హైదరాబాద్: జిమ్‌లో వ్యాయామం చేసి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ సెల్లార్‌లో ఉన్న బైక్ తీసుకునేందుకు వచ్చిన ఓ యువకుడి కళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు పెప్పర్ స్ప్రే కొట్టి కత్తులతో పొడిచి చంపిన ఘటన మంగళవారం సాయంత్రం రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెలబ్రిటీ జిమ్ సెల్లార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడ అలీజీపూర్ ప్రాంతానికి చెందిన రాహుల్‌సింగ్ (26) ప్రతిరోజూ ద్విచక్ర వాహనంపై సెలబ్రిటీ జిమ్‌లో వ్యాయామం కోసం వస్తుంటాడు. మంగళవారం సాయంత్రం జిమ్‌కు వచ్చి వ్యాయామం పూర్తి చేశాడు.
అనంతరం ఫోన్‌లో మాట్లాడుతూ సెల్లార్ పార్కింగ్‌లో ఉన్న బైక్‌ను తీసుకునేందుకు కిందకు వచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న నలుగురు యువకులు రాహుల్‌సింగ్ కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి.. కత్తులు, పంచ్‌లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ రాహుల్‌సింగ్ కుప్పకూలిపోయాడు. ఈ ఘటన చూసి అడ్డుకునేందుకు వెళ్లిన సెక్యూరిటీ గార్డుకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న రాహుల్ సింగ్‌ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అతడు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. దాడి చేసిన యువకులు అనంతరం ద్విచక్ర వాహనాలపై పారిపోయినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దాడికి సంబంధించిన పూర్తి దృశ్యాలు సెల్లార్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు కత్తులు, పెప్పర్ స్ప్రే బాటిల్, ఒక పంచ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలాన్ని రాజేంద్రనగర్ డివిజన్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులను విచారిస్తే హత్యకు గల కారణాలు తెలుస్తాయని డీసీపీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment