● పిటిషనర్ నాగార్జున, ప్రతివాది మంత్రి కొండా సురేఖ గైర్హాజరు
● 16కు విచారణ వాయిదా
సిటీ కోర్టులు : రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌లో విచారణ జరిగింది. విచారణకు పిటిషనర్ నాగార్జున, ప్రతివాది మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడంతో విచారణను ఈనెల 16కు వేస్తున్నట్లు జడ్జి శ్రీదేవి తెలిపారు. సినీ అగ్రహీరో నాగార్జున కుమారుడైన హీరో నాగచైతన్య–సమంత విడాకుల విషయంపై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆమె వ్యాఖ్యలతో తన కుటుంబ పరువు పోయిందని నాగార్జున నాంపల్లిలో కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇదివరకే విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్‌తోపాటు సాక్షుల వాగ్మూలం రికార్డు చేసిన న్యాయస్థానం ప్రతివాది అయిన మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. అప్పటినుంచి ఆమె ప్రభుత్వ కార్యకలాపాల కారణంగానే కోర్టుకు హాజరుకాలేదని ఆమె తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.
చీటింగ్ కేసులో ఓక్స్‌వాగన్ మాజీ మేనేజర్ అరెస్టు
లంగర్‌హౌస్: ఓక్స్‌వాగన్ షో రూంలో రూ.80 లక్షలు కాజేసిన మాజీ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రఘుకుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన మహేష్ లాలాపేటలో ఉంటూ ఓక్స్‌వాగన్ కార్ల షోరూంలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. లంగర్‌హౌస్, ఎల్‌బీనగర్ బ్రాంచ్‌లకు ఒకేసారి మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. కార్ల అమ్మకాలతో పాటు వివిధ పనుల్లో చేతివాటం ప్రదర్శించి దాదాపు రూ.80 లక్షలు కాజేశాడు. ఇటీవల సంస్థ సీఈఓగా నియమితులైన క్రిష్ణప్రసాద్ రెండు షోరూంల రికార్డులను పరిశీలించగా భారీ మొత్తంలో అవకతవకలు జరిగినట్లు అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించాడు. అయితే సివిల్ వివాదం కావడంతో పోలీసులు కోర్టును సంప్రదించారు. కోర్టు అనుమతితో గురువారం నిందితుడు మహేష్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment