కోడ్ వచ్చింది.. ఏం చేయవచ్చు? ఏం చేయవద్దు?
నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహణకే ఎంసీసీ
పూర్తి స్థాయి అమలుపై దృష్టి పెట్టిన అధికారులు
కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ – ఎంసీసీ) అమలులోకి వచ్చింది. ప్రజాస్వామ్య పాలనలో అత్యంత కీలకమైన ఎన్నికలను ఎటువంటి ప్రలోభాలకు తావు లేకుండా.. పూర్తి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించే లక్ష్యంతో.. వివిధ రాజకీయ పార్టీల ఆమోదంతో కేంద్ర ఎన్నికల సంఘం చాలా దశాబ్దాల కిందటే కోడ్‌ను రూపొందించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇందులో అనేక అంశాలను నూతనంగా చేరుస్తూ వచ్చారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికారులు, ప్రజలు ఎన్నికల సమయంలో ఏవిధంగా నడచుకోవాలో కోడ్ వివరిస్తుంది. దీనిని ఉల్లంఘిస్తే ఎదురయ్యే ఇబ్బందులను కూడా పేర్కొంటుంది. తద్వారా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఈ కోడ్.. కొండంత అండగా నిలుస్తుంది. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు నోడల్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్యను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృతికా శుక్లా నియమించారు. కోడ్ ఉల్లంఘించిన ఉద్యోగులపై కేసులు నమోదు చేయడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేసేదే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ కోడ్ అమలులో ఉంటుంది.
ఏం చేయవచ్చంటే..
● ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే క్షేత్ర స్థాయిలో వాస్తవంగా ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగించవచ్చు.
● వరదలు, కరువు, తెగుళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లోని ప్రజలకు ఉపశమనం, పునరావాస చర్యలు ప్రారంభించవచ్చు. కొనసాగించవచ్చు.
● ఎన్నికల సమావేశాల నిర్వహణకు మైదానాల వంటి బహిరంగ స్థలాలు, హెలిప్యాడ్‌లు అన్ని పార్టీలకు, అభ్యర్థులకు అందుబాటులో ఉండాలి.
● సభలు, సమావేశాలు, రోడ్లపై ర్యాలీల నిర్వహణకు స్థానిక పోలీసు అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. ఏదైనా సమావేశం జరిగే ప్రదేశంలో నిర్బంధ లేదా నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటే, వాటిని పూర్తిగా పరిగణనలోకి తీసుకుని, తగిన మినహాయింపులు, అనుమతులు పొందాలి.
● అభ్యర్థుల సభలకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య లౌడ్ స్పీకర్లు, ఇతర సౌకర్యాల వినియోగానికి పోలీసు లేదా సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాలి.
● సమావేశాలకు భంగం కలిగించే లేదా అశాంతి సృష్టించే వారితో వ్యవహరించేటప్పుడు పోలీసుల సహాయం పొందాలి.
● ఊరేగింపు, ర్యాలీ జరిగే సమయంలో సాధారణ ప్రజల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా ఉండాలి.
● ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి.
● పోలింగ్ శాంతియుతంగా, క్రమబద్ధంగా జరిగేందుకు అన్ని సమయాల్లోనూ ఎన్నికల అధికారులందరికీ సహకరించాలి.
● ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా బ్యాడ్జిలు లేదా గుర్తింపు కార్డులు ధరించాలి.
● ఓటర్లకు జారీ చేసిన గుర్తింపు స్లిప్పులు తెల్ల కాగితం పైనే ఉండాలి. సంబంధిత పార్టీ గుర్తు, అభ్యర్థి లేదా పార్టీ పేరు ఉండరాదు.
● ప్రచార సమయంలో, పోలింగ్ రోజున వాహనాల రాకపోకలపై నిబంధనల మేరకు పరిమితులు పాటించాలి.
●ఓటర్లు, అభ్యర్థులు, వారి ఎన్నికల, పోలింగ్ ఏజెంట్లు మినహా ఇతరులు పోలింగ్ బూత్‌లోనికి వెళ్లరాదు. సంబంధిత అధికారి సిఫారసు లేఖ ఉన్నవారిని మాత్రం అనుమతిస్తారు. ఈ షరతుల నుంచి ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ లేదా ఎమ్మెల్యే వంటి ఉన్నత స్థానంలో ఉన్న వారికి సైతం మినహాయింపు లేదు.
చేయకూడనివి
● కోడ్ అమలులోకి రాక ముందే వర్క్ ఆర్డర్లు జారీ చేసిన వాటికి సంబంధించి ఏ పనీ ప్రారంభించకూడదు.
● రోడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయం వంటి పనులకు మంత్రులు, ఇతర అధికారులు ఎటువంటి ఆర్థిక గ్రాంట్లు లేదా వాగ్దానాలు ప్రకటించకూడదు.
● మంత్రులు, ఇతర అధికారులు (సివిల్ సర్వెంట్లు తప్ప) కొత్త ప్రాజెక్టులు, పథకాలకు పునాది రాళ్లు వేయకూడదు.
● అధికార పార్టీ సాధించిన విజయాల గురించి ప్రభుత్వ ఖజానా ఖర్చుతో ప్రకటనలు ఇవ్వరాదు.
● మంత్రులు, అభ్యర్థులు ఓటు వేయడానికి తప్ప, ఏ పోలింగ్ స్టేషన్ లేదా కౌంటింగ్ ప్రదేశంలోకి ప్రవేశించకూడదు.
● ఎలాంటి అధికారిక పనిని ఎన్నికల ప్రచారంతో కలపకూడదు.
● ఓటర్లను ఎటువంటి ఆర్థికపరమైన ప్రలోభాలకు గురి చేయరాదు.
● వివిధ కులాలు, వర్గాలు, మత, భాషా సమూహాల మధ్య పరస్పర ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఎటువంటి కార్యాచరణకూ ప్రయత్నించకూడదు.
● ఇతర పార్టీల నాయకులు లేదా కార్యకర్తల వ్యక్తిగత జీవితంలోని ఏ అంశంపై విమర్శించరాదు.
● ఆలయాలు, ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు. ఈ ప్రదేశాల్లో ప్రచార పోస్టర్లు అతికించడం, సంగీతం ప్లే చేయడం నిషేధం.
● పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ఓటర్లను మభ్యపెట్టే చర్యలకు పాల్పడటం, బెదిరించడం, ప్రచారం చేయడం నిషేధించారు.
● పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహించరాదు. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల పరిసరాల్లో తిరగరాదు.
● అభ్యర్థులు, ఓటర్ల అభిప్రాయానికి, కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరి ఇంటి ముందు ప్రదర్శనలు లేదా పికెటింగ్ చేయరాదు.
● ఆయా యజమానుల అనుమతి లేకుండా వారి భూమి, భవనం, ప్రహరీ, వాహనాలను ఎవరూ ఉపయోగించరాదు. వారి ఇళ్లపై జెండా కర్రలు కట్టడం, బ్యానర్లు పెట్టడం, నోటీసులు అతికించడం, నినాదాలు రాయడం వంటివి చేయరాదు.
● మరో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న ప్రదేశాల వెంట ఊరేగింపులు చేపట్టకూడదు.
● ఊరేగింపుల్లో ఎటువంటి ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉండరాదు.
● పోలింగ్ రోజున ఓటర్ స్లిప్పుల పంపిణీ చేసే స్థలం లేదా పోలింగ్ స్టేషన్లకు 100 మీటర్ల పరిధిలో పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇతర ప్రచార సామగ్రిని ప్రదర్శించరాదు.
● సంబంధిత అధికారుల నుంచి ముందస్తుగా రాత పూర్వక అనుమతి లేకుండా వాహనాలపై అమర్చిన లౌడ్ స్పీకర్లను ఉదయం 6 గంటలకు ముందు, రాత్రి 10 గంటల తర్వాత ఉపయోగించకూడదు.
● రాత్రి 10 గంటలు దాటాక బహిరంగ సభలు, ఊరేగింపులు కొనసాగించడానికి అనుమతి ఉండదు.
● ఎన్నికల కోడ్ అమలు సమయంలో ఎక్కడా మద్యం పంపిణీ చేయరాదు.
● పోలింగ్ రోజున అధికారిక భద్రత కల్పించిన ఏ ఒక్కరూ తన భద్రతా సిబ్బందితో పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలోకి ప్రవేశించరాదు.
Comments
Please login to add a commentAdd a comment