అట్టడుగు వర్గాల్లో విజ్ఞానాన్ని నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రీబాయి ఫూలే. ఆనాటి సమాజపు కట్టు బాట్లను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు. దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభిం చారు. సావిత్రీబాయి మహారాష్ట్ర సతారా జిల్లాలోని నయాగావ్ గ్రామంలో 1831 జనవరి 3న జన్మిం చారు. వాళ్ల కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. బోధన్ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి చుట్టాలు. ఆమె తన తొమ్మిదో ఏట పన్నెండేళ్ల జ్యోతి రావు ఫూలేను 1840లో వివాహ మాడారు. నిరక్షరాస్యురాలైన ఆమెకు భర్త జ్యోతిబా మొదటి గురువు. ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో భర్తతో కలిసి బాలికల కోసం పుణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఇది నడపటం అగ్రవర్ణాలకు నచ్చకపోయినా, పట్టు వీడక ఫూలే దంపతులు సాగించిన విద్యా ఉద్య మానికి తక్కువ కాలంలోనే గుర్తింపు, సహ కారం లభించాయి. దంపతుల జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు.
మానవ హక్కుల గురించి మహిళలను చైతన్య పరచడానికి 1852లో మహిళా సేవామండల్ స్థాపిం చారు సావిత్రీబాయి. కుల, పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా ఈ సంఘం పనిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రీబాయి. 1873లో భర్త మహాత్మా ఫూలేతో కలిసి ‘సత్య శోధక్ సమాజ్’ స్థాపించి, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, సతీసహగమనానికి వ్యతిరేకంగా; వితంతు పునర్వి వాహాలకు అనుకూలంగా ఉద్యమం నడిపారు. ఈ సంఘపు మహిళా విభాగానికి ఆమె నేతృత్వం వహించారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభ వించే ఎంతోమంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోశారు. అలా పురుడు పోసుకుని తనవద్దే వదిలేసి పోయిన ఓ బ్రాహ్మణ వితంతువు బిడ్డను అక్కున చేర్చుకుని, యశ్వంత్‌గా నామకరణం చేసి, పెంచి పెద్ద చేశారు.
వితంతువు లకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్య పర్చి, వారికి శిరో ముండనం చేయ బోమంటూ సమ్మె చేయించారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరా డారు. దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి మరువలేనిది. కరువు వాతపడిన కుటుంబాల్లోని అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించారు. సావిత్రీబాయి ఫూలే సంఘ సంస్కర్తగానే కాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు.
(నేడు సావిత్రీబాయి ఫూలే జయంతి)
సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా
మొబైల్ : 78933 03516
Comments
Please login to add a commentAdd a comment