‘ఆకాశం’లోకి నేల జారిపోతోంది | Wage Earners In Interest | Sakshi
Sakshi News home page

‘ఆకాశం’లోకి నేల జారిపోతోంది

Published Fri, Sep 29 2023 3:08 AM | Last Updated on Fri, Sep 29 2023 3:10 AM

Wage Earners In Interest - Sakshi

వడ్డీల్లో వేతన జీవులు..
హైదరాబాద్‌లో ఓ ఐటీ ఎంప్లాయ్‌.. ఉద్యోగంలో చేరి మూడేళ్లయ్యింది. లక్ష దాకా శాలరీ వస్తోంది.  ఓ అపార్ట్‌మెంట్‌ కొనుక్కున్నాడు. అదీ ఆఫీసుకు 20 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడాయన తన శాలరీలో 50 వేలు  ఈఎమ్‌ఐ కడుతున్నాడు.  అలా 20 ఏళ్లు కట్టాలి. ఇక మధ్య బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెంచితే మరో ఐదేళ్లు.. అంటే  ఈ కిస్తులు రిటైర్‌మెంట్‌ దాకా పోయినా ఆశ్చర్యం లేదు. అంటే జీతంలో సగం. అసలే ప్రైవేటు ఉద్యోగం.. ఎప్పుడు పింక్‌ స్లిప్‌ వస్తుందో తెలియదు. పప్పు, ఉప్పు లాంటి నిత్యావసర సరుకులు కాసింత పెరిగి తేనే నెలాఖరుకు ఇబ్బంది పడే మధ్యతరగతి  ఉద్యోగి జీతంలో సగం తలదాచుకోవడానికి పెట్టాల్సివస్తోంది.

లైఫ్‌ క్వాలిటీని నిలువెల్లా తినేస్తోంది. మధ్యతరగతి జీవితం నుంచి బయటపడాలి, ఐదంకెల జీతం రావాలి అని పాతికేళ్లు చదివి లక్ష రూపాయల ఉద్యోగం దాకా చేరిన వారు. అంతులేకుండా పెరిగిన ఇళ్ల ధరల కారణంగా బొటాబొటి ఆదాయంతోనే బతికే పరిస్థితి వచ్చింది. మళ్లీ అదే మధ్యతరగతి... అదే నెలాఖరు. లోన్లు, వడ్డీలు నడ్డి విరుస్తుంటే జీవితం ఎప్పుడూ చేబదుల్లోనే ఉంటోంది. నిత్యావసరమైన  నేల అంగడి సరుకయ్యింది. బంగారంలా పెట్టుబడి అయ్యింది. పేద మధ్య తరగతి కాళ్లకిందనుంచి నేల జారిపోయింది.

నేల.. ఓ సేల్‌ డీడ్‌
డబ్బు పెరిగి పిల్లలు పెట్టాలంటే ఆర్థిక నిపు ణులు మూడు విధాలుగా పెట్టుబడి పెట్టడం మార్గంగా చెబుతున్నారు. ఒకటి రియల్‌ ఎస్టేట్, రెండవది బంగారం కొనడం, మూడవది షేర్‌ మార్కెట్‌లో మదుపు చెయ్యడం. ఈ మూడు విధాలుగా దాచే డబ్బూ విలువ పెంచుతుంది. ఇప్పుడీ మూడింటిలో మనిషికి నీడనివ్వాల్సిన నేల ధనికుల పెట్టెల్లో షేర్‌ పత్రాల్లాగా సేల్‌ డీడ్స్‌ రూపంలో పడి ఉంటోంది. స్టాక్‌ మార్కెట్‌ తర్వాత ఎక్కువ రిటర్న్స్‌ ఇచ్చే రంగం ఇదే అయ్యింది . ట్యాక్స్‌ కట్టని  నల్లడబ్బు పునాదుల మీద రియల్‌ ఎస్టేట్‌ ‘హైరైజ్‌’లో ఉంది.

సర్కార్‌.. మార్కెటింగ్‌
రియల్‌ ఎస్టేట్‌ మదుపు చేసేవారంతా అవినీతి పరులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలే అని నిర్ధారించడం కాదు.. నేల వ్యాపారం అయితే దాని విలువ నిలువ నీడ లేకుండా చేస్తుంది. ఈ ధోరణిని మార్కెట్టే కాదు.. సర్కారు కూడా  ఎంకరేజ్‌ చేస్తోంది. కోకాపేటలో  ఎకరం వందకోట్లు, నియో పోలీస్‌ లలో వంద కోట్లు.. బుద్వేల్‌లో 46 కోట్లు.. ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు కొనొచ్చు.. ఇవన్నీ నిజంగా గర్వ పడాల్సిన మాటలేనా..? ఈ చుట్టు పక్క ప్రాంతాల వైపు సాధారణ ప్రజలు కన్నెత్తి చూడ లేస్తారా...? పేద, మధ్యతరగతికి  ఆరడుగుల నేల దూరం చేసే ధోరణి కాదా...?  మెజారిటీ ప్రజలు తమ జీవిత కాలంలో ఒక ఇల్లు కొనుక్కోవటమే గగనం. ఎలాగోలా కష్టపడి కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఎక్కువ మొత్తం బ్యాంకు లోన్‌ తీసుకుంటే తప్ప ఆ ఒక్క ఇల్లు కొనటం కూడా సాధ్యం కాదు.

ఓ వంద గజాలు కొనుక్కోవాలంటే ఆ ఇంటి అప్పు తీర్చటానికి జీవిత కాలం  పడుతుంది. ఇలాంటి వారికి ఎక రాలు, అవి సర్కారుకు అందిస్తున్న వందల కోట్లు ఆనందాన్నిస్తాయా...? రాష్ట్రం ప్రగతి ప«థంలో పడుతుందన్న సంబురాన్నిస్తుందా? తలదాచుకోవడానికి ఉపయోగపడాల్సిన నేల, ఇల్లు .. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మారి దాని లోకి నేరుగా ప్రభుత్వాలే దిగడం మరింత ఆందోళనకరం.

ఇది క్రమంగా రాజకీయాలకు అవసరంగా, ఎన్నికల ఇంధనంగా మారిపోయింది. క్రమంగా స్థిరాస్తి రంగం అన్ని రంగా లను శాసిస్తోంది. పెద్ద పెద్ద తలకా­యలు అన్ని దీనిలో తలదూర్చాయి. మెజారిటీ ప్రజల మీద వీర విహారం చేస్తున్నాయి. ఈ ధోరణి నగరాల నుంచి క్రమంగా పల్లెల మీద పడింది. వ్యవసాయ భూముల్లో కలుపు మొక్క ల్లాగా పెరుగుతోంది. స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుక, టైల్స్, గ్రానైట్, ఒకటేమిటి... చాలా రంగాలు, వ్యాపారాలు రియల్‌ ఎస్టేట్‌తో ముడి పడి ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌ అన్ని రంగాలను శాసిస్తోంది. ఇప్పుడివన్నీ రాజకీయ నాయకులు, పెద్దల చేతుల్లోకి వెళ్లి పోయాయి.

30 మంది.. 8,000 ఇళ్లు..
ఇది మన ఒక్కరి సమస్యే కాదు. ఉదాహరణగా,  ఈ వార్త చూడండి.. దక్షిణ కొరియాకు సంబంధించినది. 30 మంది వ్యక్తులు ఐదున్నర సంవత్సరాల కాలంలో 8,000 ఇళ్ళు కొనుగోలు చేశారు. వీటి మొత్తం విలువ మన భారతీయ కరెన్సీలో 7,446 కోట్ల రూపాయలు. 2018 సంవత్సరం నుంచి 2023 జూన్‌ మధ్య కాలంలో ఈ ముప్పై మంది 8,000 ఇళ్ళు కొనుగోలు చేశారు.

చైనాలో 100 కోట్ల ఇళ్లు ఖాళీ..
మితి మీరిన వ్యాపారం  ఎక్కడికి దారి తీస్తుందో చైనా వార్త చెబుతుంది. ఇక్కడ దాదాపు 100 కోట్ల ఇళ్లు ఖాళీగా ఉన్నా యట. ఇప్పటికే దే«శవ్యాప్తంగా నిర్మాణాల్లో ఉన్న నివాస గృహాలన్నీ అందుబాటులోకి వస్తే 300 కోట్ల మందికి సరిపోతాయట. చైనా దేశ స్టాటి స్టిక్స్‌ బ్యూరో మాజీ డిప్యూటీ హెడ్‌ హే కేంగ్‌ స్వయంగా చెప్పిన విషయం ఇది. చైనా జీడీపీలో 30 శాతం రియల్టీదే.  ఇప్పుడా రంగమే చైనాకు పెను భారమైంది. వ్యాపార కాంక్షతో హైదరా బాద్‌ చుట్టూ ఆకాశం దాకా విస్తరిస్తున్న కాంక్రిట్‌ జంగిల్‌కు ఇదో హెచ్చరిక. స్థలాలు, గృహాల ధరలు పరిమితికి మించి పెరిగిపోవడంతో హైదరాబాద్‌ నగరంలో ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోళ్లు తగ్గిపోతున్నాయి.

ఓ ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ అంచనా ప్రకారం.. 2022 ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య ఆరు నెలల్లో 1,460 కొత్త ఇళ్లు అమ్ముడవగా.. 2023లో ఇదేకాలానికి 720 ఇళ్లే అమ్ముడ య్యాయి. స్థలాలు, ఇళ్ల ధరలు పెరిగిపోవడమే దీనికి కారణమని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలే చెప్తున్నాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో మూడు, నాలు గేళ్ల కింద వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్‌ సుమారు రూ. 50 లక్షల్లో వస్తే.. ఇప్పుడది రూ. 70 లక్షల నుంచి రూ. 90 లక్షల వరకు పెరిగిందని అంటున్నాయి. 

వీధుల్లో పేదలు..
వేతన జీవుల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక పేదల పరిస్థితి ఏమిటి..?
► 27 సభ్యదేశాలున్న ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రతి లక్ష మందికి ఫ్రాన్స్‌లో 217 మంది, యూఎస్‌లో 177, చిలీలో 155, ఐర్లాండ్‌లో 78, స్పెయిన్‌ లో 49, పోర్చుగల్‌లో 20 మంది పూర్తిగా నిరాశ్రయులే.
► సొంత ఇల్లు, ఉపాధి లేక.. షెల్టర్లలో ఆశ్రయం పొందినవారూ ఈ దేశాల్లో ఉన్నారు. యూకేలో 7.7 శాతం, యూఎస్‌లో 6.2 శాతం, ఇటలీలో 4 శాతం, బెల్జియంలో 3.4 శాతం, జర్మనీలో 2.4 శాతం మంది తాము జీవితంలో ఒకసారైనా ఇలాంటి పరిస్థితిని అనుభవించామని ఒక సర్వేలో వెల్లడించారు.
► ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. జపాన్‌లో నిరాశ్రయుల సంఖ్య అతి తక్కువ. ఉత్తమ గృహ కల్పన విధానాలు, డ్రగ్స్‌ నియంత్రణ, మానసిక ఆరోగ్య పరిరక్షణ చర్యలు వంటివి దీనికి కారణం.
► ప్రపంచంలో నిరాశ్రయుల సంఖ్య అతిఎక్కువగా ఉన్న దేశం నైజీరియా. అక్కడి జనాభాలో 12 శాతం వరకు నిరాశ్రయులే.
► మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం పలు పథకాలను అమలు చేస్తున్నా, యూఎన్‌  మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌ నివేదిక ప్రకారం... మన దేశ జనాభాలో 6.7 శాతం నిరుపేదలే. వీరిలో చాలా మంది నిలువ నీడ లేక ఇబ్బంది పడుతున్న వారే. దీనికి సంబంధించి ‘కోల్డ్‌ అండ్‌ అన్‌ కేర్‌డ్‌ ఫర్‌ (సీఏయూఎఫ్‌) సొసైటీ’ తమ నివేదికలో పలు కీలక అంశాలను వెల్లడించింది.
► దేశంలోని చాలా నగరాల్లో ఇళ్లు, స్థలాల ధరలు పేదలకు అందుబాటు ధరల్లో లేకపో వడం సమస్యగా మారింది. కనీసం అద్దెలను కూడా భరించలేని పరిస్థితి ఉంది. దీనికి తోడు ఆదాయ అసమానతలు, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వివక్ష వంటివి కూడా.. ఇళ్లు కొన లేకపోవడానికి కారణమవుతున్నాయి.
► దేశంలో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి పెద్ద నగరాల్లో ఇళ్లులేని పేదల సంఖ్య ఎక్కువగా ఉంది. - సారాంశం: సరికొండ చలపతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement