అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్ట్
అల్వాల్: మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాచకొండ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ జి.సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం, జోధ్‌పూర్‌కు చెందిన మహేష్ నేరేడ్‌మెట్ ప్రాంతంలో ఉంటూ చెందిన గ్యాస్ రిపేరీ పనులు చేసేవాడు. అతడికి జోధ్‌పూర్‌కు చెందిన డ్రగ్స్ వ్యాపారి షంసుద్ధీన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అతను ఈ నెల 10న రూ. లక్ష చెల్లించి 200 గ్రాముల హెరాయిన్ కొనుగోలు చేసి రైలులో నగరానికి తీసుకొని వచ్చాడు. సరుకును ఆర్‌కెపురంలోని తన స్నేహితుడు మహిపాల్ నివాసంలో దాచిన అతను స్నేహితుల ద్వారా తెలిసిన వారికి విక్రయిస్తున్నాడు. వినియోగదారుల నుంచి ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకుని ర్యాపిడో తదితర యాప్‌ల ద్వారా సరఫరా చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు, నేరేడ్‌మెట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 190 గ్రాముల హెరాయిన్, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక సిమ్‌కార్డు, తూకం వేసే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment