గెలుపు గుర్రాలు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

గెలుపు గుర్రాలు సిద్ధం

Published Sun, Mar 17 2024 2:20 AM | Last Updated on Sun, Mar 17 2024 8:12 AM

- - Sakshi

 సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని గంటల ముందే గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో నలుగురు కొత్తవారికి సీట్లు కేటాయించారు. తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్ధులను ప్రకటించినా రెండుపార్టీల మద్య సమన్వయం ఇప్పటికీ పూర్తిస్థాయిలో రాలేదు. మరోవైపు వైఎస్సార్‌సీపీ మాత్రం షెడ్యూల్‌తో సంబంధం లేకుండానే ఆరు నెలల ముందు నుంచే పార్టీ యంత్రాంగం యావత్తు జనంతో మమేకమవుతూ ఎన్నికలకు ముందస్తుగానే సిద్ధమైంది.

సిద్ధం సభలు కూడా విజయవంతం కావడంతో క్యాడర్‌ రెట్టించిన ఉత్సాహంతో పోరుకు సన్నద్ధం అవుతున్నారు. నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటనతో సంబంధం లేకుండా ముందుగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా నియమించి అభ్యర్థిత్వాలపై అన్ని కోణాల్లో వడపోత పోసింది. గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో నలుగురు కొత్తవారిని నియమించడమే కాకుండా, ఎంపీ అఽభ్యర్థిని కూడా మార్చింది. అసెంబ్లీలో మహిళల సంఖ్యను పెంచాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా నుంచి ఏకంగా నలుగురు మహిళలకు అవకాశం కల్పించారు. ఒక పార్లమెంట్‌ పరిధిలో ఏడు స్థానాలకు ఏకంగా నలుగురు మహిళలను రంగంలోకి దింపడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి.

► గుంటూరు పార్లమెంట్‌కు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కిలారు రోశయ్య వరుసగా ఐదుసార్లు గెలిచిన తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్రను ఓడించి 2019లో పొన్నూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకూ జరగని అభివృద్ధిని చేసి చూపించారు. ఆయనను అధిష్టానం పార్లమెంట్‌కు ప్రమోట్‌ చేసింది.

► గుంటూరు తూర్పు నియోజకవర్గానికి తొలిసారి ఒక మైనారిటీ మహిళను రంగంలోకి దింపడం ద్వారా వైఎస్సార్‌ సీపీ చరిత్ర సృష్టించింది. 2014, 2019లో తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొందిన మహ్మద్‌ ముస్తఫా కుమార్తె నూరిఫాతిమాను పార్టీ రంగంలోకి దింపింది. గత రెండు సంవత్సరాలుగా ఫాతిమా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

► గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినిని అభ్యర్థిగా ప్రకటించింది. 2019లో చిలకలూరిపేట నుంచి గెలుపొందిన ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వరుసగా రెండుసార్లు తెలుగుదేశం గెలిచిన ఈ నియోజకవర్గంలో రజిని తనదైన ముద్ర వేశారు. ఆమెకు పోటీగా ఎవరిని పెట్టాలనే దానిపై తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడిపోయి ఇప్పటి వరకూ కష్టపడ్డ వారందరిని కాదని, ఒక మహిళకు కేటాయించాల్సి వచ్చింది.

► తాడికొండ నియోజకవర్గానికి జిల్లాలో సీనియర్‌ రాజకీయ వేత్త, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను రంగంలోకి దింపారు. ఆమె తన సొంత నియోజకవర్గంలో పోటీ చేయడం తొలిసారి. ఇప్పటి వరకూ ఆమె ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. 2019 నుంచి 2022 వరకూ హోం మంత్రిగా పనిచేశారు.

► తెనాలి నియోజకవర్గం నుంచి అన్నాబత్తుని శివకుమార్‌కు సీటు కేటాయించారు. ఆయన 2019లో తెనాలి నుంచి గెలుపొందారు. నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు పాటుపడ్డారు. ఆ సీటును పొత్తుల్లో భాగంగా తెలుగుదేశంపార్టీ జనసేనకు కేటాయింది. ఇక్కడ మరోసారి గెలుపుగుర్రం ఎక్కేందుకు శివకుమార్‌ సిద్ధం అవుతున్నారు.

► మంగళగిరి నియోజకవర్గానికి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మురుగుడు లావణ్యను ఎంపిక చేశారు. ఆమె పుట్టింటివారు, అత్తింటివారు ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నవారే. ఆమె తల్లి కాండ్రు కమల ఎమ్మెల్యేగా చేయగా, మామయ్య మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌ను ఢీ కొడుతున్నారు.

► పొన్నూరు నియోజకవర్గానికి అంబటి మురళీకృష్ణను అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. అయన సోదరుడు అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి గెలిచి జలవనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అంబటి మురళీకృష్ణ బజరంగ్‌ ఫౌండేషన్‌ ద్వారా పొన్నూరు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

► ప్రత్తిపాడు నియోజకవర్గానికి బలసాని కిరణ్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన కూడా రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినవారే. ఆయన తల్లి విజయవాడ నగరపాలక సంస్థలో కార్పొరేటర్‌గా పనిచేస్తున్నారు.

తాడికొండ అభ్యర్ధి
నియోజకవర్గం: తాడికొండ
పేరు: మేకతోటి సుచరిత, వయస్సు.: 53    విద్యార్హత: బీఏ
సామాజికవర్గం: ఎస్సీ    ఎన్నికల్లో పోటీ: ఐదోసారి

రాజకీయ నేపథ్యం: 2006లో ఫిరంగిపురం మండలం జడ్పీటీసీగా పోటీచేసి భారీ మెజారీ్టతో విజయం సాధించారు. 2009లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి ఆశీస్సులతో పత్తిపాడు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆయన మరణానంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచి విజయం సాధించారు. 2014లో రావెల కిషోర్‌ బాబుపై ఓటమి పాలవగా, 2019లో తిరిగి వైఎస్సార్‌సీపీ తరుపున డొక్కా మాణిక్య వరప్రసాద్‌పై విజయం సాధించి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశీస్సులతో ఏపీకి తొలి మహిళా హోం మంత్రిగా పదవిని అలంకరించారు. ప్రస్తుతం తాడికొండలో పార్టీ కోసం పనిచేస్తూ 2024 అసెంబ్లీ అభ్యరి్థగా బరిలోకి దిగుతున్నారు.

 ప్రత్తిపాడు అభ్యర్థి
నియోజకవర్గం: ప్రత్తిపాడు
పేరు: బలసాని కిరణ్‌కుమార్‌
వయస్సు.:  
విద్యార్హత: ఎల్‌ఎల్‌బీ
సామాజిక వర్గం: ఎస్సీ
ఎన్నికల్లో పోటీ: మూడోసారి
రాజకీయ నేపథ్యం: రాజకీయ వారసత్వంగా వచ్చారు. తల్లి మణిమ్మ విజయవాడ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌గా పనిచేస్తున్నారు. కోవిడ్‌ సమయంలో డివిజన్‌ జ్రలకు నిత్యావసర సంరకులు, వైఎస్సార్‌ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. 

తెనాలి అభ్యర్థి
నియోజకవర్గం: తెనాలి
పేరు: అన్నాబత్తుని శివకుమార్‌
విద్యార్హత: డిగ్రీ
సామాజిక వర్గం: రెడ్డి
ఎన్నికల్లో పోటీ: మూడోసారి
రాజకీయ నేపథ్యం: తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రముఖ విద్యాసంస్థను నడుపుతున్నారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.  2014లో వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో గెలుపొందారు. 

మంగళగిరి అభ్యర్థి
నియోజకవర్గం: మంగళగిరి
పేరు: మురుగుడు లావణ్య
వయస్సు.:  39     విద్యార్హత: ఎంకాం, ఎల్‌ఎల్‌బీ
సామాజిక వర్గం: చేనేత    ఎన్నికల్లో పోటీ: తొలిసారి
రాజకీయ నేపథ్యం: గృహిణిగా ఉన్న మురుగుడు లావణ్య తల్లి కాండ్రు కమల మాజీ మంగళగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యురాలిగా గతంలో పనిచేశారు. లావణ్య మామ మురుగుడు హనుమంతరావు ఎంఎల్‌సీ, చైర్మన్‌ కమిటీ ఆఫ్‌ ఎథిక్స్‌ ఏపీ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌గా ఉన్నారు. గతంలో మంత్రిగా, మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్, బీసీ వెల్ఫేర్‌ కమిటీ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ, ఆప్కో చైర్మన్‌గా పనిచేశారు.  

గుంటూరు ఎంపీ అభ్యర్థ్ధి
లోక్‌సభ స్థానం: గుంటూరు 
పేరు: కిలారి వెంకట రోశయ్య,  వయస్సు.: 56,      
విద్యార్హత: బీకాం, ప్రస్తుత హోదా: ఎమ్మెల్యే, పొన్నూరు
సామాజిక వర్గం: కాపు,  
ఎన్నికల్లో పోటీ: మూడోసారి
రాజకీయ నేపథ్యం: రోశయ్య రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి కోటేశ్వరరావు కౌన్సిలర్‌గా పనిచేశారు. గుంటూరు మిర్చి యార్డుకు చైర్మన్‌గా పనిచేశారు. 1993లో మిర్చి అసోసియేషన్‌కు ఉపాధ్యక్షుడిగా, 1994లో మిర్చియార్డు చైర్మన్‌గా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యంలో చేరారు. తెనాలి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో వైఎస్సార్‌ సీపీలో చేరారు. పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

పొన్నూరు అభ్యర్థి
నియోజకవర్గం: పొన్నూరు
పేరు: అంబటి మురళీకృష్ణ 
వయస్సు.: 58 
విద్యార్హత: బీటెక్‌
సామాజిక వర్గం: కాపు
ఎన్నికల్లో పోటీ: తొలిసారి
రాజకీయ నేపథ్యం: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు సోదరుడు. 2019 ఎన్నికల్లో అంబటి రాంబాబు గెలుపునకు కృషి చేశారు. సామాజిక కార్యక్రమాలు: సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చి బజరంగ్‌ ఫౌండేషన్‌ స్థాపన –  బజరంగ్‌ ఫౌండేషన్‌ తలసేమియా రహిత ఆంధ్రప్రదేశ్‌ కోసం కృషి చేస్తుంది. పొన్నూరు నియోజకవర్గంలోని 52 గ్రామాల్లో నేత్ర, గుండె, దివ్యాంగ, ఫిజియోథెరపీ ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి, అనేక వేలమందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.

గుంటూరు తూర్పు అభ్యర్థి
నియోజకవర్గం: గుంటూరు తూర్పు
పేరు: షేక్‌ నూరిఫాతిమా
వయస్సు.:  41
విద్యార్హత: బీటెక్‌
సామాజిక వర్గం: మైనారిటీ
ఎన్నికల్లో పోటీ: తొలిసారి
రాజకీయ నేపథ్యం: ప్రస్తుతం ఆమె తండ్రి షేక్‌ ముస్తఫా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆయన వారసత్వంగా రాజకీయాల్లో వచ్చారు. కొన్నేళ్లుగా తండ్రి వెంట ఉంటూ అభివృద్ధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వికలాంగులకు ట్రైసైకిళ్లు అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. 

గుంటూరు పశ్చిమ అభ్యర్థి
నియోజకవర్గం: గుంటూరు పశ్చిమ
పేరు: విడదల రజిని
వయస్సు.:  34
విద్యార్హత: బీఎస్సీ, ఎంబీఏ
సామాజిక వర్గం: కాపు
ఎన్నికల్లో పోటీ: రెండో సారి
రాజకీయ నేపథ్యం: ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018లో వైఎస్సార్‌ సీపీలో చేరారు. చిలకలూరిపేట నుంచి పోటీ చేసి అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement