వాషింగ్టన్: ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా కరువుతో అల్లాడుతున్న పాలస్తీనాలోని గాజా వాసులను ఆదుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఈ మేరకు ఆయన వాషింగ్టన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి విమానాల ద్వారా గాజాలో ఆహార పొట్లాలు జార విడుస్తామని ప్రకటించారు.
ముందుగా అమెరికాకు చెందిన మిలిటరీ విమానాలు గాజాలో ‘రెడీ టు మీల్’ పొట్లాలను ఎయిర్ డ్రాప్ చేయనున్నాయి. రెండు రోజుల క్రితం గాజాలో తిండి పొట్లాల కోసం ఎగబడ్డ వారిపై ఇజ్రాయెల్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో 100 మందికిపైగా మృత్యువాత పడగా 700 మంది దాకా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన నేపథ్యంలో గాజాలో విమానాల ద్వారా ఆహారపొట్లాలు జార విడుస్తామని బైడెన్ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆహారపొట్లల పంపిణీ ఇక నిరంతరం సాగుతుందని వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. జోర్డాన్, ఫ్రాన్స్ దేశాలు ఇప్పటికే గాజాలో ఆహారపొట్లాలను విమానం ద్వారా పలుమార్లు జారవిడిచాయి. గాజా సరిహద్దులు తెరచుకుని రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా సాయం పంపాల్సిందే తప్ప విమానాల ద్వారా ఆహార పొట్లాలు జార విడవడం పెద్ద ప్రభావం చూపదని పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. గాజాస్ట్రిప్‌లో కనీసం 5లక్షల76వేల మంది కరువుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment