నుమాయిష్‌లో జైళ్ల శాఖ స్టాల్ ఏర్పాటు
సైదాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కొనసాగుతున్న 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన–నుమాయిష్ 2025లో తెలంగాణ జైళ్ల శాఖ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ‘మై నేషన్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ స్టాల్‌ను గురువారం తెలంగాణ జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్మ మిశ్రా ప్రారంభించారు. నుమాయిష్‌లో 1 నుండి 5 వరకు నంబర్లతో ఏర్పాటు చేసిన స్టాల్‌ను డీజీపీ, జైళ్ల శాఖ కార్యదర్శి బీ సురేందర్‌రెడ్డి, డీఐజీ డాక్టర్ శ్రీనివాస్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని పలు జైళ్లకు చెందిన ఖైదీలు తయారుచేసిన పలు రకాల ఉత్పత్తులను ఈ స్టాల్‌లో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఖైదీల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించి వారు తయారు చేసిన వస్తువులను అమ్మడం ద్వారా ఖైదీల సామాజిక పునరేకీకరణ సులభతరం అవుతుందన్నారు. ఖైదీల వ్యక్తిగత అభివృద్ధి, ఆర్థిక స్వాతంత్య్రం కోసం మార్గాలను అందించడం ద్వారా వారి పునరావాసానికి జైళ్ల శాఖ కృషి చేస్తుందన్నారు. నుమాయిష్–2024లోనూ ఏర్పాటు చేసిన మై నేషన్ స్టాల్ రూ. 20,96,133 అమ్మకాలు సాధించడమే కాకుండా, ప్రభుత్వ రంగం నుండి ఉత్తమ ప్రదర్శన స్టాల్ అవార్డును సొంతం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్లు శివకుమార్ గౌడ్, రామచంద్రం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment