జీవితానికి భరోసానిచ్చే ట్రాఫిక్ సిగ్నల్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ జీవితానికి భరోసానిచ్చే గ్రీన్ సిగ్నల్ అని, హెల్మెట్ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే కిరీటమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అభివర్ణించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాలులో జరిగిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు–2025 కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మహ్మద్ నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో పెమ్మసాని మాట్లాడుతూ ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని కోరారు. కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్టు పెట్టుకోవడం వల్ల 90 శాతం రక్షణ ఉంటుందని వివరించారు.
ఫిబ్రవరి 15 వరకు మాసోత్సవాలు
కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మాట్లాడుతూ రహదారి భద్రత నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు సర్కారు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. యువత లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతున్నారని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని పేర్కొన్నారు. జిల్లాలో గత ఏడాది 607 రోడ్డు ప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం యువత, విద్యార్థులతో రహదారి భద్రత నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీని కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డీఆర్వో ఖాజావలి, జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి, గుంటూరు ఆర్టీఓ సత్యనారాయణ ప్రసాద్, తెనాలి ఆర్టీఓ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Comments
Please login to add a commentAdd a comment