
తాగునీటి డిమాండ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి
సాక్షి,సిటీబ్యూరో: రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగు నీటి డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను అదేశించారు. గురువారం జలమండలి ప్రధాన కార్యాలయంలో వేసవిలో నీటి డిమాండ్‌ను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వేసవిలో అధికంగా ట్యాంకర్లు బుక్ చేసుకున్న ప్రాంతాల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ట్యాంకర్ బుకింగ్, నీటి సరఫరా, డెలివరీ తదితర వివరాలను పరిశీలించారు. ఈ సారి నీటి డిమాండ్ ను మరింత సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ట్యాంకర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్లు, నీటి మోతాదు పెంచుతామన్నారు. గతంలో అధికంగా ట్యాంకర్లు బుక్ చేసిన వినియోగదారులను సర్వే చేసి గుర్తించామని, వీరి ప్రాంగణాల్లో బోర్లు, భూగర్భ జలాలు ఎండిపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి వినియోగదారుల ఇళ్లల్లో సర్వే చేపట్టామని తెలిపిన వారు.. ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ట్యాంకర్ల యజమానులతో సమావేశమయ్యారు. వేసవిలో ట్యాంకర్ల పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారి నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్. ఈఎన్సీ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్. ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ ఆపరేషన్స్–2 స్వామి, సీజీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment