‘గీత’ గోవిందా
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గీత కులాలకు కేటాయించిన మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు పచ్చబినామీలు కుయుక్తులు పన్నుతున్నారు. గీత కార్మికులతో దరఖాస్తు చేయించి లైసెన్స్ ఫీజు చెల్లించి తాము నిర్వహించుకునేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధుల వద్ద వాలిపోయారు. పైరవీలు నెరుపుతున్నారు. కూటమి నేతలే దుకాణాలన్నీ దక్కించుకునేలా పావులు కదుపుతున్నారు. జిల్లాలో గీత కార్మిక కులాలకు 13 మద్యం దుకాణాలు కేటాయిస్తూ ఈనెల 27న సర్కారు గెజిట్ విడుదల చేసింది. గౌడ కులానికి 9 షాపులు, గౌడ్ కులానికి 4 షాపులు కేటాయించారు. వాస్తవానికి ఇవి రెండు కులాలు కాదు. ఒకటే కులం. అవగాహన రాహిత్యంతో అధికారులు రెండుగా చూపారు. ఈ షాపులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ 27 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఉంటుందని గెజిట్‌లో పేర్కొన్నారు.
లైసెన్స్ ఫీజుపై కోర్టుకు!
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. గత ఏడాది అక్టోబర్ 16 నుంచి షాపుల నిర్వహణకు అనుమతిచ్చింది. 10వేలలోపు జనాభా ఉంటే రూ.50లక్షలు, 50వేల జనాభాలోపు ఉంటే రూ.55లక్షలు, 5లక్షల జనాభాలోపు రూ.65లక్షలు, 5 లక్షల జనాభా దాటితే రూ.85 లక్షలు లైసెన్స్ ఫీజుగా వసూలు చేసింది. ఇప్పుడు గీత కార్మికులకు సగం మాత్రమే లైసెన్స్ ఫీజుగా నిర్ధారించడంపై గతంలో మద్యం షాపులు పొందిన లైసెన్సీలు గుర్రుగా ఉన్నారు. ఇది సరికాదని పేర్కొంటున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. వాస్తవానికి మద్యం షాపుల గడువును 2024 అక్టోబర్ నుంచి 2026 సెప్టెంబర్ నెలాఖరు వరకు సర్కారు విధించింది. ఇప్పుడు గీత కార్మికులకు ఫిబ్రవరిలో షాపులు హ్యాండోవర్ చేసినా ఐదు నెలల గడువు పూర్తయిపోవడంతో లైసెన్స్ ఫీజు మరికొంత తగ్గించేందుకు సర్కారు సిద్ధమైంది. దీనిని బట్టి చూస్తే గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని షాపునకు లైసెన్సీ రూ.42.50లక్షలు చెల్లిస్తే సరిపోతుంది.
గీత కార్మికుల మద్యం షాపులు దక్కించుకునేందుకు ‘పచ్చ’ బినామీల కుయుక్తులు జిల్లాలోని గీత కులాలకు 13 మద్యం షాపులు గౌడకు 9, గౌడ్‌కు 4 దుకాణాలు కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వాస్తవానికి ఇవి రెండూ ఒకే కులం.. అవగాహన రాహిత్యంతో రెండుగా చూపిన అధికారులు సగానికి తగ్గనున్న లైసెన్స్ ఫీజు
కేటాయించిన ప్రాంతాలు లైసెన్స్ ఫీజు(రూ.లలో)
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌్ 1(గౌడ) 46,75,000
కాకుమాను 1(గౌడ) 30,25,000
కొల్లిపర 1(గౌడ్) 35,75,000
మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ 1(గౌడ) 35,75,000
మేడికొండూరు 1(గౌడ) 35,75,000
పెదకాకాని 1 (గౌడ) 35,75,000
పెదనందిపాడు 1(గౌడ్) 30,25,000
ఫిరంగిపురం 1(గౌడ) 35,75,000
పొన్నూరు 1(గౌడ) 35,75,000
ప్రత్తిపాడు 1(గౌడ) 30,25,000
తెనాలి 1(గౌడ్) 35,75,000
తుళ్లూరు 1(గౌడ్) 35,75,000
వట్టిచెరుకూరు 1(గౌడ) 30,25,000
Comments
Please login to add a commentAdd a comment