హైదరాబాద్: గోవాలో పుట్టి.. దక్షిణాసియాలోనే అతిపెద్దదిగా మారి.. నగరంలో మెట్టిన సంగీత వేడుక సన్‌బర్న్ ఈవెంట్‌కి అనుకోని బ్రేకులు పడ్డాయి. గత తొమ్మిదేళ్లుగా ఈ ఈవెంట్ నగర యువత కేరింతలకి కేరాఫ్‌లా న్యూ ఇయర్ వేడుకలకు ప్రీ రిలీజ్‌లా ఉంటూ వస్తోంది. కరోనా వ్యాప్తి సమయంలో తప్ప ఇది వార్షిక కార్యక్రమంగా ఎప్పుడూ ఆగింది లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ ఈవెంట్‌కి సరైన అనుమతులు లేవంటూ నిలుపుదల చేసింది. దీంతో ఈ ఏడాది సన్‌బర్న్ దాదాపుగా లేనట్టే. ఒకవేళ ప్రభుత్వం ఇదే విధంగా ఈవెంట్ పట్ల ఇదే వైఖరి కొనసాగించాలనే నిర్ణయం తీసుకుంటే ఇక నగరవాసులు సెన్సేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్‌గా పేరొందిన సన్‌బర్న్‌కు ఇక గుడ్‌బై చెప్పాల్సిందే.
‘బర్న్‌ంగ్ టాపిక్...
► సిటీలోని పార్టీ లవర్స్‌కి అత్యంత క్రేజీగా మారిన ఈ ఈవెంట్ ప్రత్యేకత ఏమిటంటే ఇదొక ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్. చెవులు చిల్లులు పడే పాశ్చాత్య సంగీతం, అంతర్జాతీయ డీజేలు, పూర్తిస్థాయి టెక్నాలజీ వినియోగిస్తూ వేదికల రూపకల్పన వెరసీ.. విశాలమైన ఖాళీ మైదానంలో సూర్యాస్తమయ వేళల్లో హోరెత్తే సంగీతోత్సవంగా దీన్ని పేర్కొనవచ్చు. గోవాలో గత 2007లో ప్రారంభమైన ఈ ఈవెంట్ అక్కడ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ లవర్స్‌ను గోవా వైపు మళ్లించడంలో సన్‌బర్న్ పాత్ర కీలకం అని చెప్పక తప్పదు.
► తమ ఈవెంట్‌కి వస్తున్న విపరీతమైన ఆదరణ దృష్ట్యా దీని రూపకర్త శైలేంద్రసింగ్.. దీన్ని దేశంలోని మెట్రోలకు సైతం విస్తరించారు. ఏటా నవంబరు నుంచి డిసెంబరు చివరి వారం వరకూ బెంగళూరు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ.. నగరాల్లో నిర్ణీత తేదీల్లో నిర్వహించిన అనంతరం తుది ఈవెంట్‌ను గోవాలో ఏర్పాటు చేస్తుంటారు. ‘నగరవాసులు అత్యధిక సంఖ్యలో గోవాకి తరలి వస్తుండడంతోనే హైదరాబాద్‌లోనూ తమ ఈవెంట్‌ను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు’ అప్పట్లో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శైలేష్ సింగ్ చెప్పారు.
ఆరోపణలున్నా.. ఆగలేదు..
ఈ ఈవెంట్ పాశ్చాత్య నాగరికతకు పట్టం కడుతోందని, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను ప్రోత్సహిస్తోందని.. గత కొన్నేళ్లుగా దీనిపై ఆరోపణలు కొనసాగుతూ వస్తున్నాయి. వీటిని నిర్వాహకులు పూర్తిస్థాయిలో ఖండిస్తున్నారు. ఆరోపణల నేపథ్యంలో గోవాలో కూడా ఈవెంట్ తీరుతెన్నులపై పలు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో అనుమతులు లేవంటూ సన్‌బర్న్‌ను అడ్డుకోవడంతో ఇది అతిపెద్ద మ్యూజిక్ ఫెస్టివల్‌కి తొలి దెబ్బగానే చెప్పాలి. దీన్ని ఆ ఈవెంట్ నిర్వాహకులు ఎలా ఎదుర్కొంటారో, లేక హైదరాబాద్‌ని వదులుకుంటారో.. వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment