ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు
గుంటూరు ఎడ్యుకేషన్: శాసన మండలి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 29న పదవీ కాలం ముగియనుండటంతో ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించిన ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా తూర్పు–పశ్చిమ గోదావరి, కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలతోపాటు శ్రీకాకుళం–విజయనగరం–విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేఎస్ లక్ష్మణరావు పదవీ కాలం మార్చి 29న ముగియనుండగా, మార్చి 8వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.
ఎన్నికల ప్రక్రియ ఇలా
ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్న కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుంది. 11న నామినేషన్ల స్క్రూటినీ అనంతరం, ఉపసంహరణకు 13 వరకు అవకాశం ఉంటుంది. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి చేస్తారు. మార్చి 8వ తేదీ నాటికి మొత్తం ప్రక్రియ ముగుస్తుంది. కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి రెండు జిల్లాల పరిధిలో 3.46 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న కేఎస్ లక్ష్మణరావు మరోసారి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్తోపాటు మరి కొందరు స్వతంత్ర అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు.
షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేనెల 3న నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ మార్చి 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికలు రెండు జిల్లాల్లో 3.46 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు
Comments
Please login to add a commentAdd a comment