దేశ ‘కనెక్టింగ్‌ ఫ్యాక్టర్‌’ హిందుత్వం | Sunil Ambekar Special Interview On RSS | Sakshi
Sakshi News home page

దేశ ‘కనెక్టింగ్‌ ఫ్యాక్టర్‌’ హిందుత్వం

Published Sat, Feb 25 2023 3:43 AM | Last Updated on Sat, Feb 25 2023 3:44 AM

Sunil Ambekar Special Interview On RSS - Sakshi

పేరు ప్రఖ్యాతులు కావాలని ఆరెస్సెస్‌ పాటుపడదనీ, సమాజాన్ని సాధికారత దిశగా నడిపించడానికి కావాల్సిన శక్తియుక్తులను అందించడానికి వీలుగా వ్యక్తులను కలిపి పనిచేయించడమే ఆరెస్సెస్‌ లక్ష్యమనీ ఆ సంస్థ ప్రచార్‌ ప్రముఖ్‌ (మీడియా రిలేషన్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇన్‌ఛార్జ్‌) సునీల్‌ అంబేకర్‌ అన్నారు. ఆయన ఇంగ్లీషులో రాసిన ‘ద ఆరెస్సెస్‌: రోడ్‌మ్యాప్స్‌ ఫర్‌ ద 21 సెంచరీ’ పుస్తకానికి తెలుగు అనువాదం ‘అరెస్సెస్‌ ప్రణాళిక 21వ శతాబ్దం కోసం’ ఆవిష్కరణకు ఇటీవల విజయవాడ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ.

ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది?
ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని దేశంలో చాలామంది ఆకాంక్ష. యువతలో అది ఇంకా బలీయంగా ఉంది. నేను విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థలను సందర్శిస్తున్న సమ యంలో దేశాభివృద్ధి గురించి యువత ప్రశ్నించేది. కాలక్రమంలో ప్రశ్న అడిగే తీరులో మార్పును గమనించాను. దేశ ప్రగతికి సంబం
ధించి యువత నుంచి ప్రతికూల ప్రశ్నలు కాకుండా సానుకూల ప్రశ్నలు రావడం మొదలైంది. దేశాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు ఎలా తీసుకెళ్లాలి? అని విభిన్న కోణాల నుంచి వస్తున్న ప్రశ్నలకు జవాబులు చెప్పేవాడిని. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో సమాజంలో అందరి భాగస్వామ్యం ఉండాలి. ఈ యజ్ఞంలో భాగమైన సంఘ కార్యంలో(ఆరెస్సెస్‌ కార్యక్రమాల్లో) అందరికీ భాగస్వామ్యం ఉండాలని ఆరెస్సెస్‌ భావిస్తోంది. ఆరెస్సెస్‌ను మరింత బాగా అర్థం చేసుకోవడానికీ, సంఘ పరిచయం లేని వ్యక్తులు కూడా ఆరెస్సెస్‌ తీరును అవగతం చేసుకోవడానికీ పుస్తకం రాయాలన్న ప్రతిపాదన నా వద్దకు వచ్చింది. దానికి అంగీకరించాను.

ఈ పుస్తకంలో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏమిటి?
1. దేశం అభివృద్ధి చెందాలని సామాన్యులు కూడా బలంగా ఆకాంక్షిస్తున్నారు. బాధ్యత తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. సంఘం(ఆరెస్సెస్‌) విస్తరణకు సామాన్యుల త్యాగాలు, వారి విజయ గాథలే మూలాధారం. ఈ విషయాన్ని ప్రధానంగా చెప్ప దలుచుకున్నాను. సంఘ కార్యంలో అందరి భాగస్వా మ్యాన్ని అభిలషిస్తున్నాం. 2. ఈ దేశ సంస్కృతి, వారసత్వం, హిందుత్వం... మనం గర్వించాల్సిన అంశాలే తప్ప, న్యూనత చెందాల్సిన అంశాలు కాదు. సర్వమానవ హితానికి అవి అత్యంత రమణీయమైన అంశాలు. అయితే ఈ విషయాల పట్ల కొంత మందికి అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వాటిని దూరం చెయ్యాలి.
3. ప్రజలంతా దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. వర్త మానంలో దేశానికి ఉన్న శక్తి ఆధారంగా భవిష్యత్‌ను నిర్మించుకోవాలి.

4. హిందుత్వం అంటే అందరినీ కలి పేది. అందరి బాగు కోరుకోవడమే హిందుత్వం. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలిపి ఉంచే ‘కనెక్టింగ్‌ ఫ్యాక్టర్‌’ హిందుత్వం. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు, సవాళ్లకు సమాధానం బయటి నుంచి లభించదు. మనకు మనమే పరిష్కారాలను అన్వేషించాలి. స్వాతంత్య్ర పోరాటం కూడా కేవలం ఆంగ్లేయులను వెళ్లగొట్టడం కోసమే కాకుండా, స్వపాలన, స్వదేశీ, స్వభాష.. ఇలా ‘స్వ’(సొంత) సాధన లక్ష్యంగా సాగింది. ఇప్పుడు కూడా ‘స్వ’ ఆధారంగా మన ప్రణాళికలు ఉండాలి. ప్రతి నిర్ణయం స్వావలంబన సాధించే దిశగా ఉండాలి. సమాజంలోని ప్రతి ఒక్కరిని అందులో భాగస్వాములను చేయాలి. సంఘం (ఆరెస్సెస్‌) చెప్పేది ఇదే.

ఈ పుస్తకం ఎవరిని ఉద్దేశించి రాశారు? స్వయం సేవకులకా, స్వయం సేవకులు కావాలనుకుంటున్న వారికా? అందరికీనా?
అందరికీ ఉద్దేశించింది. ఆరెస్సెస్‌ను అర్థం చేసుకోవాలనుకొనే వారికి ఉపయుక్తం. స్వయం సేవక్‌లే కాదు, అందరూ చదవాలి. పుస్తకం చదివిన తర్వాత ఎలాంటి ఫీల్‌ కలిగినా ఫర్వాలేదు. ఆరెస్సెస్‌ను వ్యతిరేకించేవారైనా పుస్తకం చదవాలి. 2025 నాటికి ఆరెస్సెస్‌ ఏర్పాటై వందేళ్లు పూర్తవుతుంది. ఇప్పటికీ ఆరెస్సెస్‌ పనితీరు, అంతర్గత వ్యవహారాల గురించి ప్రజలకు పెద్దగా తెలియదు.

వందేళ్ల తర్వాత అయినా ఆరెస్సెస్‌ అంతర్గత వ్యవహారాలు సామాన్యులకు తెలిసేలా పారదర్శకంగా పనిచేస్తుందా?
ఆరెస్సెస్‌ ఏర్పాటయిన తొలి రోజు నుంచి తెరిచిన పుస్తకమే. సంఘం యాజమాన్య హక్కులు ఎవరి(వ్యక్తుల) సొంతం కాదు. ఆరెస్సెస్‌ యాజమాన్యం ప్రజలదే. ప్రజల భాషలో చెప్పాలంటే పబ్లిక్‌ కంపెనీ. భారతమాత కోసం పనిచేస్తున్నామనే భావనతో ప్రతి స్వయం సేవక్‌ పనిచేస్తారు. సమాజాన్ని సాధికారత దిశగా నడిపించడమే ‘సంఘ’ లక్ష్యం. ఆరెస్సెస్‌ను బలోపేతం చేయడం కాదు... సమాజాన్ని, దేశాన్ని సాధికారత దిశగా నడిపించడమే లక్ష్యంగా ఆరెస్సెస్‌ పనిచేస్తుంది. అందుకే ఎవరైనా ఆరెస్సెస్‌లో పనిచేయడానికి ‘ఫిట్‌’ అవుతారు. మంచి కోసం ప్రజలతో కలిసి పనిచేస్తాడు స్వయం సేవక్‌. సమాజానికి ఉప యోగపడే ఏ పని చేద్దామన్న ఆసక్తి ఉన్నా, ఏ
రంగంలో చేయాలనుకున్నా ఆరెస్సెస్‌ తోడుగా నిలుస్తుంది. అరెస్సెస్‌ ప్రయాణం తెరిచిన పుస్త కమే... అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ!

ఇక మీద ఆరెస్సెస్‌ విస్తరణ మీద దృష్టి పెడతారా? సిద్ధాంతాన్ని బలోపేతం చేయడం మీద దృష్టి పెడతారా?
పేరు, ప్రఖ్యాతుల కోసం ‘ఆరెస్సెస్‌’ పని చేయడం లేదు. సిద్ధాంతం ఆధారంగా పనిచేసుకుంటూ ముందడుగు వేస్తుంటుంది. వ్యక్తులు, వ్యవస్థలను ‘నెట్‌ వర్కింగ్‌’ చేయడమే సంఘం పని. సామాన్యులను సాధికారత దిశగా నడిపించడానికి నెట్‌వర్కింగ్‌ చేస్తుంది. మరింత ఎక్కువ మందిని కలిపి పనిచేయించడం ద్వారా సాధికారత సాధించడమే తప్ప... అది ఆరెస్సెస్‌ విస్తరణ కాదు. రెండో అంశం, సిద్ధాంతం గురించి అడి గారు... అరెస్సెస్‌ సిద్ధాంతం చాలా సింపుల్‌. అందరూ గర్వపడే విధంగా దేశాన్ని తయారు చేయడం, హిందుత్వాన్ని చూసి గర్వ పడటం, ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కోరుకోవడం... ఇది కేవలం ఆరెస్సెస్‌ లైన్‌ మాత్రమే కాదు... వేల సంవత్సరాలుగా ఈ దేశ
అంతరాత్మ ఇదే. దేశానికి సేవ సేయడమే ఆరెస్సెస్‌ సిద్ధాంతం.
యాంటీ–నేషనల్స్‌ అని పదాన్ని ఆరెస్సెస్‌ ఈ మధ్య ఎక్కువగా ఉప యోగిస్తోంది. మీ దృష్టిలో దీని నిర్వచనం ఏమిటి? స్వయం సేవక్‌లు నడిపే ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారు ‘యాంటీ–నేషనల్స్‌’ అనా?
ఎంతమాత్రం కాదు. ప్రభుత్వాలను విమర్శించడం, వ్యతిరేకించడం ప్రజాస్వామ్యంలో భాగం. పార్లమెంట్‌లోనే విమర్శిస్తున్నారు కదా! వారిని యాంటీ–నేషనల్స్‌ అని ఎవరూ అనడం లేదు. ఆ పదంలోనే దాని అర్థం ఉంది, దేశానికి వ్యతిరేకం అని. దేశ హితాన్ని కాంక్షించని వారంతా యాంటీ–నేషనల్స్‌. ఇది ఆరెస్సెస్‌ సృష్టించిన పదం కాదు. 
చరిత్రను చూసే దృష్టికోణం మారాలంటున్నారు కదా! ఎందుకు మారాలి?
దేశాన్ని చాలా శతాబ్దాల పాటు విదేశీయులు పాలించారు. వారి ఆలోచనలకు అనుగుణంగా చరిత్ర తయారయింది. వారి ప్రయో జనాల పరిరక్షణకు వీలుగా చరిత్రను రూపొందించారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, మహాపురుషులు, రుషులు, సమర్థ పాల కుల చరిత్ర మరుగున పడిపోయింది. మన వారసత్వాన్ని గర్వంగా చెప్పుకొనే పరిస్థితి లేకుండా చేశారు. ఒక కుటుంబ చరిత్ర, ఒక వంశ పాలన చరిత్ర కాదు. ఈ దేశ నిర్మాణంలో గ్రామీణులు, కొండకోనల్లో నివసించేవారు, పేదలు, ధనికులు, పాలకులు... అందరి పాత్రా ఉంది. దాన్ని విస్మరించారు. ఆర్యులు వెలుపలి నుంచి వచ్చారనే సిద్ధాంతం తప్పని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కూడా చెప్పారు. విదేశీ
దృష్టి కోణం మారాలి. మన దేశం దృష్టి కోణం నుంచి చరిత్రను చూడాలి. సరికొత్త కోణంలో చరిత్రను ఆవిష్కరించి ప్రజల ముందు ఉంచాలి.
– ఎం. విశ్వనాథ రెడ్డి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement