
‘ఎల్‌సీ’కి సాంకేతికత జోడింపు
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు మెరుగై న, నాణ్యమైన సేవలందించేందుకు టీజీ ఎన్పీడీసీ ఎల్ ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తోంది. ఈక్రమంలో లైన్ క్లియరెన్స్(ఎల్‌సీ) మరింత బాధ్యతగా, సులభంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఫోన్‌కాల్ ద్వారా ఎల్‌సీ తీసుకోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యుత్ ప్రమాదాలతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఎల్‌సీ(ఫీడర్లలో విద్యుత్ సరఫ రా నిలిపివేత, పునరుద్ధరణ) తీసుకోవడానికి ప్రత్యే క యాప్‌ను ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఇప్పటి వరకు ఎల్‌సీ తీసుకుంటే తీసుకు న్న ఉద్యోగికి, సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు మాత్రమే తెలిసేది. ఈయాప్ ద్వారా ఏఈ, ఏడీఈ, డీఈలు కూడా తెలుసుకునే వీలు కలగడంతోపాటు పర్యవేక్షణ పెరుగుతుంది. ఫీడర్ల ఎంపికలోనూ కచ్చితత్వం ఉంటుంది.
పొరపాట్లకు తావులేకుండా..
ఎల్‌సీ(లైన్ క్లియర్) తీసుకోవాలనుకున్న లైన్‌మెన్ యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఫీడర్‌లో ఎల్సీ కావాలని సంబంధిత ఏఈకి విన్నవించుంటే అతను పరిశీలించి ఆ ఫీడర్‌లో ఎల్సీ ఇవ్వొచ్చా లేదా? అత్యవసరాలు ఏమైనా ఉన్నాయా.. అప్పటికే షెడ్యూల్ చేయబడిన పనులు ఉన్నాయా.. మరే ఇతర షెడ్యూల్ చేసిన పనులు ఉన్నాయా? అని పరిశీలిస్తాడు. ఏఈ నిర్ణయం మేరకు ఎల్సీ అనుమతి ఆధారపడి ఉంటుంది. ఎల్‌సీకి అనుమతిస్తే లైన్‌మెన్, సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు యాప్ ద్వారా సమాచారం అందుతుంది. దీని ఆధారంగా సబ్ స్టేషన్ యాప్‌లో నిర్దిష్టంగా పేర్కొన్న ఫీడర్‌లో ఎల్‌సీ ఇస్తారు. దీని ద్వారా పొరపాటు జరగుకుండా ఉంటుంది.
సూచనలిస్తూ..
పొరపాట్లను నివారించేందుకు తగు సూచనల్ని యాప్ ఇస్తుంది. హెల్మెట్ ధరించాలని, హ్యాండ్ గ్లౌజ్‌లు వేసుకోవాలని, ఎర్త్ రాడ్ వాడాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా? లేదా అనే జాగ్రత్తలను యాప్ గుర్తు చేస్తుంది. ఎక్కడైనా డబుల్ ఫీడింగ్ ఉందా? ఈ ఫీడర్‌కు వేరే ఫీడర్‌తో అనుసంధానం ఉందా? వంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. దీని ద్వారా జాగ్రత్త పడుతూ ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. డబుల్ ఫీడరింగ్ ఉంటే రెండు ఫీడర్లలో ఎల్‌సీ తీసుకోవడమా? లేదా ఇతరత్రా జాగ్రత్తలు తీసుకువచ్చా? అని బేరీజు వేసుకుని పనులు చక్కదిద్దుతారు. ఎల్సీ తీసుకున్న ఫీడర్‌లో పనులు పూర్తి కాగానే యాప్‌లో ఆ సమాచారాన్ని లైన్‌మెన్ పొందుపర్చి విద్యుత్ సరఫరలా పునరుద్ధరించవచ్చనే సంకేతాన్ని, సమాచారాన్ని యాప్ ద్వారా చేరవేస్తారు. దీన్ని సంబంధిత సెక్షన్ ఏఈ పరిశీలించి సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు చేరవేస్తారు. దీంతో ఎల్సీ తీసుకున్న ఫీడర్‌లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు.
భద్రతా ప్రమాణాలు
పెంచడానికి యాప్..
విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా భద్రతా ప్రమాణాలను పెంచడానికి ప్రత్యేకంగా ఎల్సీ యాప్‌ను టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఎల్‌సీ యాప్ ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాలు, మానవ తప్పిదాలను అరికట్టవచ్చు. విద్యుత్ ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు.
– పి.మధుసూదన్‌రావు,
ఎస్‌ఈ, హనుమకొండ
ఆన్‌లైన్‌లో సులభంగా విద్యుత్ లైన్ క్లియరెన్స్
నూతన యాప్ రూపొందించిన
టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం
అధికారులు, ఉద్యోగులకు శిక్షణ

‘ఎల్‌సీ’కి సాంకేతికత జోడింపు