దద్దరిల్లిన బల్దియా
సాక్షి, సిటీబ్యూరో: ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ బిల్లుల తాలూకు నిధులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం కాంట్రాక్టర్లు నిర్వహించిన ధర్నాతో కాసేపు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ ప్రాంగణం దద్దరిల్లింది. మధ్యాహ్నం ‘నో పేమెంట్–నో వర్క్స్’ ప్లకార్డులతో కమిషనర్ ప్రవేశ ద్వారం వద్ద కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. తమ బిల్లులు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. ఇదే సమయంలో ఇద్దరు కాంట్రాక్టర్లు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సహచర కాంట్రాక్టర్లు వారించి వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. కమిషనర్ కార్యాలయంవైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన వారిని భద్రతా సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన కమిషనర్ తన చాంబర్ నుంచి మొదటి అంతస్తులోని మేయర్ చాంబర్‌లోకి వెళ్లి కాంట్రాక్టర్ల అసోసియేషన్ నాయకులతో మాట్లాడేందుకు పిలిచారు. గత జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న తమ బకాయిలను సంక్రాంతిలోగా చెల్లించకపోతే.. ఈ నెల 20 నుంచి అన్ని పనులు నిలిపివేసి, సమ్మెలోకి వెళ్తామన్న నేతలకు కమిషనర్ నచ్చచెప్పారు. జూలై వరకు బిల్లుల్ని పండగలోగా చెల్లించడంతోపాటు రెండు మూడు నెలల్లో పరిస్థితుల్ని చక్కదిద్ది మిగతా బిల్లుల చెల్లింపులు చేస్తామని కమిషనర్ ఇలంబర్తి హామీ ఇచ్చినట్లు సమావేశానంతరం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేందర్‌సింగ్ తెలిపారు. జీహెచ్‌ఎంసీకి నెలకు రూ.500 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అందులో రూ. 200 కోట్లు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని కమిషనర్ తెలిపినట్లు పేర్కొన్నారు.
కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల బకాయిలు దాదాపు రూ. 1500 కోట్లు ఉన్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చిన వారు బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. బిల్లుల చెల్లింపులకు ముందు ఇంజినీర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు పనులను తనిఖీ చేయాలని ఇటీవల కమిషనర్ సర్క్యులర్ జారీ చేయడాన్ని ప్రస్తావిస్తూ, పనుల తనిఖీల పేరిట అధికారులు జాప్యం చేస్తే సహించబోమన్నారు. అధికారులు తనిఖీలు చేసేందుకు కూడా నిర్ణీత గడువు విధించాలని, ఆలోగా వారు తనిఖీలు చేయకపోయినా బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.
బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్ల ధర్నా
ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తం
కమిషనర్ కార్యాలయ ముట్టడికి యత్నం
తన చాంబర్ నుంచి మేయర్ చాంబర్‌కు వెళ్లిన కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment