వాషింగ్టన్: ఈ ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం త్వరలో తేలనుంది. ఇప్పటికే కొలరాడో సుప్రీం కోర్టు ఆ రాష్ట్ర ప్రైమరీ బ్యాలెట్‌లో పాల్గొనకుండా ట్రంప్‌పై నిషేదం విధించిన విషయం తెలిసిందే. కొలరాడో స్టేట్ సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను విచారించేందుకు దేశ సుప్రీం కోర్టు శుక్రవారం అంగీకరించింది.
ఈ విచారణను త్వరిగతిన చేపడతామని, ఫిబ్రవరి 8న తుది వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ తెలిపారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడి రాజ్యాంగపరంగా తిరుగుబాటు కిందకు వస్తుందా రాదా అనేదానిపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది.
ట్రంప్ చేసిన తిరుగుబాటు రాజ్యాంగ తిరుగుబాటు కిందకు వస్తుందని భావించిన కొలరాడో స్టేట్ సుప్రీం కోర్టు ఆయనను ఆ స్టేట్ ప్రైమరీ బ్యాలెట్‌లో పాల్గొనకుండా బ్యాన్ విధించింది. అయితే ఈ బ్యాన్‌పై దేశ సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు ట్రంప్‌కు అనుకూలంగా వస్తే ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకున్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయి.
ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించి ట్రంప్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చని తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రైమరీలు ఈ నెల 15వ తేదీ ప్రారంభం కానున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ నామినేషన్ రేసులో ట్రంప్ ఇప్పటికే ముందంజలో ఉన్నారు. మిగతా అభ్యర్థులు ఆయన దరిదాపుల్లో కూడా లేరని పలు సర్వేలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment