ఈ నగరానికి ఏమైంది? | - | Sakshi
Sakshi News home page

ఈ నగరానికి ఏమైంది?

Dec 1 2023 7:22 AM | Updated on Dec 1 2023 7:49 AM

- - Sakshi

విశ్వనగరంగా పరుగులు తీస్తున్న హైదరాబాద్‌కు ఏమైంది? ఎన్నికలు ఏవైనా పోలింగ్‌ శాతం నమోదు గ్రాఫ్‌ మాత్రం దిగజారుతోంది. కోటీ 20 లక్షలకు పైగా జనాభాలో సగానికి పైగా అక్షరాస్యులే. మేధావులు, విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు, ప్రముఖులే. ఓటుహక్కు వినియోగానికి వచ్చేసరికి మాత్రం వెనుకంజ వేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే అతి తక్కువగా పోలింగ్‌ నమోదవుతూ వస్తోంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఓటింగ్‌ సరళి మరోసారి నిరాశపర్చింది. గత నాలుగు పర్యాయాలుగా ఇదే తంతు కొనసాగుతోంది. మొత్తం ఓటర్లలో సగం మంది కూడా పోలింగ్‌లో పాల్గొనడం లేదని తాజా పోలింగ్‌ శాతం వెల్లడిస్తోంది .

రాజధాని నగరం హైదరాబాద్‌లో పోలింగ్‌ శాతం గతం కంటే తగ్గింది. పోయిన అసెంబ్లీ (2018) ఎన్నికల్లో 50.51 శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనగా, ఈసారి పోలింగ్‌ సమయం ముగిసే రాత్రి 11 గంటల వరకు 46.65 శాతం పోలింగ్‌ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఇది దాదాపు 5 శాతం తగ్గడం గమనార్హం. మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను గోషామహల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 45.79 శాతం నమోదైంది. ఆ తర్వాత స్థానాల్లో ఖైరతాబాద్‌ (45.5శాతం), సనత్‌నగర్‌ (45.01 శాతం), సికింద్రాబాద్‌ (45.01 శాతం) ఉన్నాయి. అత్యల్ప పోలింగ్‌ యాకుత్‌పురాలో 27.87 శాతం నమోదైంది. గతంలో కంటే ఈసారి నగర ఓటర్లు మరింత నిరాసక్తత చూపారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు మాత్రం ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

సామాన్యుల్లోనే ఓటు చైతన్యం..
నగరంలోని ఉన్నత వర్గాలు, ఉద్యోగులు, వ్యాపార వర్గాల్లో ఓటింగ్‌లో తక్కువగా పాల్గొనట్లు కనిపిస్తోంది. పోలింగ్‌ రోజు సెలవుదినంగా భావిస్తూ చాలామంది ఇంటికే పరిమితమవుతున్నారు. కాగా.. ఎప్పటి మాదిరిగానే బస్తీలు, మురికివాడలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాత్రమే ఓటింగ్‌లో పాలుపంచుకుంటున్నారు. సంపన్నుల కాలనీలు అపార్ట్‌మెంట్ల్లలోని ప్రజలు ఓటింగ్‌కు దూరం పాటించినట్లు పరిస్ధితి కనిపిస్తోంది. విద్యావంతులున్న చోట అత్యల్పంగా పోలింగ్‌శాతం నమోదైంది.

కారణాలు అనేకం..
మరోవైపు నగరంతో పాటు స్వస్థలాల్లో ఓటు కలిగిన సుమారు 18 శాతం ఓటర్లు కుటుంబ సమేతంగా సొంతూరిలో ఓటు వేసేందుకు ప్రాధాన్యమిచ్చి వెళ్లిపోవడం పోలింగ్‌ తగ్గేందుకు మరో కారణమవుతోంది. ఎన్నికల కమిషన్‌ నిర్లక్ష్యం కారణంగా ఓటరు స్లీప్‌లు కూడా పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదు. మరోవైపు ఓటర్లు అడ్రస్‌లు కూడా తారుమారై ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించడం కూడా అనాసక్తికి కారణమైందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున నమోదైన బోగస్‌ ఓటర్లతోపాటు చనిపోయిన ఓటర్లు సైతం తొలగించలేదు. ఈ అంశం కూడా పోలింగ్‌ తగ్గుదలకు కారణమైంది.

మారని పాతబస్తీ ఓటర్లు
చారిత్రాత్మక పాతబస్తీ ఓటర్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతిసారి పోలింగ్‌ శాతం దారుణంగా దిగజారుతోంది. వాస్తవంగా నగరంలోని మిగిలిన చోట్ల పోలింగ్‌ ఓ ఎత్తయితే పాతబస్తిలో ఓటింగ్‌ మరో ఎత్తు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి కనబర్చడంలేదు. గత రెండు పర్యాయాల పోలింగ్‌ పరిశీలిస్తే మొత్తం ఓటర్లలో సగం మంది కూడా పోలింగ్‌లో పాల్గొనక పోవడం ఇందుకు నిదర్శనం. పాతబస్తీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఫలితాలు ఒకే విధంగా ఉంటాయి. రాజకీయ పార్టీ ఏదైనా కానీ, ప్రచార మాధ్యమాలు, మరేదైనా కానీ.. పాతబస్తీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గెలిచేది ఒకే పార్టీ అన్నది ఘంటాపథంగా చెబుతుంటాయి. ఇదే ఓటింగ్‌ తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. గత నాలుగు దశాబ్దాలుగా పోలింగ్‌ మరింత దిగజారుతోంది.

రెండు దశాబ్దాలుగా ఇదే వరస..
నగరంలో గత రెండు దశాబ్దాల మధ్య జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌, బల్దియా ఎన్నికల పోలింగ్‌ శాతం పరిశీలిస్తే నమోదు 50 శాతం మించనట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే 2009లో 58 శాతం, 2014లో 53.. 2018లో 50.86 శాతం పోలింగ్‌ నమోదైంది. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే 2009లో 53.86 శాతం, 2014లో 53.27, 2019లో 39.46 శాతం మాత్రమే నమోదైంది. సికింద్రాబాద్‌ పరిధిలో 2009లో 57 శాతం, 2014లో 53.06, 2019లో 44.99 శాతం నమోదైంది. మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో 2009లో 49.21, 2014లో 51.05, 2019లో 49.11 శాతం నమోదైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే 2020లో 46.55 శాతం, 2016లో 45.25 శాతం మించలేదు. 2009లో 45.27, 2002 ఎన్నికల్లో పోలింగ్‌ 41.22 శాతం మించలేదు.

ఆద్యంతమూ మందకొడిగానే..
నగరంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గురువారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ చివరిదాకా అదే స్ధాయిలో కొనసాగింది. మొదటి 2 గంటల్లో 5 శాతం, ఆ తర్వాత రెండు గంటల వ్యవధిలో మరో పది శాతం, ఆ తర్వాత మరో రెండు గంటల్లో 12 శాతం నమోదైంది. ఆ తర్వాత ప్రతి రెండు గంటలకు వరసగా పది శాతం చొప్పున ఓటింగ్‌ పెరుగుతూ వచ్చింది.

కూడికలు.. తీసివేతలు లెక్కలు వేస్తున్న అభ్యర్థులు
ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారో తెలియక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. గుంభనంగా వ్యవహరించిన ఓటర్లు పోలింగ్‌ ముగిసేంత దాకా తమ అంతరంగాన్ని బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. పోలింగ్‌ ముగిశాక సైతం ఓటరు నాడి తెలుసుకోలేక సతమతమవుతున్నారు. నిన్నటి వరకూ ఒక పార్టీకి కచ్చితమని భావించిన నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగే సమయానికి పరిస్థితి తారుమారు కావడంతో కంగు తిన్నారు. ఈ నేపథ్యంలో ఏ బస్తీలో, ఏ కాలనీలో తమకు ఓట్లు తగ్గాయి. ఎందుకు తగ్గాయి ? అనే అంశాలతో పోస్ట్‌మార్టం చేస్తున్నారు.

ఇంటింటికీ తిరిగినా , రెండు మూడు విడతలు ఓటర్లను కలిసినా, ముట్టజెప్పాల్సినవి ముట్టజెప్పినా తమకు ఎందుకు ఓట్లు పడలేదో ఆరా తీస్తున్నారు. మరోవైపు, తాము ఊహించని విధంగా కొన్ని ప్రాంతాల నుంచి తమకు ఎక్కువ ఓట్లు పోల్‌ కావడంతో తలలు పట్టుకుంటున్నారు. కోర్‌ సిటీలోని కొన్ని నియోజకవర్గాల్లో అనూహ్యంగా ఊహించని పార్టీలకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని తెలిసి హతాశులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement