20ఫ్లస్‌.. అయితే ఆరోగ్యం జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

20ఫ్లస్‌.. అయితే ఆరోగ్యం జాగ్రత్త

Published Thu, Jan 30 2025 2:02 AM | Last Updated on Thu, Jan 30 2025 8:20 AM

-

జిల్లాలో కొత్తగా 1,431 మందికి అధిక రక్తపోటు నిర్ధారణ

కొత్తగా షుగర్‌ బాధితులు 1,552 మంది

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు 
    
ఎన్‌సీడీ 3.0 సర్వే

గుంటూరు మెడికల్‌ : ఆధునిక జీవన శైలి యువత రోగాల బారిన పడేస్తోంది. వ్యాధులు నిరీ్ణత వయస్సు కంటే ముందస్తుగానే దాడిచేస్తున్నాయి. వాతావరణ కాలుష్యంతోపాటుగా ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా భావిస్తున్నారు. చిన్న వయస్సులోనే వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రజలు వ్యాధుల బారినపడకుండా కొద్దిపాటి అవగాహన కలిగిఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. 

ఎన్‌సీడీ 3.0 సర్వేలో వెలుగులోకి... 
జిల్లాలో నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌(ఎన్‌సీడీ) 3.0 కార్యక్రమాన్ని 2024 నవంబర్‌ 14 ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా   జిల్లా వ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారికి వైద్య సిబ్బంది ఇళ్ల వద్దకే వెళ్లి బీపీ, షుగర్, క్యాన్సర్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు.  

గత ఏడాదితో పోలిస్తే.. 
గత ఏడాది జరిగిన ఎన్‌సీడీ కార్యక్రమంలో జిల్లాలో 8,859 మంది కొత్తగా అధిక రక్తపోటు బారిన పడగా 5,932 మంది షుగర్‌ వ్యాధి బారిన పడ్డారు.  కొత్తగా వ్యాధి బారిన వారే కాకుండా జిల్లాలో 14,688 మంది అధికరక్తపోటు బాధితులు, 12,690 మంది షుగర్‌ వ్యాధి బాధితులు చికిత్స తీసుకుంటున్నట్లు సర్వేలో నిర్ధారించారు. ఎక్కువ సంఖ్యలో షుగర్, బీపీ బాధితులు సర్వేలో నమోదు అవ్వటంతో జిల్లా వైద్యాధికారులు, వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేసి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు, వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఆయా గ్రామాల్లో సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది గ్రామీణులకు వివరించి వ్యాధి బాధితులకు మెరుగైన వైద్య సేవల కోసం  ఆరోగ్య కేంద్రాలకు రిఫర్‌ చేశారు.  

జిల్లాలో 18 ఏళ్లు 
దాటిన వారు -     17,19,054  
స్క్రీనింగ్‌ పరీక్షలు -   2,22,010  
బీపీ నిర్ధారణ -   1,431  
షుగర్‌ -  1,552  

హైరిస్క్‌వారు జాగ్రత్తగా ఉండాలి... 
బీపీ, షుగర్‌ ఉన్నవాళ్ళు హైరిస్క్‌ గ్రూప్‌కు చెందిన వారు. వీరి కిడ్నీ జబ్బుల బారిన పడే అవకాశం చాలా ఎక్కవ. షుగర్‌ వచ్చిన ఏడు నుంచి పదేళ్లలో కిడ్నీలు పాడవుతాయి. ఊబకాయం(అధికబరువు) ఉన్నవారు కిడ్నీ జబ్బున పడే ప్రమాదం ఉంది. జీనవశైలిలో వచ్చిన మార్పుల వల్ల ప్రస్తుతం 20 ఏళ్లు దాటిన ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ జబ్బు బారిన పడుతున్నారు. బీపీ, షుగర్‌ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. వయస్సు మీద పడేకొద్ది సహజంగా మూత్ర సంబంధిత సమస్యలు వస్తాయి. వాటిని సకాలంలో గుర్తించకపోతే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. 
–డాక్టర్‌ చింతా రామకృష్ణ, సీనియర్‌ నెఫ్రాలజిస్ట్, గుంటూరు.  

జాగ్రత్తలు తీసుకుంటే షుగర్‌ అదుపు  
షుగర్‌ వ్యాధి ఉందా లేదా అని ముందస్తుగా తెలుసుకోవటానికి హెచ్‌బీఏ1సీ పరీక్ష చేయించుకుంటే తెలుస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఏమీ తినకుండా, తాగకుండా షుగర్‌ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించినప్పుడు రక్తంలో షుగర్‌ 100లోపు ఉంటే షుగర్‌ వ్యాధి లేనట్లే. షుగర్‌ 100 నుంచి 126లోపు ఉంటే ప్రీ డయాబెటిక్‌ దశలో ఉన్నట్లు లెక్క. అంటే ఇప్పుడే షుగర్‌ వ్యాధి  శరీరంలోకి ప్రవేశించటానికి సిద్ధమవుతుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే షుగర్‌ వ్యాధి సోకదు. కుటుంబంలో ఒకరికి ఉంటే ఇతర కుటుంబ సభ్యులు ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకోవటం ద్వారా వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు. 
–డాక్టర్‌ కోగంటి కళ్యాణ్‌చక్రవరి, ఇన్‌ఫెక్షన్స్‌ స్పెషలిస్ట్, గుంటూరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement