వైద్యం కోసం కాకుండా... షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆర్మీలోకి మహిళలు మొట్టమొదట ప్రవేశించి 30 సంవ త్సరాలు అవుతోంది. 1992లో తొలి మహిళా ఆర్మీ ఆఫీసర్లు సర్వీసులోకి అడుగుపెట్టారు. అలా మొదలై ఈ దేశపు మహిళలు దేశ రక్షణ రంగంలో బలంగా కాలుమోపేందుకు... న్యాయమైన తమ హక్కులను సాధించుకునేందుకు ఇప్పుడు వీలు పడింది. అంటే, ఇంత సమయం కావాల్సి వచ్చిందన్న మాట. సుప్రీం కోర్టు గత ఏడాది ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు పుణ్యమా అని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) తలుపులు ఇప్పుడు మహిళలకూ బార్లా తెరుచుకున్నాయి. ఎన్‌డీఏలో సీట్ల కోసమే కాకుండా... ఆర్మీ తదితర సర్వీసుల్లోనూ పర్మనెంట్ కమిషన్ కోసమూ ఇప్పుడు మహిళలు పోటీ పడవచ్చు. యుద్ధరంగంలోనూ దిగేందుకు మార్గం సుగమ మైంది. ఈ జనవరి 15వ తేదీ నిర్వహించిన ఆర్మీ డే నిజంగా సంబరాలు చేసుకోవాల్సిన దినమే. త్రివిధ దళాల్లో మహిళల పాత్ర పెరిగే దిశగా ఇంకో ముందడుగు వేశాం మరి!
నిజానికి సైనిక బలగాల కూర్పులో గుణాత్మక, పరిమా ణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం ఈ రోజు ఉన్న పరి స్థితులకు చాలా అవసరం కూడా! లీగల్, ఎడ్యుకేషన్ కోర్‌లతో పాటు 2008 నుంచి మహిళలు పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్లుగా నియమితులవుతున్నా, 2020 నుంచి ఇది ఇంకో ఎనిమిది యుద్ధేతర రంగాలకు విస్తరించినా, మహిళల భాగస్వామ్యం పెద్దగా పెరిగిందేమీ లేదు. ఇండియన్ ఆర్మీలో వైద్య సేవల విభాగాన్ని మినహాయిస్తే 2020 నాటికి మహిళల శాతం కేవలం మూడు మాత్రమే. అగ్రరాజ్యం అమెరికాలో ఇది 16 శాతం వరకూ ఉంటే, ఫ్రాన్స్‌లో 15 శాతం, రష్యా, బ్రిటన్‌లలో పది శాతం వరకూ ఉంది.
ఆర్మీలో మహిళల భాగస్వామ్యం పెరగడం చాలా రకా లుగా ప్రయోజనకరం. ముందుగా చెప్పుకోవాల్సింది ఆఫీసర్ల కొరత! ఆర్మీలో 7,476 మంది ఆఫీసర్ల కొరత ఉందని నెల రోజుల క్రితం దేశ రక్షణ శాఖ సహాయ మంత్రి స్వయంగా రాజ్యసభలో తెలిపారు. యువత ఆర్మీలో చేరేందుకు కొంత విముఖత చూపుతూండటం ఈ కొరతకు కారణం. గతంలో మాదిరిగా ఆర్మీ అధికారుల సంతానం కూడా సర్వీసుల్లోకి చేరడం తగ్గిపోతోంది. కొన్ని దశాబ్దాలుగా వీరు ఇతర కార్పొరేట్ ఉద్యోగాల్లోకి చేరిపోతున్నారు. అయితే ఇప్పుడు ఆడపిల్లలకూ పర్మనెంట్ కమిషన్ లభించే అవకాశం ఏర్పడినందున చాలామంది ఆఫీసర్ల కుమార్తెలు ఈ వృత్తిని ఎంచుకునే అవకాశాలున్నాయి. ఈ మార్పుతో ఆర్మీలో చిలిపి తనం పేర ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తున్న పురుషాధిక్య భావజాలం కూడా కొంతమేరకైనా తగ్గే అవకాశం ఉంది.
కొన్నేళ్ల క్రితం ఓ ఆర్మీ ఉన్నతాధికారిని ఇంటర్వ్యూ చేసిన ప్పుడు ఆర్మీలోకి మహిళలు చేరడంపై పరోక్షంగా తన అభిప్రా యాలను ఆయన కుండబద్దలు కొట్టాడు. ఒకానొక సంద ర్భంలో వేరెవరూ లేకుండా ఒక పురుష, మహిళ ఆర్మీ అధికారులిద్దరే బేస్ క్యాంప్‌లో ఉండాల్సిన పరిస్థితిని తాను ఉద్దేశపూర్వకంగా తప్పించానని చెప్పుకొచ్చాడు. కొంత కాలం తరువాత ఈ విషయం ఆ మహిళా ఆఫీసర్‌కు తెలిసి, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందట. అయితే దాని ప్రభావం ఈ ఆర్మీ ఆఫీసర్‌పై ఏమీ పడలేదు. ఉన్నతాధికారి చర్య తనపై ఆయనకున్న అపనమ్మకానికి ప్రతీక అని మహిళా అధికారి వాపోయింది. కానీ ఆర్మీ నైతిక విలువలకు ఇదో తార్కాణమని ఆ ఉన్నతాధికారి తన చర్యను సమర్థించుకున్నాడు.
2020 ఫిబ్రవరిలో పురుషులతో సమానంగా మహిళలకూ కమాండ్ స్థానాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్పుడు, మహిళలకు అలాంటి పాత్రలు ఇవ్వడంపై మిలటరీ వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నింటికీ చెక్ పెట్టినట్లు అయ్యింది. ఆదేశాలు జారీ చేసే స్థానాన్ని మహిళలకు ఇవ్వడం ఆచరణ లోనూ, సంస్కృతీ సంప్రదాయల పరంగానూ సరికాదన్న అభ్యంతరం దుర్విచక్షణతో కూడినదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏది ఏమైతేనేం. మహిళలు ఇప్పుడు యుద్ధ రంగం లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈలోపు వారు మరి కొన్ని అడ్డంకులను అధిగమించాల్సి ఉంది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే ఇటీవల ఎన్‌డీఏ పెరేడ్‌ను సమీక్షిస్తూ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఆర్మీలో మహిళల ప్రవేశా నికి సంబంధించి సుప్రీం తీర్పును ఆయన శ్లాఘించారు. ఆర్మీలో లింగ సమానత్వానికి ఇది దారి తీస్తుందని స్పష్టం చేశారు. ‘‘ఇంకో 40 ఏళ్ల తర్వాతైనా.. వాళ్లు ఇప్పుడు నేనున్న స్థానంలో ఉంటారు’’ అని నరవాణే వ్యాఖ్యానించడం స్త్రీలకు భరోసానిచ్చే విషయమే. ఆర్మీ చీఫ్ స్థానానికి ఒక మహిళ ఎదిగేందుకు మరో నలభై ఏళ్లు పడుతుందో, లేదో చెప్పలేము కానీ.. ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన నేను మాత్రం నాలుగేళ్ల తర్వాత ఎన్‌డీఏ పాసింగ్ అవుట్ పెరేడ్‌ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మాత్రం చెప్పగలను. పురుషు లతో సమానంగా యుద్ధరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్న మహిళ ఆర్మీ ఆఫీసర్ల కళ్లల్లో రేపటిపై విశ్వాసం, భుజ స్కంధాలపై ఆర్మీ చిహ్నాలు చూడడం గర్వకారణం కూడా!
– సునందా మెహతా,
రచయిత్రి, పాత్రికేయురాలు
(ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో)
సైన్యంలో పురుషాధిక్యతకు పగ్గాలు!
Published Sun, Jan 23 2022 12:31 AM | Last Updated on Sun, Jan 23 2022 12:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment