ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: గాజా స్ట్రిప్లో హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న దాదాపు 240 మంది బందీలకు త్వరలోనే విముక్తి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. బందీల్లో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులూ ఉన్నారు. వారందరినీ క్షేమంగా విడిపించడానికి ఇజ్రాయెల్, అమెరికా, ఖతార్ దేశాలు ప్రయత్నాలు వేగవంతం చేశాయి. ఆయా దేశాల ప్రతినిధులు హమాస్‌తో కొన్ని రోజులుగా జరుపుతున్న సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
బందీలను విడుదల చేయాలంటే ఇజ్రాయెల్ సైన్యం తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించాలని, గాజాలోకి పెద్ద ఎత్తున మానవతా సాయాన్ని అనుమతించాలని, ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఫైటర్లను విడుదల చేయాలని హమాస్ షరతు విధించింది. దీనికి ఇజ్రాయెల్ అంగీకరించినట్లు సమాచారం. బందీలకు స్వేచ్ఛ ప్రసాదించే విషయంలో అతి త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని హమాస్ సీనియర్ నాయకుడు ఇజ్జత్ రిష్క్ మంగళవారం వెల్లడించారు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను విడుదల చేస్తే బందీలను వదిలిపెట్టడానికి తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చామని ప్రవాసంలో ఉన్న హమాస్ నేత ఇస్మాయిల్ హనియేహ్ చెప్పారు. ఒప్పందం చివరి దశలో ఉందని ఖతార్ తెలియజేసింది. అంతా అనుకున్నట్లు జరిగితే గాజా నుంచి బందీలు వారి స్వదేశాలకు చేరడం ఖాయమే. అయితే, హమాస్‌పై ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం నోరువిప్పడం లేదు.
హమాస్ చెరలో ఉన్న తమ ఆప్తులను విడిపించాలని బందీల కుటుంబ సభ్యులు ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. నిత్యం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అంశం రాజకీయంగా తనకు చాలా నష్టం కలిగించే ప్రమాదం ఉండడంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ నాలుగు మెట్లు కిందికి దిగొచ్చినట్లు స్థానిక మీడియా అంచనా వేస్తోంది.
హమాస్ షరతులేమిటి?
గాజాపై ఐదు రోజులపాటు భూతల, వైమానిక దాడులను ఇజ్రాయెల్ నిలిపివేస్తే బందీల్లో 50 మంది మహిళలు, చిన్నారులను వదిలేస్తామని హమాస్ షరతు విధించినట్లు తెలిసింది. ఆ తర్వాత ముగ్గురు పాలస్తీనియన్ ఖైదీలకు చొప్పున బదులుగా ఒక్కో బందీని విడిచిపెడతామని చెబుతున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ జైళ్లలో 8 వేల మందికిపైగా పాలస్తీనా ఫైటర్లు శిక్ష అనుభవిస్తున్నారు. వారిని విడిపించుకోవడానికి బందీలను ఎరగా వాడుకోవాలని హమాస్ నిర్ణయించుకుంది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు జర్నలిస్టులు మృతి
లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్‌లో మంగళవారం హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించింది. క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ఫరా ఒమర్, రబీన్ మామరీ అనే ఇద్దరు జర్నలిస్టులు, మరో ఇద్దరు పౌరులు బలయ్యారు. మృతిచెందిన ఇద్దరు జర్నలిస్టులు లెబనాన్‌కు చెందిన అల్–మయాదీన్ టీవీ చానల్‌లో పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment