వైఎస్సార్ సీపీ ఎంపీటీసీకి బలవంతంగా కండువావేసి..
ఫొటోలు తీసి .. పార్టీలో చేరారని ప్రచారం చేసి
ఎమ్మెల్యే శంకరరావును ఆశ్రయించి అసలు విషయం బయటపెట్టిన వైనం
అచ్చంపేట: నిన్నా మొన్నటి వరకు నియోజకవర్గం ఎటో కూడా తెలియని టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎలాగైనా వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులను వశపరుచుకునే కుటిల యత్నాలు మొదలు పెట్టారు. ఇంట్లో ఉన్న వారిని సైతం ఇప్పుడే వెళుదువుగానంటూ తీసుకెళ్లి డబ్బు ఎరచూపి బలవంతంగా మెడలో పచ్చ కండువా కప్పి ఫొటోలు తీసి మా పార్టీలో వచ్చాడంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి ఆనందపడి పోతున్నాడు.
వివరాల్లోకి వెళితే...
అచ్చంపేట–1 ఎంపీటీసీ షేక్ మహిద్దీన్‌ను ఇంటికి బుధవారం సాయంత్రం కొంతమంది టీడీపీ నాయకులు వచ్చారు. ‘నీతో పనుంది.. వెంటనే వద్దువు రమ్మనమని’ టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన తమ పార్టీలోకి రమ్మంటూ ప్రలోభ పెట్టారు. అయినా వినకపోయే సరికి బలవంతంగా టీడీపీ కండువా కప్పి, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారు. అది చూసుకుని అవాక్కైన సదరు ఎంపీటీసీ మొహిద్దీన్ గురువారం ఉదయాన్నే ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వద్దకు వెళ్లి తాను వైఎస్సార్ సీపీలోనే ఉన్నానన్నారు. ప్రాణం పోయినా వైఎస్సార్ సీపీని వీడేది లేదని, టీడీపీ వారు తమ పార్టీలోకి రావాలంటూ బలవంతంగా పచ్చ కండవా వేసి ఫొటోలు తీశారంటూ ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు. తిరిగి ఎమ్మెల్యే చేత వైఎస్సార్ సీపీ కండువా కప్పించుకున్నారు.
టీడీపీవి చీఫ్ పాలిటిక్స్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ టీడీపీవారు అధికారంలో ఉండగా నియోజకవర్గంలో ఏంచేశారో, ఇకపై ఏంచేస్తారో చెప్పుకునే ధైర్యంలేక ఇలాంటి చీప్ పాలిట్రిక్స్ ప్లే చేస్తూ ప్రజలలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల్లో అలజడులు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కానీ ప్రజలెవ్వరూ టీడీపీ మాటలు నమ్మే పరిస్థితులలో లేరని, గత 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎవరెవరికి ఎన్ని సంక్షేమ ఫలాలు అందాయో అందరికీ తెలుసునన్నారు. మంచి చేసే వారిని వదులుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, మళ్లీ వైఎస్సార్ సీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగసాని బాబు, అచ్చంపేట సర్పంచ్ షేక్ జాని, మాజీ సర్పంచ్ కంబాల వీరబాబు, వ్యవసాయ యూనివర్శిటి మాజీ డైరెక్టర్ నెల్లూరి చంద్రబాబు, పెదకూరపాడు ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య, రవి, ఈపూరి శ్రీనివాసరెడ్డి, విప్పర్ల వాసు తదితరులు పాల్గొన్నారు.
తప్పు తెలుసుకుని తిరిగొచ్చాం
అమరావతి: ప్రలోభాలకు లోనై గురువారం ఉదయం టీడీపీలో చేరిన అమరావతి గాజులపాలెం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సాయంత్రానికి తమ తప్పు తెలుసుకుని మళ్లీ సొంత గూటికి చేరారు. గురువారం సాయంత్రం క్రోసూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఓర్సు రవి, దేవాళ్ళ పవన్, పల్లపు రాజు, బండారు కోటేశ్వరరావులకు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈసందర్భంగా ఓర్సు రవి మాట్లాడుతూ మా కాలనీకి చెందిన ఓ వ్యక్తి మభ్యపెట్టి మీటింగ్ ఉందని తీసుకువెళ్లి టీడీపీ కండువాలు కప్పించారన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలమైన తమను ఇష్టం లేకుండానే టీడీపీలో చేర్చారన్నారు. నిజం తెలుసుకొని ఇవాళ మళ్లీ పార్టీలోకి తిరిగి వచ్చామన్నారు. టీడీపీ నేతలు ఇలాగే మరికొంత మందిని ప్రలోభాలకు గురిచేయడానికి చూస్తున్నారని ఎవరూ నమ్మొద్దన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు తన్నీరు శ్రీనివాసరావు, కోవూరి వెంకటేశ్వరరావు, నండూరు కరుణకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment