పోలీస్‌ శాఖకు నైపుణ్యాభివృద్ధి అవసరం | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ శాఖకు నైపుణ్యాభివృద్ధి అవసరం

Published Thu, Jan 30 2025 2:03 AM | Last Updated on Thu, Jan 30 2025 2:03 AM

పోలీస్‌ శాఖకు నైపుణ్యాభివృద్ధి అవసరం

పోలీస్‌ శాఖకు నైపుణ్యాభివృద్ధి అవసరం

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పోలీసు శాఖలోనూ నైపుణ్యాభివృద్ధి అవసరమని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి చెప్పారు. గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని ఉమేష్‌చంద్ర భవనంలో కొత్తగా ఏర్పాటుచేసిన ‘మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ – హెచ్‌ఆర్‌డీ సెంటర్‌)ను బుధవారం గుంటూరు రేంజ్‌ ఐజీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పోలీస్‌ సిబ్బందిలో నైపుణ్యాన్ని పెంచేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంపై మెలకువలు, ఇంగ్లిష్‌ భాషపై పట్టు పెంచుకోవచ్చని వివరించారు. పోలీస్‌స్టేషన్లల్లో పని సామర్థ్యాన్ని పెంచేందుకు ఎస్పీ సతీష్‌కుమార్‌ చేసిన ప్రణాళిక ప్రశంసనీయమని కొనియాడారు. ఈ వినూత్నమైన ఆలోచన మంచి ఫలితాలను ఇస్తుందని వెల్లడించారు.

పోలీసు సిబ్బందికి శిక్షణ తరగతులు

ఎస్పీ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా జిల్లా పోలీస్‌ విభాగంలోని సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం, ఇంగ్లిష్‌ భాషపై శిక్షణ తగతులు ఉంటాయని వివరించారు. అందరూ నైపుణ్యం సాధించేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ప్రస్తుతం 30 కంప్యూటర్లతో శిక్షణ ప్రారంభించినట్లు వెల్లడించారు. కేసు చార్జ్‌షీట్‌ తయారుకు అవసరమైన కంప్యూటర్‌ టైపింగ్‌, ఇంగ్లిషు పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. చట్టాలపైనా అవగాహన కల్పిస్తామని, కోర్టు మానిటరింగ్‌ సిస్టమ్స్‌ ద్వారా కోర్టుల్లో కేసుల విచారణకు సంబంధించిన మెలకువలను నేర్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఎస్పీలు తుషార్‌ డూడీ, కంచి శ్రీనివాసరావు, కృష్ణకాంత్‌, దామోదర్‌, పలు జిల్లాల పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గుంటూరు రేంజ్‌

ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement