Shamshabad Airport: సారీ.. ఎయిర్‌పోర్టుకు రాలేం | Hyderabad Cab Drivers Launch 'Low Fare, No Air' Campaign - Sakshi
Sakshi News home page

Shamshabad Airport: క్యాబ్‌వాలాల ‘లోఫేర్‌..నో ఎయిర్‌’ మూవ్‌మెంట్‌

Published Tue, Sep 5 2023 6:44 AM | Last Updated on Tue, Sep 5 2023 10:51 AM

- - Sakshi

హైదరాబాద్: క్యాబ్‌వాలాలు సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు క్యాబ్‌ సేవలను నిలిపివేస్తూ ‘లో ఫేర్‌..నో ఎయిర్‌’ ప్రచారం చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి నడిపే క్యాబ్‌డ్రైవర్లకు సరైన ఆదాయం లభించకపోవడమే ఇందుకు కారణం. దీంతో సకాలంలో క్యాబ్‌లు లభించక.. ఒకవేళ సర్వీసులు బుక్‌ అయినప్పటికీ డ్రైవర్లు నిరాకరించడం వల్ల ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో క్యాబ్‌లు లభించక గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 65 వేల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఆర్టీసీ పుష్పక్‌ బస్సులు, ప్రీపెయిడ్‌ ట్యాక్సీలు, సొంత వాహనాలు మినహాయించి మరో 5 వేల క్యాబ్‌లు ఇటీవల వరకు ఎయిర్‌పోర్టుకు అందుబాటులో ఉండేవి. కానీ కొంతకాలంగా ఎయిర్‌పోర్టు నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికి వెళ్లినా తమకు రూ.500 నుంచి రూ.700 వరకు మాత్రమే లభిస్తున్నాయని. దీంతో ఇంధన ఖర్చులు కూడా రావడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పైగా ఓలా, ఉబెర్‌ సంస్థలు డ్రైవర్ల నుంచి 30 శాతం వరకు కమిషన్‌ తీసుకుంటున్నాయి. ఇది మరింత భారంగా మారిందని తెలంగాణ గ్రిగ్‌ అండ్‌ ట్యాక్సీ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌ తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రీపెయిడ్‌ ట్యాక్సీలకు ఒక ట్రిప్పుపైన రూ.980 నుంచి రూ.1150 వరకు లభిస్తుండగా తమకు మాత్రం అతి తక్కువ ఆదాయం లభిస్తుందన్నారు.

దీంతో ఎయిర్‌పోర్టుకు క్యాబ్‌లు నడిపేందుకు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. ప్రీపెయిడ్‌ ట్యాక్సీల తరహాలో ఎయిర్‌పోర్టుకు నడిచే క్యాబ్‌లకు ప్రతి కిలోమీటర్‌కు రూ.21 చొప్పున ఇవ్వాలని, అగ్రిగేటర్‌ సంస్థలకు ఇచ్చే కమిషన్‌ను 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని క్యాబ్‌ డ్రైవర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement