
ఆగుతూ..
సాగుతూ..
సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్‌లో స్మార్ట్‌సిటి మిషన్(ఎస్‌సీఎం) లక్ష్యం నెరవేరలేదు. తొమ్మిదేళ్లలో 60.51 శాతం పనులే పూర్తయ్యాయి. సుమారు రూ.436 కోట్ల విలువైన 47 పనులు ఇంకా ఆన్‌గోయింగ్‌లోనే ఉన్నాయి. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, ఆర్థిక వృద్ధిని పెంచడం.. తద్వారా సుందరనగరాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో కేంద్రం 2015 జూన్‌లో దేశ వ్యాప్తంగా 100 నగరాలను ఎస్‌సీఎం కింద ఎంపిక చేసింది. రెండో విడతలో 2016 మే నెలలో తెలంగాణ నుంచి గ్రేటర్ వరంగల్‌తో పాటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను చేర్చారు. వరంగల్‌లో స్మార్ట్‌సిటీ కింద మొత్తం 119 ప్రాజెక్టులకు రూ.1,800 కోట్లు కేటాయించింది. పదేళ్ల పాటు కొనసాగిన ఈ పథకం గత నెల 31వ తేదీతో ముగియగా.. రూ.1,364 కోట్లు ఖర్చు చేసి 72 ప్రాజెక్టులు పూర్తి చేశారు.
అదిగో.. ఇదిగో అంటూ..
2016 మే నెలలో స్మార్ట్‌సిటీ నగరాల జాబితాలో ఎంపికయ్యాక 119 ప్రాజెక్టులకు రూ.2,106 కోట్లతో డీపీఆర్‌లు పంపించగా రూ.1,800 కోట్లకు పరిపాలన ఆమోదం లభించింది. అయితే 2019 వరకు 20 పనులకు సంబంధించిన రూ.23.09 కోట్ల పనులే జరిగాయి. అందులో పెద్దమ్మగడ్డ–కేయూ 100 ఫీట్ల రోడ్డు, ఉర్సుగుట్ట–నాయుడు పంపు, పోతనరోడ్డు, హనుమకొండ అదాలత్ సెంటర్–హంటర్‌రోడ్డు మీదుగా వరంగల్ అండర్‌బ్రిడ్జి వరకు సెంట్రల్ లైటింగ్ తదతర పనులు ఉన్నాయి. 2019లో మొదలైన నాలుగు స్మార్ట్‌రోడ్లలో హనుమకొండ కాపువాడ, పద్మాక్షిగుట్ట రోడ్డు పనులు, రూ.82.50 కోట్లతో వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 11 స్మార్ట్ రోడ్లు, రూ.20.54 కోట్లతో నాలుగు స్వాగత ద్వారాలు, కూడళ్ల అభివృద్ధి, రూ.72.50 కోట్లతో వరంగల్ భద్రకాళి బండ్ రెండో దశ, రూ.12.50 కోట్లతో హనుమకొండ వడ్డేపల్లి బండ్, స్మార్ట్‌రోడ్లు.. తదితర పనులు ఆగుతూ.. సాగాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను స్మార్ట్‌గా తీర్చిదిద్దడం, కాకతీయ జూపార్కులో ఆధునికీకరణ పనులు, భారీ సోలార్ పార్కు, సోలార్ పీవీ కెనాల్ బ్యాంకు, కాజీపేటలోని బంధం చెరువు సుందరీకరణ, దేశాయిపేట చిన్నవడ్డేపల్లి సుందరీకరణ, హనుమకొండ చౌరస్తాలో జంక్షన్ ప్లాజా, హనుమకొండ, వరంగల్ ఆర్టీసీ బస్ టెర్మినల్, 150 ఎంఎల్‌డీల సివరేజీ ప్లాంటు, పర్యాటక కేంద్రంగా ఉర్సుగుట్ట, కేఎంజీ గార్డెన్ నాలా ఆధునికీకరణ, భద్రకాళి చెరువు ప్రక్షాళన, స్మార్ట్‌వాటర్ మీటర్లు, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, వరంగల్ మహానగరంలోని ప్రధాన కూడళ్లలో ఉచిత వైఫై కేంద్రాలు.. తదితర ప్రాజెక్టులు స్మార్ట్‌సిటీ డీపీఆర్‌లో ఉన్నాయి.
ఆన్‌గోయింగ్‌లో అతి ముఖ్యమైన పనులు
స్మార్ట్‌సిటీలో భాగంగా చేపట్టే పనుల వ్యయంతో కేంద్రం వాటా 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం, ఆయా మున్సిపల్ కార్పొరేషన్ వాటా 25శాతం భరించాల్సి ఉంటుంది. కార్పొరేషన్ వాటా కలిపి 50 శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చింది. వాస్తవానికి స్మార్ట్‌సిటీ పథకం గడువు 2024 జూన్ 30న ముగియాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు 2025 మార్చి 31 వరకు పొడిగించారు. ఈసమయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు విడుదల చేసి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. తొమ్మిది నెలలు పొడిగించినా.. గ్రేటర్ వరంగల్ స్మార్ట్‌సిటీ పనుల్లో పురోగతి లేకపోగా రూ.436 కోట్ల వ్యయం అయ్యే 47 పనులు(39.49 శాతం) అసంపూర్తిగా ఉన్నాయి. ఇందులో ఆధునిక సాంకేతికతతో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్, భద్రకాళి బండ్ రెండోదశ సుందరీకరణ, వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, బయోమైనింగ్, ప్రధాన రహదారుల అభివృద్ధి, ఎస్‌టీపీ, నగరం నలువైపులా జాతీయ రహదారులపై గ్రాండ్ ఎంట్రెన్స్ తదితర అతి ముఖ్యమైన పనులు ఉన్నాయి. కాగా స్మార్ట్‌సిటీ గడువు ముగిసినా.. ఆన్‌గోయింగ్ పనులకు చెల్లింపులు ఉంటాయని అధికారులు చెబుతుండగా.. వేగం పెంచితేనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
నత్తనడకన ‘స్మార్ట్‌సిటీ మిషన్’
119 ప్రాజెక్టులకు రూ.1800 కోట్లు
పది సంవత్సరాల్లో ఖర్చు చేసింది రూ.1,364 కోట్లు
పెండింగ్‌లో రూ.436 కోట్ల విలువైన 47 పనులు
గత నెల 31వ తేదీతో ముగిసిన స్మార్ట్‌సిటీ గడువు
పొడిగించే అవకాశం లేదన్న కేంద్రం.. త్వరపడితేనే నూరుశాతం

ఆగుతూ..

ఆగుతూ..

ఆగుతూ..

ఆగుతూ..