షీ జిన్‌పింగ్ సమరశంఖం పూరించారు. నాలుగు రోజుల కిందట చైనా సైనికాధికారులను సమావేశ పరిచి ‘యుద్ధానికి సిద్ధంగా ఉండాలని’ ఆయన ఆదేశించారు. శంఖారావం చేసినవాడు జిన్‌పింగ్ కాబట్టి సహజంగానే అది భూమండలమంతా ప్రతిధ్వనించింది. షీ జిన్‌పింగ్ కేవలం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు అధ్యక్షుడు మాత్రమే కాదు. చైనా గమనాన్ని శాసిస్తున్న కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా. పీపుల్స్ ఆర్మీ కళ్లేలను అదిలించే సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ పదవి కూడా ఆయనదే. నవచైనా నిర్మాత కామ్రేడ్ మావో జెడాంగ్ కన్నుమూసిన నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ అంతటి అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకోగలిగిన శక్తిమంతుడు షీ జిన్‌పింగ్. ఇప్పుడాయన ఒక ఆధునిక మహాసామ్రాజ్యానికి మకుటం లేని సామ్రాట్టు. ఇటు భూఖండాల మీదుగా, అటు మహాసముద్రాల గుండా ప్రపంచా ధిపత్యం కోసం బాటలు వేసుకుంటున్న ఉచ్ఛస్థితిలో ప్రస్తుత చైనా ప్రాభవం కనిపిస్తున్నది.
ఇంతకూ ఎవరి మీద చైనా యుద్ధభేరీ? ఎవరిప్పుడు చైనాకు తక్షణ శత్రువు? వినిమయ వస్తువుల తయారీకి ప్రపంచ కార్ఖానాగా మారిన తర్వాత గడిచిన పదిహేనేళ్లలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ఆర్థికబలం దన్నుతో నలుదిక్కులా చైనా కవ్వింపు చర్యలకు దిగడం మొదలుపెట్టింది. ఫలితంగా చైనాకు శత్రువులు తక్కువేమీ లేరు. సంప్రదాయక శత్రుదేశాలైన తైవాన్, జపాన్‌లతోపాటు దక్షిణ చైనా, తూర్పుచైనా సముద్రా ల్లోని ప్రతి తీరదేశంతోనూ అది గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నది. పెద్దన్న మాదిరి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నది. చౌక వేతనాల కారణంగా, వస్తూత్పత్తి రంగంలో తనకు పోటీగా తయారైన వియత్నాం, ఇండోనేషియాలపై కూడా చైనా కంటగింపుతోనే ఉన్నది. ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషించబోతున్న ఇండో–పసిఫిక్ మహాసముద్రాల్లో తనకు ఎదురులేకుండా చూసుకోవాలని చైనా ఉవ్విళ్లూరుతున్నది.
ఈ ప్రాంతంలో మరో బలమైన దేశమైన భారత్ చుట్టూ ‘పర్ల్ స్ట్రింగ్’ పేరుతో ఒక ఉరితాడును సిద్ధంచేసి ఉంచింది. చైనా దూకుడును అడ్డుకోవ డానికి అమెరికా నేతృత్వంలో ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ ఇక్కడ ‘క్వాడ్’ కూటమిగా ఏర్పడ్డాయి. అంతర్జాతీయ సంబం ధాల్లో ప్రస్తావించే ‘థుసుడిడిస్ ట్రాప్’ సూత్రం ప్రకారం అమెరి కాతో చైనా యుద్ధం అనివార్య పరిణామం. ప్రపంచంలో కొత్తగా సూపర్ పవర్‌గా ఎదుగుతున్న దేశం, ఇప్పటికే ఆ హోదాలో ఉన్న దేశాన్ని సవాల్ చేయడం సహజం. ఇది క్రమంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తుందన్న సూత్రీకరణ ప్రస్తుత అమెరికా–చైనాలకు వర్తిస్తుందని పొలిటికల్ సైంటిస్టుల అభిప్రాయం. ప్రాచీన గ్రీకు దేశంలో ఏథెన్స్, స్పార్టా నగరాల నడుమ యుద్ధం తప్పదంటూ థుసుడిడిస్ అనే సైనికాధికారి చేసిన సూత్రీకరణ ఆయన పేరుతో వ్యాప్తిలోకి వచ్చింది.
కానీ, అమెరికాతో యుద్ధానికి చైనా ఇప్పుడే కాలుదువ్వక పోవచ్చు. మొన్న షీ మోగించిన రణభేరీ భారత్‌పైనేనని కొందరు దౌత్య నిపుణుల అభిప్రాయం. ఇది నిజంగా యుద్ధా నికి దారితీస్తుందా? హెచ్చరికలు, బెదిరింపులతో ఆగిపోతుందా చెప్పలేము కానీ, చైనా తక్షణ టార్గెట్ మాత్రం ఇండియానే కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈమధ్య భారత్– చైనా జవాన్ల మధ్య జరిగిన లద్దాఖ్ ఘర్షణ చైనా అహాన్ని బాగా దెబ్బతీసింది. భారత సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి చైనా పథకం ప్రకారం గల్వాన్ లోయలో ఘర్షణకు దిగింది. ఊహించని సంఘటన అయినప్పటికీ భారత జవాన్లు ప్రతిఘ టించిన తీరును చూసి చైనా సైన్యం అవాక్కయింది. ఈ ఘర్ష ణలో 25 మంది జవాన్లు చనిపోయారని భారత్ అధికారికంగా ప్రకటించింది. తమవైపు నష్టాలను ప్రకటించే అలవాటు చైనాకు ఎప్పుడూ లేదు. భారత్‌కు జరిగిన నష్టం కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువ నష్టం చైనాకు జరిగిందని విశ్వసనీయ సమా చారం. భారత్–1962, భారత్–2020 మధ్య చాలా తేడా ఉందన్న సంగతి చైనాకు అర్థమైంది. చైనా సైనికులు గల్వాన్ కవ్వింపుకు దిగడం వెనక బలమైన కారణాలున్నాయి.
ప్రపం చాధిపత్యం కోసం చైనా రూపొందించుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్‌ఐ) కార్యక్రమంలో చేరడానికి భారత్ నిరాక రించింది. అంతేకాకుండా చైనా విస్తరణను ఎదుర్కోవడానికి అమెరికా ఏర్పాటు చేసిన క్వాడ్ బృందంలో సభ్యురాలిగా చేరింది. 3,400 కిలోమీటర్ల సుదీర్ఘమైన భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల వంటి మౌలిక వసతుల కల్పనపై భారత్ దృష్టి పెట్టింది. ఇది కూడా చైనాకు ఆగ్రహం కలిగించింది. అన్నిటినీ మించి మోదీ ప్రభుత్వం జమ్మూ–కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేయడం పాక్‌తోపాటు చైనాకు కూడా కడుపుమంట కారణమైంది. ఫలి తంగా జమ్మూ–కశ్మీర్, గిల్గిట్ బాల్టిస్థాన్‌తో కూడిన లద్దాఖ్ ప్రాంతం కేంద్ర పాలిత ప్రాంతాలుగా భారత యూనియన్‌లో భాగమయ్యాయి. లద్దాఖ్ తమ భూభాగమేనని చైనా ఎప్పటి నుంచో పేచీ పెడుతున్నది. పాకిస్తాన్ చైనా ఆర్థిక నడవా (సీపీఈసీ)లో భాగంగా గిల్గిట్ బాల్టిస్థాన్‌లో చైనా భారీ పెట్టు బడులు పెట్టింది.
అపార ఖనిజ సంపదకు నిలయం గిల్గిట్ బాల్టిస్థాన్. ఇక్కడున్న హిమనీ నదాలు, సింధు. ఉపనదులపై జలవిద్యుత్కేంద్రాలు నిర్మిస్తే 40 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చట. చైనాకు ఒకరకంగా బంగారు బాతు వంటిది గిల్గిట్ బాల్టిస్థాన్. లద్దాఖ్‌లో చైనా ఆక్రమించిన ఆక్సా యిచిన్ ప్రాంతాన్ని ఆనుకుని సముద్ర మట్టానికి ఐదువేల అడుగుల ఎత్తున భారత్ ఒక వైమానిక స్థావరాన్ని నిర్మించడం కూడా చైనా కలవరానికి కారణమైంది. చైనా వ్యూహాత్మక రవాణా మార్గాలన్నీ ఈ విమాన స్థావరానికి చేరువగా ఉంటాయి.
గల్వాన్ భంగపాటు తర్వాత తన ఆధిపత్యాన్ని నిరూపించు కోవడానికి భారత్‌పై మరింత పెద్ద దాడికి చైనా పూనుకునే అవకాశం ఉన్నది. ఆర్థికపరంగా చూసినా, మిలిటరీ పరంగా చూసినా భారత్ కంటే చైనా శక్తిమంతంగా కనిపిస్తున్నది. ఒక్క వైమానిక రంగంలో మాత్రమే భారత్ బలంగా ఉన్నది. ఈ నేప థ్యంలో రక్షణ వ్యవహారాల నిపుణుల్లో కొందరు భారత్ క్వాడ్ కూటమితో కలిసి సముద్ర జలాల్లో చైనాను నిలువరించడానికే ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు. భౌగోళిక సరిహద్దుల్లో యుద్ధరంగం భారత్‌కు అనుకూలంగా ఉండదని వీరి ఉద్దేశం. చైనాకు అనుకూలంగా పాక్ రంగంలోకి దిగుతుంది. అమెరికాతో ఒప్పందం ఫలితంగా అఫ్గానిస్తాన్‌లో త్వరలో తాలిబన్‌లు అధి కారంలోకి రాబోతున్నారు. ఇది భారత్‌కు ప్రతికూలం. అమెరి కాతో శతృత్వం కారణంగా ఇరాన్ చైనాకు చేరువైంది. ఇలా మధ్య ఆసియా, పశ్చిమాసియా, దక్షిణాసియా ప్రాంతాల్లో చైనాకు అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని ఈ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వీరు చెబుతున్న కారణాలన్నీ నిజమే. కానీ సరిహద్దుల్లో భారత్‌కు అనుకూల వాతావరణం లేదన్నది సరికాదు. ఒక్కసారి చరిత్రను మధిస్తే ఈ సరిహద్దే మనకు అద్భుతమైన ఆయుధంగా ఉపయోగపడగలదని అర్థమవు తుంది. ఎందుకంటే సుదీర్ఘమైన 3,400 కిలోమీటర్ల సరిహద్దు భారత్ – చైనా సరిహద్దు కాదు. ఇది టిబెట్–భారత సరిహద్దు మాత్రమే. టిబెట్ ముమ్మాటికీ చైనా ఆక్రమిత ప్రాంతమే. చరి త్రలో కొంతకాలం కొన్ని చైనా రాజవంశాల ఏలుబడిలో ఉన్నంత మాత్రాన టిబెట్ చైనాలో భాగమని భావిస్తే, ఆగ్నే యాసియా దేశాలను కూడా భారత్‌లో భాగంగా గుర్తించవలసి ఉంటుంది.
క్రీస్తుశకం ఏడో శతాబ్దం టిబెట్ చరిత్రలో కీలకమైన కాలం. అప్పటి నుంచి దాదాపు రెండొందల యేళ్లకాలం టిబెట్ సువి శాలమైన స్వతంత్ర రాజ్యంగా విలసిల్లింది. దక్షిణాన అరుణా చల్‌ప్రదేశ్, భూటాన్, నేపాల్, లద్దాఖ్‌ల వరకు, పడమట కిర్ఘిజిస్తాన్, ఉజ్బెకిస్తాన్, షింజియాంగ్‌ల వరకు, ఉత్తరాన గోబీ ఎడారుల వరకు, తూర్పున చైనాలోని సెచువాన్, చెంగ్డూ ప్రావి న్స్‌ల వరకు టిబెట్ సరిహద్దులు విస్తరించాయి. ఈకాలంలోనే భారతదేశంలో నిరాదరణకు గురౌతున్న బౌద్ధం టిబెట్‌లోకి ప్రవేశించి విస్తరించింది. టిబెట్ బౌద్ధం పూర్తిగా భారతీయ శాఖ. ఆదినుంచీ చైనా కంటే మిన్నగా భారత్‌తోనే టిబెట్ సాంస్కృతిక సంబంధాలు ఎక్కువగా ఉండేవి. హిందువులకు పవిత్రమైన కైలాస పర్వతం, మానస సరోవరం టిబెట్‌లోనివే. ఇవి పరాయి దేశంలో ఉన్నట్లుగా హిందువులు ఎప్పుడూ భావించలేదు.
టిబెటన్ల స్వర్ణయుగం కాలంలో హన్ జాతీయ చైనీయుల టాంగ్ సామ్రాజ్యం తూర్పు చైనాకు మాత్రమే పరిమితమైంది. అదే సమయంలో ఉత్తర భారతదేశంలో చివరి హిందూ సామ్రాజ్యం హర్షవర్ధనుడి ఏలుబడిలో ఉంది. ఆ కాలంలోనే చైనా బౌద్ధ యాత్రికుడు హువాన్‌సాంగ్ వేల కిలోమీటర్ల దూరం నడిచి భారత్‌కు వచ్చి బౌద్ధ విజ్ఞానాన్ని అభ్యసించి, అనేక విలువైన బౌద్ధ గ్రంథాలను తీసుకొని చైనాకు వెళ్లాడు. ఇందుకోసం ఆయన తన విలువైన జీవితకాలంలో ఇరవై సంవత్సరాలను వెచ్చించాడు. ఆ తర్వాత కొంత కాలానికే భారతదేశం దక్షిణ కొసనున్న కేరళ నుంచి ఒక నంబూద్రి బ్రాహ్మణ బాలుడు ఎనిమిదో ఏటనే సన్యసించి వేల కిలోమీటర్లు కాలినడకన దేశాటన చేసి, అద్వైతవాదంతో హిందూ ధర్మాన్ని పునఃప్రతి ష్టించి బౌద్ధాన్ని దేశం నుంచి బహిష్కరించడంలో కీలకపాత్ర పోషించాడు. 32వ ఏటనే కన్నుమూశాడు. ఈ కర్తవ్య నిర్వ హణకు ఆయన తన జీవితకాలంలో మూడొంతులు వెచ్చిం చాడు. ఆ బ్రాహ్మణ బాలుడు ఆదిశంకరుడు.
అప్పుడు దేశం విడిచి వెళ్లిన బౌద్ధం (భారతీయ వజ్ర యానం) టిబెట్‌లో భద్రంగా ఉన్నది. కాకపోతే టిబెట్ మాత్రం తన స్వాతంత్య్రాన్ని కోల్పోయింది. దురాక్రమణకు గురైనప్పటికీ మంగోల్‌ల ఏలుబడిలోనూ, చింగ్ పాలకుల (మంచూరియన్ జాతి) హయాంలోనూ స్వతంత్ర ప్రతిపత్తిని అనుభవించిన టిబెట్ ఇప్పుడు హన్ జాతీయవాద కమ్యూనిస్టుల పాలనలో ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నది. చైనా జాతీయ వాదాన్ని పునరుజ్జీవింపజేసిన మావో జెడాంగ్ అసలు సిసలు వారసుడు షీ జిన్‌పింగ్. ఇప్పుడు చైనాలో హన్ జాతీయవాదం ప్రపంచ పెత్తనంకోసం తహతహలాడుతున్నది. షింజియాంగ్‌లో వీగర్ ముస్లిం మైనారిటీలను ఊచకోత కోశారు. పది లక్షలమందికి పైగా ఇప్పుడు జైళ్లలో మగ్గుతున్నారు. టిబెట్‌లో బౌద్ధులకు సామూహిక ప్రార్ధనలకు సైతం అనుమతి లేదు. స్వాతంత్య్ర కాంక్ష టిబెటన్లలోనూ, వీగర్లలోనూ అడుగంటలేదు. ఇప్పుడు భారతదేశం స్వాప్నికుడైన పండిత నెహ్రూ పాలనలో లేదు.
హిందూ జాతీయవాదంలో కాకలు తీరిన నరేంద్ర మోదీ నాయ కత్వంలో ఉంది. హన్ జాతీయవాదం, హిందూ జాతీయవాదం ముఖాముఖి తలపడబోయే సన్నివేశానికి ఇది పూర్వరంగం. టిబెటన్ల స్వాతంత్య్ర ఆకాంక్షలకు బహిరంగ మద్దతు ప్రకటించి అక్కడ శాంతియుత ఉద్యమాలకు ఊపిరిపోసే అవకాశం ఇంకా ఆలస్యం చేస్తే లభించదు. ఇంక కొంతకాలానికి అక్కడ టిబెటన్లు మైనారిటీలుగా మారిపోతారు. ఆసియా ఖండలోని అన్ని ప్రధాన జీవనదులకూ పుట్టినిల్లు టిబెట్. ఇప్పటికే మెకాంగ్ నదిపై లెక్కకు మించి నిర్మించిన డ్యామ్‌ల వల్ల ఆగ్నేయాసియా దేశాలు అల్లాడుతున్నాయి. బ్రహ్మపుత్రను సైతం దారిమళ్లించే ప్రయత్నం జరుగుతున్నది. టిబెట్ స్వాతంత్య్ర ఆకాంక్షలకు మద్దతుగా ప్రపంచ జనాభిప్రాయాన్ని సమీకరించే అవకాశాన్ని భారత్ వదులుకోరాదు. హన్ జాతీయవాద దూకుడుకు ప్రస్తుత చైనా భూభాగంలోనే కళ్లెం వేయడానికి ఇదే అదను. మనం పంపించివేసిన బౌద్ధాన్ని నెత్తినపెట్టుకున్న టిబెట్ ప్రజల జాతీయవాదమే ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా మన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం.
వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment