గుంటూరు ఎడ్యుకేషన్: తెనాలి ఐతానగర్‌లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ మున్సిపల్ ఉన్నత పాఠశాల (ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్) ప్రధానోపాధ్యాయురాలితోపాటు ఏడుగురు ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోమవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాఠశాలను తనిఖీ చేసిన సమయంలో ఏడుగురు ఉపాధ్యాయులు సెలవులో ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో జరిగిన ఘటనపై డీఈఓ రేణుక తెనాలి ఎంఈవోతో విచారణ జరిపించారు. ఎంఈఓ నివేదిక ఆధారంగా మూకుమ్మడి సెలవులు పెట్టిన ఏడుగురు ఉపాధ్యాయులతోపాటు ఎఫ్ఏ–3 పరీక్షలు ఉన్నప్పటికీ అంతమంది ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేసిన హెచ్ఎంకూ సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశారు. దీనిపై సంబంధిత హెచ్ఎం, ఉపాధ్యాయులు రెండు రోజుల్లో వివరణ ఇచ్చిన తరువాత నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని డీఈఓ రేణుక తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment