పెండింగ్‌లో నాలుగు లక్షలపైనే దరఖాస్తులు
దరఖాస్తుకు సిద్ధంగా మరో ఆరు లక్షల కుటుంబాలు
సాక్షి, హైదరాబాద్: ఇప్పట్లో కొత్త రేషన్ కార్డుల మంజూరు అసాధ్యమే అనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ (ఆహార భద్రత)కార్డు ప్రామాణికంగా చెప్పడంతో ప్రాధాన్యం పెరిగింది. ఇప్పటి వరకు రేషన్ కార్డు బహుళ ప్రయోజనకారిగా పనిచేస్తూ వస్తోంది. గత పదేళ్లలో కొత్త కార్డుల మంజూరు అంతంతగా మారడంతో రేషన్ కార్డులు లేనివారి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటికే నాలుగు లక్షల పైన దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, మరో ఆరు లక్షల కుటుంబాలు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత నాలుగేళ్ల నుంచి పౌరసరఫరాల ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు స్వీకరించే లాగిన్‌ను నిలిపివేశారు.
వాస్తవంగా 2021 మార్చి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికి ఆమోదం లేకుండా పోయింది. ఆ తర్వాత కొత్త దరఖాస్తుల సమర్పించుకునేందుకు వెసులుబాటు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట ఆవిర్భావం అనంతరం తెల్లరేషన్ కార్డులను ఆహార భద్రత కార్డులుగా మార్పు చేయడంతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బడిముబ్బడిగా కొత్త కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. కొంత కాలానికి అనర్హుల పేరిట కొన్ని కార్డులను ఏరివేసి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా , మేడ్చల్ జిల్లా పరిధిలో కార్డుల సంఖ్యను 15,99,639 పరిమితం చేసింది. దీంతో తిరిగి కొత్త కార్డుల కోసం పెద్ద ఎత్తున సుమారు 3.40 లక్షల కుటుంబాలు దరఖాస్తులు చేసుకోగా, 2021 ఆగస్టులో దరఖాస్తులను వడబోసి కేవలం 1.21 లక్షల దరఖాస్తులను మాత్రమే ఆమోదించి కొత్త కార్డులు మంజూరు మంజూరు చేసింది.
10 లక్షల కుటుంబాలకు ఎదురుచూపులే..
మహానగరంలో మరో 10 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం 17.21 లక్ష కుటుంబాలు మాత్రమే తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. ఇక ఇటీవలి ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 5,73,069 కుటుంబాలు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నాయి.
ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు
జోన్ కొత్త దరఖాస్తుల సంఖ్య
ఎల్‌బీనగర్ 3,16,919
చార్మినార్ 6,53,795
ఖైరతాబాద్ 4,27,950
కూకట్‌పల్లి 4,04,746
శేరిలింగంపల్లి 2,29,355
సికింద్రాబాద్ 3,91,160
కంటోన్మెంట్ 50,400
Comments
Please login to add a commentAdd a comment