సరిగ్గా దేశ రాజధాని సరిహద్దులో రైతుల నిరసన మొదలై ఐదు నెలలా రెండు వారాలు దాటింది. గత నెలంతా ఢిల్లీ ఉష్ణోగ్రత సుమారు 9 డిగ్రీలను మించలేదు. గడ్డకట్టే చలిలో ఇప్పటికి 120 మంది రైతులు చనిపోయారని అంచనా. అయినా కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. రైతులూ పిడికిళ్లు దించడం లేదు. నూతన వ్యవసాయ చట్టాలను సంపూర్ణంగా రద్దు చేయాలని కోరుతున్న రైతులకూ, వ్యవసాయ చట్టాల తోనే నూతన అధ్యాయానికి తెరలేస్తుందని నమ్ము తున్న కేంద్రానికీ మధ్య స్పష్టమైన రాజీ కుదరడం లేదు. రైతులే దేశానికి వెన్నెముకగా చెప్పుకునే రైతు భారతంలో అన్నదాతలు నిరసనలో ఉన్నవేళ గణ తంత్ర దినోత్సవం వచ్చింది.
ఏడాది కాలంగా కోవిడ్ మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను పాతాళంలోకి నెట్టింది. ఎంతోమంది నిరు ద్యోగులైనారు. రోగానికి విరుగుడుగా వచ్చిన కోవిడ్ టీకాల పంపిణీ ప్రారంభమైనప్పటికీ, ఎన్నో దేశాలు టీకా దిగుమతుల కోసం మనవైపు చూస్తున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ వాటి పారదర్శకత మీద జనానికి ఉన్న సందేహాలు సంపూర్ణంగా నివృత్తి కాలేదు. మరోవైపు సరిహద్దుల్లో చైనా కొత్త గ్రామాలను నిర్మిస్తోందనీ, బలహీనంగా నిర్ణయమై వున్న సరిహద్దు లను ఏకపక్షంగా తన అధీనంలోకి తెచ్చుకోవడానికి అక్కడి నివాసాల్లోకి పంతంగా జనాన్ని తరలిస్తోందనీ వార్తలు వస్తున్నాయి. బహుశా చెప్పుకోవడానికి పెద్దగా ఏ సానుకూలాంశమూ లేని చిత్రమైన వేళ ఈ గణ తంత్ర దినోత్సవం జరుపుకొంటున్నాం.
స్వాతంత్య్రం రావడం దానికదే మహోజ్వల ఘట్ట మైనప్పటికీ, ఆ వచ్చిన స్వాతంత్య్రం తెల్లకాగితం లాంటిది. గణతంత్ర దినోత్సవం రోజే దేశం ఏ దిశగా సాగాలో నిర్దేశించే రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చు కున్నాం. స్వాతంత్య్రం రావడానికి రెండు దశాబ్దాల క్రితమే, అంటే జనవరి 26, 1930 నాడే అప్పటి కాంగ్రెస్ ‘సంపూర్ణ స్వరాజ్యం’ కావాలని తీర్మానిం చింది. దాన్ని గుర్తుచేసుకుంటూనే రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. దేశ నడవడికను శాసించే, దేశ నిర్మాణాన్ని రూపొందించే అడుగులు తొలి గణతంత్ర దినోత్సవంతోనే పడటం మొదలైంది.
సుమారు ఐదువేల ఏళ్ల మహత్తర చరిత్ర కలిగిన భారతదేశం 71వ గణతంత్ర దినోత్సవం జరుపు కొంటుండటం ఒక వక్రోక్తి. ఇదే గడ్డ– మతం ఆధా రంగా రెండు దేశాలుగా విడిపోయి సుమారు ఇరవై లక్షలమంది శవాలుగా నేలకూలడం అంతటి జ్ఞానమూ మనిషిని వివేకవంతుడిని చేయలేదని తెలియజెప్పిన కఠిన వాస్తవం. రాజ్యాంగం నిర్దేశించుకున్న లౌకక స్ఫూర్తికి విరుద్ధమైన వాతావరణం నెలకొంటున్నదనే అనుమానపు మబ్బులు తిరిగి కమ్ముతుండటం ఇంకా మనల్ని మనం తర్కించుకోవాల్సిన ఆవశ్యకతను గట్టిగా కల్పిస్తోంది. పాకిస్తాన్ తనను తాను ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ప్రకటించుకున్నట్టుగా భారతదేశం హిందూ రాష్ట్రంగా మారుతోందా అనే భయాలను కేంద్ర ప్రభుత్వం పోగొట్టాలి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయానని ఒప్పుకోకపోవడమే కాకుండా, తీవ్ర విధ్వంసానికి ఒడిగట్టిన డొనాల్డ్ ట్రంప్‌ను ఆ దేశం పకడ్బందీగా గద్దె దించింది. దానికి అక్కడి వ్యవస్థల బలమే కారణమ న్నారు విశ్లేషకులు. వ్యవస్థలు స్వేచ్ఛగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. కానీ కొన్నేళ్లుగా ఇండియాలో వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయడం లేదని విమర్శలు చేస్తున్నవాళ్లను సామాజిక మాధ్య మాల్లో దూషణలతో నోళ్లు మూయించడం తేలిక. కానీ వాళ్లు లేవనెత్తుతున్న అంశాల్లో స్వీకరించగలిగిందాన్ని స్వీకరించడం విజ్ఞుల లక్షణం.
ఇంతటి విశిష్ట సందర్భాన్ని నిందలకు మాత్రమే సరిపుచ్చకూడదు. ఎందరో మహనీయుల ఆలోచనా ధార ఈ భారతాన్ని నిర్మించింది. రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో కూడా దేశ అంతస్సారం అందుకే చెక్కుచెదరలేదు. ఎన్నో గొప్ప నాగరికతలు చరిత్ర పుస్తకాల పుటలకే పరిమితమైనప్పటికీ భారతదేశం ఇంకా ఆ గత వైభవానికి 130 కోట్ల జనాభాతో సాక్ష్యంగా నిలిచివుంది. అలాంటి దేశాన్ని ఎన్నో సమ స్యలు, సవాళ్లు ఉన్నప్పటికీ గాడి తప్పకుండా కాపాడ గలిగేది రాజ్యాంగమే. రాజకీయం మాత్రమే పరమా వధి కాని పార్టీలూ, జనాకర్షణే పరమావధి కాని ప్రభు త్వాలూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేలా ఈ గణతంత్ర దినోత్సవ వేళ పునరంకితం కావాలి.
– పి. శివకుమార్
Comments
Please login to add a commentAdd a comment