మౌనంగా ఉండటమా.. లేక బరిలో దిగడమా.. ముంతాజ్‌ ఖాన్‌ దారెటు? | - | Sakshi
Sakshi News home page

మౌనంగా ఉండటమా.. లేక బరిలో దిగడమా.. ముంతాజ్‌ ఖాన్‌ దారెటు?

Published Sat, Nov 4 2023 4:36 AM | Last Updated on Sat, Nov 4 2023 9:42 AM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు మజ్లిస్‌ (ఎంఐఎం) పార్టీ ప్రకటించింది. నగరంలోని పాత బస్తీలోని ఏడు సిట్టింగ్‌ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్‌, రాజేంద్రనగర్‌ స్థానాల్లో సైతం బరిలో దిగనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం దారుస్సలాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తొలి జాబితాలో ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

చాంద్రాయణగుట్ట స్థానానికి అక్బరుద్దీన్‌ ఒవైసీ, మలక్‌పేట స్థానానికి అహ్మద్‌ బలాల, కార్వాన్‌కు కౌసర్‌ మోహియుద్దీన్‌, నాంపల్లికి మాజీద్‌ హుస్సేన్‌, చార్మినార్‌కు జుల్ఫీకర్‌, యాకుత్‌పురాకు జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌ అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. త్వరలో బహదూర్‌పురా, జూబ్లీహిల్స్‌, రాజేంద్రనగర్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని అసదుద్దీన్‌ ఒవైసీ వెల్లడించారు. మజ్లిస్‌ పోటీ చేయని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతు ఇస్తామన్నారు.

ఉద్దండులకు మొండిచేయి..
రాజకీయ ఉద్దండులు, ఇద్దరు సీనియర్‌ ఎమ్మెల్యేలకు మజ్లిస్‌ పార్టీ మొండిచేయి చూపించింది. చార్మినార్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ ఖాన్‌, యాకుత్‌పురా సిట్టింగ్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ పాషా ఖాద్రీలకు సీటు కేటాయించ లేదు. నాంపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌ అభ్యర్థిత్వం యాకుత్‌పురా స్థానానికి మారింది. ఈసారి కొత్తగా ఇద్దరు మాజీ మేయర్లకు అవకాశశం లభించింది.

నాంపల్లి సిట్టింగ్‌ స్థానానికి మాజీ మేయర్‌ మాజీద్‌ హుస్సేన్‌కు, చార్మినార్‌ సిట్టింగ్‌ స్థానాన్ని జుల్ఫీకర్‌లకు కేటాయించారు. 2018 ఎన్నికల తర్వాత తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఇద్దరు సీనియర్‌ ఎమ్మెల్యేలకు ఎన్నికల బరి నుంచి తప్పించి పార్టీలో వారి సేవలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పార్టీ అధినేత అసదుద్దీన్‌ ప్రకటించారు.

కొత్తగా జూబ్లీహిల్‌లో..
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పక్షాన భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ బరిలో దిగుతుండగా.. ఏఐఎంఐఎం కూడా పోటీ చేస్తామని ప్రకటించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. ఈసారి పోటీ నిర్ణయం వెనుక మతలబు అర్థం కాని పరిస్థితి నెలకొంది. అత్యంత సంపన్నలున్న ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మజ్లిస్‌ గతంలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది.

2014 ఎన్నికల్లో మజ్లిస్‌ తరఫున రంగంలో దిగిన నవీన్‌ యాదవ్‌ టీడీపీ అభ్యర్థి మాగంటికి ఢీ అంటే ఢీ అనేంతలా పోటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో మజ్లిస్‌ పోటీకి దూరం పాటించి అప్పటి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటికి మద్దతు ఇచ్చింది. అయినప్పటికీ నవీన్‌ యాదవ్‌ ఇండిపెండెంట్‌గా బరిలో దిగి గట్టి పోటీ ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు. ఈసారి తిరిగి మిత్ర పక్షమైన బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానంలో పోటీకి దిగడం ఆసక్తి రేపుతోంది.

డబుల్‌ హ్యాట్రిక్‌..
'ఓటమి ఎరగని నేతగా యాకుత్‌పురా నుంచి ఐదుసార్లు, చార్మినార్‌ నుంచి ఒకసారి వరుసగా విజయంసాధించి డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టిన అనంతరం ముంతాజ్‌ ఖాన్‌కు టికెట్‌ దక్కకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థంగా మారింది. పార్టీ అధిష్టానం ప్రతిపాదన మేరకు రిటైర్మెంట్‌కు సిద్ధమంటూనే తన కొడుకుకు టికెట్‌ ఇవ్వాలని మెలికపెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఏకంగా టికెట్‌ ఇవ్వకున్నా బరిలో దిగుతానని అల్టిమేటం ఇవ్వడంతో పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ రంగంలో దిగినట్లు తెలుస్తోంది.

మరోవైపు కాంగ్రెస్‌, ఎంబీటీలు సంప్రదింపులు చేస్తూ పార్టీ పక్షాన రెండు సీట్ల బంపర్‌ ఆఫర్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా చార్మినార్‌ అసెంబ్లీ స్థానానికి మాజీ మేయర్‌ జుల్ఫీకర్‌ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పార్టీ నిర్ణయం మేరకు మౌనంగా ఉండటమా? లేక బరిలో దిగడమా? ముంతాజ్‌ ఖాన్‌ ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ తిరుగుబాటు బావుటా ఎగరవేస్తే మాత్రం పాతబస్తీ రాజకీయాల్లో సంచలన మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ చార్మినార్‌ అసెంబ్లీ స్థానంపై దృష్టి సారించింది. ఇంకా అభ్యర్థి ప్రకటించలేదు.
ఇవి చదవండి: అందోల్‌ కోటలో గెలుపెవరిది..? తీవ్రంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement