రెండో స్థానంలో జనసేన పోటీపై కానరాని స్పష్టత
కోనసీమ జిల్లాలో రాజోలు మాత్రమే పోటీకి ఖరారు
అక్కడ కూడా తేలని అభ్యర్థి
పి.గన్నవరం ఆశిస్తున్న బీజేపీ
అదనంగా సీటు ఇచ్చేందుకు అంగీకరించని టీడీపీ
దీంతో జనసేనకు మిగిలేది ఒక్క స్థానమే
సాక్షి అమలాపురం: ‘ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలియాలి’ పవన్ కల్యాణ్ సినిమాలో చాలా పాపులర్ అయిన డైలాగ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ డైలాగ్ కొంచెం మార్పు చేసి సొంత పార్టీ వాళ్లే ట్రెండ్ చేస్తున్నారు. ‘ఎక్కడ తగ్గాలో తెలియడం కాదు.. ఎంత వరకు తగ్గాలో కూడా తెలియాలి’ అని వ్యంగ్యంగా పోస్టు చేస్తున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా కేవలం 24 అసెంబ్లీ సీట్లకు ఒప్పుకోవడం.. తరువాత వాటిని 21కి తగ్గించుకోవడం ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. ఆ తగ్గించుకున్న సీట్లు కూడా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కావడం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మింగుడుపడని అంశంగా మారింది.
29 శాతం ఓట్లు వచ్చినా..
త ఎన్నికల్లో జనసేన పార్టీకి చెప్పుకోదగిన ఓటింగ్ వచ్చింది కోనసీమ జిల్లా పరిధిలోనే. రాష్ట్రంలో ఆ పార్టీ గెలిచిన ఒక్క సీటూ ఈ జిల్లా పరిధిలోని రాజోలు కాగా, అన్ని నియోజకవర్గాలలోనూ కలిపి ఇక్కడ సుమారు 29 శాతం ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. రాజోలులో 50,053 ఓట్లు రాగా, ఆ తరువాత అమలాపురంలో 45,200, పి.గన్నవరంలో 36,259, ముమ్మిడివరం 33,334, మండపేట 35,173 చొప్పున ఓట్లు వచ్చాయి.
అటువంటి జిల్లాలో జనసేన కనీసం మూడుస్థానాలైనా కోరుతుందని పార్టీ వర్గాలు భావించాయి. గతంలో గెలిచిన రాజోలు నుంచి తిరిగి పోటీ చేయడంతోపాటు, జిల్లా కేంద్రమైన అమలాపురం, బీసీలకు ఇచ్చేందుకు ముమ్మిడివరం, రామచంద్రపురంలో ఒక నియోజకవర్గాన్ని కోరుతుందని క్యాడర్ బలంగా నమ్మింది. కాని ఎప్పుడైతే పవన్‌కల్యాణ్ తొలుత 24 సీట్లకు అంగీకరించారో అప్పుడే ఈ జిల్లాలో కేవలం రెండుస్థానాలు మాత్రమే వస్తాయనే అంచనాకు పార్టీ వచ్చింది. తీరా ఇప్పుడు పరిస్థితి చూస్తే కేవలం ఒక్క సీటుకే పరిమితమయ్యేటట్టు ఉంది.
అమలాపురం కూడా టీడీపీ ఖాతాలోకి..
టీడీపీ తొలి విడతలోనే కొత్తపేట, మండపేట, ముమ్మిడివరం అభ్యర్థులుగా బండారు సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు, దాట్ల సుబ్బరాజును అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మూడు జనరల్ స్థానాలు కాగా, ఎస్సీలకు రిజర్వ్ అయిన పి.గన్నవరంలో సరిపెళ్ల రాజేష్‌కుమార్ (మహాసేన రాజేష్)ను ఎంపిక చేశారు. రాజేష్ అభ్యర్థిత్వంపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఈ సీటు సందిగ్ధంలో పడింది. రెండవ దశలో రామచంద్రపురం సైతం టీడీపీ తీసుకుని ఇక్కడ నుంచి కొత్తగా పార్టీలో చేరిన వాసంశెట్టి సుభాష్‌ను ఎంపిక చేసింది. దీంతో టీడీపీ ఏకంగా ఐదు స్థానాలు ప్రకటించినట్టయ్యింది.
ఇక జనసేనకు మిగిలింది రాజోలు, అమలాపురం ఎస్సీ నియోజకవర్గాలు. దీనిలో రాజోలు నుంచి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమలాపురం మాత్రం ఎటూ తేలడం లేదు. ఇక్కడ నుంచి జనసేన పోటీ చేస్తోందనే ప్రచారం జరిగినా చివరకు దీనిని కూడా టీడీపీ లాగేసుకున్నట్టు తెలిసింది. అమలాపురం ఎంపీ సీటు ఆశిస్తున్న టీడీపీ నేత గంటి హరీష్‌ను ఇక్కడ నుంచి పోటీలో ఉంచుతారని టీడీపీ అధిష్టానం నుంచి సంకేతాలు అందుతున్నాయి. పి.గన్నవరం పొత్తులలో భాగంగా బీజేపీ కోరుకుంటోంది. దీంతో జనసేనకు మిగిలింది రాజోలు నియోజకవర్గం ఒక్కటే.
క్యాడర్‌లో నిరుత్సాహం
జోలు నుంచి జనసేన పోటీ చేస్తోందని పవన్ ప్రకటించి నెల రోజులు దాటింది. ఇంకా అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు దేవీ వరప్రసాద్, బొంతు రాజేశ్వరరావు ఇక్కడ నుంచి సీటు ఆశిస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ అభ్యర్థిని తేల్చకపోవడం పార్టీ క్యాడర్‌ను నిరుత్సాహానికి గురి చేస్తోంది. వైఎస్సార్ సీపీ రాజోలు నుంచి మంత్రి గొల్లపల్లి సూర్యారావును బరిలో నిలిపింది. ఇదే నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావును అమలాపురం లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేసింది.
దీంతో ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఫుల్ జోష్ మీద ఉంది. అటువంటి చోట కూడా అభ్యర్థిని ఎంపిక చేయకుండా పవన్ ఆలస్యం చేయడంతో క్యాడర్ నీరుగారిపోతోంది. ‘పొత్తులలో సీట్లు త్యాగం చేయడం కేవలం జనసేన మాత్రమేనా. టీడీపీ చేయదా? లేక అడిగే సత్తా మా నాయకునికి లేదో? తెలియడం లేదు’ అని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజోలుతోపాటు అమలాపురం స్థానాన్ని పొత్తులలో తీసుకోవాలని జనసేన క్యాడర్ కోరుతోంది. సోషల్ మీడియా వేదికగా తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment