ప్ర‘పంచ’ సౌరభాలు!
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరికి చారిత్రక భవనాల మణిహారం దక్కింది. మూసీ నది పరిసర ప్రాంతాల్లోని అయిదు చారిత్రక భవనాలు ప్రపంచ స్మారక నిధి (వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్–డబ్ల్యూఎంఎఫ్)– 2025లో చోటు దక్కించుకున్నాయి. హైకోర్టు, సిటీ లైబ్రరీ, ఉస్మానియా ఆస్పత్రి, సిటీ కాలేజీ, బ్రిటిష్ రెసిడెన్సీ భవనాలకు ఈ గుర్తింపు దక్కడం గర్వకారణం. న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న లాభాపేక్షలేని సంస్థ డబ్ల్యూఎంఎఫ్ తాజా జాబితాను విడుదల చేసింది. నీటి సంక్షోభం, వాతావరణ మార్పుల కారణంగా ఆయా చారిత్రక భవనాలు ముప్పును ఎదుర్కొంటున్నాయని తెలిపింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మూసీ నదీ పునరుజ్జీవానికి సంకల్పించిన నేపథ్యంలో డబ్ల్యూఎంఎఫ్‌లో చోటు దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గుర్తింపుతో ప్రయోజనమేమిటి?
ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ నామినేషన్లు రాగా.. హైదరాబాద్ నుంచి అయిదు చారిత్రక భవనాలు ఎంపికయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకం, సంఘర్షణ, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్న వారసత్వ, చారిత్రక భవనాలు, ప్రదేశాలను డబ్ల్యూఎంఎఫ్ గుర్తిస్తుంది. ఆయా కట్టడాలను సంరక్షించి, పునరుద్ధరిస్తే భావి తరాలకు అమూల్యమైన ఆస్తులుగా నిలపడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. పర్యావరణ క్షీణత, నిర్లక్ష్యం, ఆక్రమణలు, పట్టణ విస్తరణ కారణంగా ఆయా నిర్మాణాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రపంచ దృష్టికి తీసుకురావడమే ప్రధానోద్దేశం. విరాళాలు, నిధుల సమీకరణతో పాటు ప్రభుత్వ, ప్రజల భాగస్వామ్యంతో ఆయా వారసత్వ కట్టడాల పునరుద్ధరణ చేపడుతుంది.
సిటీ కళాశాల: 1865లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ మదర్సా దార్–ఉల్–ఉలూమ్ పేరుతో మొదట సిటీ స్కూల్‌ను ప్రారంభించారు. తర్వాత ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ దీన్ని సిటీ హైస్కూల్‌గా మార్చారు. ఈ పాఠశాలనే 1921లో ప్రస్తుతం ఉన్న భవనంలోకి మార్చి, 1929లో సిటీ కాలేజీగా నామకరణం చేశారు. 16 ఎకరాల్లో ఉన్న ఈ భవనాన్ని ఇండో–సార్సెనిక్ శైలిలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ విన్సెంట్ ఎస్చ్ నిర్మించారు.
మూసీ పరిసర భవనాలకు ‘స్మారక’ గుర్తింపు
నగరంలోని 5 చారిత్రక కట్టడాలకు డబ్ల్యూఎంఎఫ్ జాబితాలో చోటు
హైకోర్టు, సిటీ లైబ్రరీ, ఉస్మానియా ఆస్పత్రి, సిటీ కాలేజీ, బ్రిటిష్ రెసిడెన్సీ
నీటి సంక్షోభం, వాతావరణ మార్పులతో నిర్మాణాలకు ముప్పు
పర్యావరణ పరిరక్షణ, భవనాలకు పునరుజ్జీవం అత్యవసరం
వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్– 2025 నివేదిక విడుదల
హైకోర్టు: ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అప్పటి హైదరాబాద్ దక్కన్ సంస్థానానికి హైదరాబాద్ హైకోర్టును స్థాపించారు. తర్వాత 1956 నవంబర్ 5న రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం దీన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చారు. ఏపీ విభజన సమయంలో 2018 డిసెంబర్ 26న భారత రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌లోని హైకోర్టును విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ నది దక్షిణ ఒడ్డున ఉన్న హైకోర్టు భవనాన్ని ఎరుపు, తెలుపు రాళ్లతో సార్సెనిక్ శైలిలో నిర్మించారు. జైపూర్‌కు చెందిన శంకర్‌లాల్ హైకోర్టు నిర్మాణానికి ప్లాన్ రూపొందించగా.. స్థానిక ఇంజినీర్ మెహర్ అలీ ఫాజిల్ డిజైన్ చేశారు. 1915 ఏప్రిల్ 15న నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. 1919 మార్చి 31న పూర్తయింది. 1920 ఏప్రిల్ 20న హైకోర్టు భవనాన్ని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించారు.
ఉస్మానియా ఆస్పత్రి: దేశంలోని పురాతన ఆస్పత్రుల్లో ఒకటి అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్). 1919లో హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీన్ని స్థాపించారు. రూ.2 కోట్ల వ్యయంతో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ విన్సెంట్ జెరోమ్ ఎస్చ్, నవాబ్ ఖాన్ బహదూర్ మీర్జా అక్బర్ బేగ్‌లు ఇండో సార్సెనిక్ శైలిలో ఈ ఆస్పత్రిని నిర్మించారు.
బ్రిటిష్ రెసిడెన్సీ: జేమ్స్ అకిలెస్ కిర్క్ పాట్రిక్ నిర్మించిన సంపన్న భవనమే బ్రిటిష్ రెసిడెన్సీ. కిర్క్ పాట్రిక్ 1798–1805 మధ్యకాలంలో హైదరాబాద్‌లో బ్రిటిష్ నివాసి. ప్రస్తుతం కోఠి మహిళా యూనివర్సిటీలోని భాగమే ఈ బ్రిటిష్ రెసిడెన్సీ. దీన్ని మ్యూజియంగా మార్చారు. ఈ భవనం ఒకప్పుడు హైదరాబాద్ నిజాం కోర్టుకు ఈస్ట్ ఇండియా కంపెనీ రాయభార కార్యాలయంగా ఉండేది. ఈ భవనం పల్లాడియన్ శైలిలో ఉంది.
సెంట్రల్ లైబ్రరీ: 1891లో స్కాలర్ మౌల్వి సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామి తన వ్యక్తిగత గ్రంథాలయంగా అబిడ్స్‌లో ప్రస్తుతం ఉన్న జనరల్ పోస్ట్ ఆఫీసు స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. తర్వాత అసఫ్ జాహీ రాజవంశం గౌరవార్థం అసఫియా స్టేట్ లైబ్రరీగా పేరు మార్చారు. 1932లో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అఫ్జల్‌గంజ్‌లో 2.97 ఎకరాల స్థలంలో రూ.5 లక్షల వ్యయంతో లైబ్రరీని నిర్మించారు. అప్పట్లో దీన్ని కుతుబ్ ఖానా అసఫియా అని పిలిచేవారు. ఇందులో 5 లక్షలకు పైగా పుస్తకాలు, మేగజైన్లు, అరుదైన తాళపత్ర గ్రంథాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment