తీరనున్న ఎగిరే ట్యాక్సీ కల! ‘సాక్షి’తో సీఈఓ ప్రేమ్‌ కుమార్‌ | Airtaxi will be available soon in hyderabad | Sakshi
Sakshi News home page

తీరనున్న ఎగిరే ట్యాక్సీ కల! ‘సాక్షి’తో సీఈఓ ప్రేమ్‌ కుమార్‌

Published Fri, Jan 19 2024 9:06 AM | Last Updated on Fri, Jan 19 2024 12:37 PM

Airtaxi will be available soon in hyderabad - Sakshi

‘‘రెండేరెండు గంటల్లో హైదరాబాద్‌ నుంచి అటవీ ప్రాంతమైన ములుగుకు ఎయిర్‌ ట్యాక్సీలో గుండెను తీసుకెళ్లి రోగి ప్రాణాలు కాపాడొచ్చు’’. ‘‘తొమ్మిది గంటల్లో ఆదిలాబాద్‌ నుంచి తిరుపతికి ఎంచక్కా ఎగురుతూ వెళ్లిపోవచ్చు’’. 

అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే 2025లోనే ఇవన్నీ నిజమవుతాయి. జపాన్‌కు చెందిన ఫ్లయింగ్‌ కార్ల తయారీ సంస్థ స్కై డ్రైవ్‌ పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి. మనదేశంలో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేందుకు హైదరాబాద్‌కు చెందిన డ్రోన్‌  తయారీ సంస్థ మారుత్‌ డ్రోన్స్‌తో ఒప్పందం చేసుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: భూమి ఉపరితలం నుంచి 5 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ప్రయాణించడం ఎయిర్‌ ట్యాక్సీల ప్రత్యేకత. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడంతోపాటు కొండ ప్రాంతాలు, తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలకు ప్రయాణికులను తీసుకెళ్లడమే లక్ష్యమని మారుత్‌డ్రోన్‌ సీఈఓ ప్రేమ్‌కుమార్‌ విస్లావత్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఎయిర్‌ ట్యాక్సీ ప్రత్యేకతలు ఆయన మాటల్లోనే..

వాయు రవాణారంగంలో సరికొత్త శకం మొదలుకానుంది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, ఈ–కామర్స్‌ వృద్ధి వంటి కారణంగా ప్రజలు, వస్తువులకు వేగవంతమైన, సురక్షితమైన, సరసమైన రవాణావిధానం అవసరం. దీనికి అర్బన్‌ ఎయిర్‌ మొబిలిటీ (యూఏఎం) పరిష్కారం చూపిస్తుంది. 2030 నాటికి యూఏఎం ఎయిర్‌క్రాఫ్ట్‌ మార్కెట్‌ దాదాపు 25–30 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని పరిశ్రమవర్గాల అంచనా. 

ఎయిర్‌ ట్యాక్సీ అంటే.. 
ఎలక్ట్రిక్‌ వర్టికల్‌ టేకాఫ్‌ మరియు ల్యాండింగ్‌ (ఈవీటీఓఎల్‌) ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎయిర్‌ ట్యాక్సీలని పిలుస్తారు. ఇవి ఎలక్ర్టిక్‌ బైక్‌లు, కార్ల లాగా బ్యాటరీలతో నడుస్తాయి. వీటికి హెలికాప్టర్‌ ఫిక్స్‌డ్‌ వింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సామర్థ్యంతో మిళితమై ఉంటాయి. కాలుష్య ఉద్గారాలను విడుదల చేయని ఈ ఎయిర్‌ ట్యాక్సీలతో ట్రాఫిక్‌ రద్దీ, రణగొణ ధ్వనుల వంటి సమస్యలు ఉండవు. 

రాజేంద్రనగర్‌లో టెస్టింగ్‌ సెంటర్‌ 
ఎయిర్‌ ట్యాక్సీలను స్కైడ్రైవ్‌ జపాన్‌లో తయారు చేస్తుంది. పరిశోధనలు, అనుమతులు పూర్త­య్యాక.. విడిభాగాలను ఇండియాకు తీసుకొచ్చి హైదరాబా­ద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న టెస్టింగ్‌ సెంటర్‌లో బిగిస్తామని మారుత్‌ డ్రోన్స్‌ సీఈఓ ప్రేమ్‌కుమార్‌ చెప్పారు. భవిష్యత్‌ అవసరాలకు సెంటర్‌ను విస్తరించేందుకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం.

ఎయిర్‌ ట్యాక్సీ ప్రత్యేకతలివే..
సీటింగ్‌ సామర్థ్యం :
3 సీట్లు (ఒక పైలెట్‌+ ఇద్దరు ప్రయాణికులు) 
కొలతలు: 13 మీటర్లు*13 మీటర్లు*3 మీటర్లు
యంత్రాలు: 12 మోటార్లు/రోటర్లు
గరిష్ట టేకాఫ్‌ బరువు: 1.4 టన్నులు (3,100 ఎల్‌బీఎస్‌)
గరిష్ట వేగం: గంటకు వందకిలోమీటర్లు
గరిష్ట ఫ్లయిట్‌ రేంజ్‌: 15 కి.మీ. 


ఇదీ స్కైడ్రైవ్‌ కథ.. 
జపాన్‌కు చెందిన స్కైడ్రైవ్‌ 2018లో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ రోజువారీ రవాణాగా ఈవీటీఓఎల్‌ను వినియోగించేలా చేయడం దీని లక్ష్యం. 2019లో జపాన్‌లో జరిగిన తొలి ఈవీటీఓఎల్‌ విమాన పరీక్షలో స్కైడ్రైవ్‌ విజయం సాధించింది.

వచ్చే ఏడాది జపాన్‌లోని ఒసాకాలో జరగనున్న అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ మొబిలిటీ (ఏఏఎం) ప్రాజెక్ట్‌ పాల్గొనేందుకు స్కైడ్రైవ్‌ అర్హత సాధించింది. ఈ ఏడాది సుజుకి మోటార్‌ కంపెనీకి చెందిన ప్లాంట్‌లో స్కైడ్రైవ్‌ ఎయిర్‌ ట్యాక్సీల ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. 

మారుత్‌ డ్రోన్‌ కథ..
సామాజిక సమస్యలకు డ్రోన్‌ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడమే మారుత్‌ డ్రోన్స్‌ ప్రత్యేకత. ముగ్గురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు 2019లో దీనిని ప్రారంభించారు. తాజా ఒప్పందంలో ప్రదర్శన, వాణిజ్య విమానాల కార్యకలాపాలకు స్థానిక ప్రభుత్వం నుంచి మినహాయింపులు, ధ్రువీకరణ పత్రాలు పొందడంతోపాటు పైలెట్, మెకానిక్‌ శిక్షణ వంటి వాటిల్లో మారుత్‌ డ్రోన్స్‌ది కీలకపాత్ర.

ఎయిర్‌ ట్యాక్సీలకు నెట్‌వర్క్‌లను కనెక్ట్‌ చేయడం, కస్టమర్లను గుర్తించడం, ఎయిర్‌ఫీల్డ్‌ల భద్రత, అవసరమైన మౌలిక సదుపాయాలకు సహకరించడం వంటివి వాటిలోనూ భాగస్వామ్యమవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement