష్టం. ఆమె ఒక మార్గదర్శక విద్యావేత్త, పరిశోధకురాలు, మహిళా సమానత్వం కోసం కృషి చేసిన కార్యకర్త. ఆమె భారతదేశ బాలలకు, ముఖ్యంగా అభాగ్యులకు విరామమెరుగక సేవలందించిన స్నేహితురాలు.
స్వాతంత్య్రానంతర దశాబ్దాలలో, మీనా స్వామినాథన్‌తో పాటుగా ఒక తరం మహిళా నాయకులు కొన్ని విశిష్టమైన ఆలోచనలకు ఊపిరి పోశారు. కొత్తగా రెక్కలొచ్చిన దేశంలో ఆ ఆలోచనలు పలు వర్గాలవారి సంక్షేమ కార్యక్రమాలకు పునాదులు వేశాయి. సెంటర్ ఫర్ ఉమెన్స్ డెవలప్‌మెంట్ స్టడీస్ (సీఎస్‌డీఎస్), సంచార శిశు లాలన కేంద్రాల వంటి వినూత్న సదుపాయాల కల్పనకు ఆచరణ రూపం ఇవ్వడంలో మీనా విస్తృత∙భాగస్వామిగా ఉన్నారు. భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) ఏర్పాటుకు మూలం అయిన నివేదిక బృందానికి ఆమె నేతృత్వం అత్యంత కీలకమైనది.
మీనా 1933లో జన్మించారు. ఆమె తల్లి ప్రముఖ తమిళ రచయిత్రి ‘కృతిక’ మధురం. తండ్రి సుబ్రహ్మణ్యం భూతలింగం. ఆయన ప్రభుత్వోద్యోగి, ఆర్థికవేత్త. మీనా కేంబ్రిడ్జ్‌లో తన కాబోయే భర్త, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ను కలుసుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో దేశ నిర్మాణానికి ఈ దంపతులిద్దరూ కట్టుబడి ఉన్నారు. బెంగాల్ కరవు వల్ల సంభవించిన వినాశనం తరువాత, స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రాన్ని అభ్యసించారు. భారతదేశంలో ‘హరిత విప్లవ పితామహుడు’గా గుర్తింపు పొందారు. ప్రతిష్ఠాత్మకమైన ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ తొలి విజేత కూడా!
దేశానికి మీనా అందించిన సేవలు, కృషి కూడా అంతే విస్తృతమైనవి. 1970లో శిశు అభివృద్ధి అధ్యయన బృందానికి అధ్యక్షురాలయ్యే అవకాశం ఆమెకు లభించింది. ఈ బృందంలో చిత్రా నాయక్, జేపీ నాయక్, అనిల్ బోర్డియా వంటి ప్రముఖులు ఉన్నారు. 1972లో వెలువడిన ఆ బృందం నివేదిక ఒక శక్తి మంతమైన సంకల్పానికి పిలుపునిచ్చింది. ‘‘సాధారణ బాలలు, అభాగ్యులైన బాలల మధ్య ఏటా అంతరం పెరుగుతూ వస్తోంది. కనుక పాఠశాలకు పూర్వ దశలోనే సామాజిక న్యాయంతో ఆ అంతరాన్ని తగ్గించాలి. ఎందుకంటే మొదటి ఐదు సంవత్సరాలే బాలల్లో అన్ని రకాల అభివృద్ధికి కీలకం’’ అని మీనా వ్యాఖ్యా నించారు. ఆ నివేదిక ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం అయిన ఐసీడీఎస్ ఆవిర్భావానికి మూలం అయింది.
పిల్లలకు, తల్లులకు మెరుగైన సదుపాయాలు, సహాయ సహకారాలు ఉండాలని మీనా విశ్వసించారు. ‘‘నా బిడ్డను చూసు కోవాల్సిన అవసరం ఉన్నందున నేను పని చేయడం మానేశాను’’ అని ఒక స్త్రీ చెప్పినప్పుడు, సమాజం దానిని సహజమైన విష యంగా భావిస్తుంది. ఇది సరైన భావన కాదు. ఏదో కన్నాం, పుట్టారు అని కాకుండా... సంతోషం కోసమే సంతానం అనుకున్న ప్పుడు ఆ బిడ్డల సంరక్షణను తండ్రి, కుటుంబ సభ్యులు కూడా స్వీకరించాలి. సమాజానికి, ప్రభుత్వానికి కూడా పిల్లల వికా సంలో ప్రమేయం ఉండాలి’’ అంటారు మీనా. తల్లిపాలే ఆరోగ్యం అని ప్రచారం చేస్తున్నప్పుడు తల్లికి పౌష్టికాహారపు అవసరం తెలియజెప్పాలని కూడా మీనా చెబుతారు.
1979లోనే మీనా పట్టణ పేదల పిల్లల ఆరోగ్యం, వికాసం గురించి అనేక అధ్యయన పత్రాలను సమర్పించారు. పట్టణ పేదరికంలో పెరుగుతున్న లక్షలాది మంది పిల్లలు విధాన నిర్ణేతలకు కనిపించడం లేదని ఆమె విమర్శించారు. ప్రభుత్వాలు గ్రామీణ భారతదేశంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల కూడా పట్టణ బాలల్లో పేదరికం లేదన్న భావన ఏర్పడుతోందని అంటూ.. ‘‘ఫౌంటైన్‌లు, పార్కులు, నగర సుందరీకరణ కోసం నిధులు అక్కరలేదు. అదే వనరులను పేద పిల్లలకు అవసరమైన కార్య క్రమాల కోసం ఉపయోగించలేరా?’’ అని ఘాటుగా ప్రశ్నించారు.
మీనా 1985లో సీఎస్‌డీఎస్ కోసం భారతదేశంలోని తక్కువ ఆదాయం కలిగిన శ్రామిక మహిళల కోసం పిల్లల సంరక్షణ సౌకర్యాలపై ‘హూ కేర్స్?’ అనే పేరుతో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ‘కాళి ఫర్ ఉమెన్’ అనే స్త్రీవాద ప్రచురణాలయం దీనిని అచ్చు వేసింది. ముందుమాటలో వినా మజుందార్: ‘రాజ్యాంగంలోని సమానత్వ నిబంధనల నుంచి ప్రయోజనం పొందగలమని ఆశించిన మన మొదటి తరం మహిళల మాదిరిగానే... స్వాతంత్య్రం వచ్చినప్పుడు మహిళల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మీనా స్వామినాథన్ కూడా నమ్మారు’’ అని రాశారు. కానీ మహిళల సమస్యలు అలాగే ఉండిపోయాయి. మహిళలు సాధారణంగా అతి స్వల్ప వేతనం లభించే పిల్లల సంరక్షణ వంటి తక్కువ నైపుణ్యాలు అవసరమైన పనిలోకి వెళ్లే విధంగా సామాజిక, కుటుంబ పరమైన ఒత్తిళ్లకు గురవుతారు. తద్వారా వారు శ్రామికశక్తిలో భాగంగా కనిపించకుండా పోతారు.
మీనా విద్యావేత్త. తన జీవితమంతా స్త్రీ, శిశు సంక్షేమానికి అవసరమైన అధ్యయనాలు చేస్తూ ప్రభుత్వానికి, పలు సంస్థలకు మార్గదర్శకంగా ఉన్నారు. ‘‘చివరికొచ్చే సరికి పరిశోధనా ఫలితాలన్నవి ఆచరణకు ప్రేరణవ్వాలి’’ అని అంటారు మీనా. యాభై సంవత్సరాల క్రితం, దేశవ్యాప్తంగా అంగన్‌వాడీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమంటే అదెంతో సాహస వంతమైన దృక్పథం అనే చెప్పాలి. మీనా అలాంటి ఆలోచన చేయగలిగారు. నేడు భారతదేశంలో పది లక్షల కంటే ఎక్కువ అంగన్‌వాడీలు ఉన్నాయి. అంతకు రెట్టింపుగా అంగన్‌వాడీ కార్య కర్తలు అనేక లక్షల మంది తల్లులకు, పిల్లలకు బహుళ సేవలను అందిస్తున్నారు. జార్జ్ బెర్నార్డ్ షా నాటకంలోని పాత్ర ఒకటి ఈ సందర్భంగా నాకు గుర్తుకు వస్తోంది: ‘‘మీరు జరుగుతున్నవి చూస్తారు. ‘ఎందుకు?’ అనుకుంటారు. కానీ నేను జరగనివాటిని కలగంటాను. ‘ఎందుకు కాదు?’ అని అడుగుతాను’’ అంటుంది ఆ పాత్ర. భారతదేశపు పిల్లల తరఫున మీనా స్వామినాథన్ అడిగిందీ ఇదే.. ‘ఎందుకు కాదు?’ అని!
వ్యాసకర్త ఐఏఎస్ అధికారి
(‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment