బీజింగ్: మాల్దీవులు-భారత్ మధ్య వివాదాస్పద వాతావరణం నెలకొన్న వేళ చైనా తన దుష్టబుద్ధిని బయటపెట్టింది. మాల్దీవుల అంశంలో భారత్‌పై మరోసారి విమర్శలు గుప్పించింది. ఆసియా దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో భారత్ మరింత ఓపెన్ మైండెడ్(విశాల దృక్పథం)తో ఆలోచించాలని విమర్శలు చేసింది.
మాల్దీవుల-భారత్ మధ్య వివాదం నడుస్తున్న వేళ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనాలో పర్యటిస్తున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ముయిజ్జు తన సతీమణితో కలిసి బీజింగ్ వెళ్లారు. ఈ క్రమంలోనే చైనా అధికారిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయంలో భారత్‌పై చైనా అక్కసు వెళ్లగక్కింది. 'మాల్దీవులను మేము సమాన భాగస్వామిగా పరిగణిస్తాం. భారత్, చైనా ఘర్షణల నేపథ్యంలో భారత్‌కు దూరంగా ఉండాలని మాల్దీవులకు మేము ఎన్నడు చెప్పలేదు. భారత్ నుంచి మాల్దీవులకు వచ్చే సహకారాన్ని ముప్పుగా భావించలేదు. సంబంధాల్లో భారత్ మరింత విశాల దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలి' అని గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది.
మాల్దీవుల్లో గత సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మహమ్మద్ ముయిజ్జు అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈయనకు ముందు వరకు మాల్దీవులు భారత్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాయి. కానీ ముయిజ్జు అధికారంలోకి వచ్చాక మాల్దీవులకు చైనాతో సాన్నిహిత్యం ఎక్కువైంది. ఆ దేశంలో చైనా పెట్టుబడులు పెట్టి తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. అధ్యక్షునిగా పదవి చేపట్టిన వెంటనే ఆయన మొదట చైనాకే పర్యటించారు.
ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది.
ఇదీ చదవండి: భారత హైకమిషనర్‌కు మాల్దీవులు సమన్లు
Comments
Please login to add a commentAdd a comment