China Sponge Cities Are Failing Against Record Rains - Sakshi
Sakshi News home page

వర్షం ఇంక లేదు.. వరదైంది..!

Published Thu, Aug 17 2023 2:47 AM | Last Updated on Sat, Aug 19 2023 6:20 PM

China sponge cities are failing against record rains - Sakshi

చైనా వరద బీభత్సంతో అల్లాడిపోతోంది. నగరాలు నదుల్లా మారిపోయాయి. వరద ముంపుని ఎదుర్కోవడానికి చైనా కొన్నేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన స్పాంజ్‌ సిటీస్‌ పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వరదల్ని ఎదుర్కోవడానికి ఇప్పటివరకు 30 నగరాలను స్పాంజ్‌ నగరాలుగా మార్చింది. మరి ఈ స్పాంజ్‌ సిటీస్‌ సమర్థంగా పని చేయడం లేదా ? ఈ ఏడాది చైనాలో ఎందుకీ వరద బీభత్సం?

వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే భారీ వర్షాలు, వరదలు లేదంటే రికార్డు స్థాయి ఎండలు, ఉక్కబోత.. ఇప్పుడివే కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో రికార్డు స్థాయి వర్షాలతో చైనా తడిసి ముద్దవుతోంది. కేవలం జులై నెలలో కురిసిన వర్షాలకే 150 మంది మరణిస్తే, వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 250 కోట్ల డాలర్ల వరకు ఆస్తి నష్టం సంభవించింది. ఈ వరదల్ని ఎదుర్కోవడం కోసమే చైనా కొన్నేళ్ల క్రితం స్పాంజ్‌ సిటీల నిర్మాణానికి నడుం బిగించింది.

ఏమిటీ స్పాంజ్‌ సిటీస్‌  
వాతావరణ మార్పుల ప్రభావం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో అంచనా వేసిన చైనా 2015లో స్పాంజ్‌ సిటీస్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చైనాలో 654 నగరాల్లో 641 నగరాలకి వరద ముప్పు పొంచి ఉంది. ప్రతీ ఏడాది 180 పట్టణాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. జ­నా­భాతో కిటకిటలాడుతూ ప్రతీ నగరం ఒక కాంక్రీ­ట్‌ జంగిల్‌గా మారిపోవడంతో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నానాటికీ పెరిగిపోతున్నాయి. వర్షపు నీరు నగరాన్ని ముంచేయకుండా బొట్టు బొట్టు సద్వినియోగం చేసుకోవడమే ఈ స్పాంజ్‌ సిటీస్‌ లక్ష్యం. ఏ ప్రాంతంలో కురిసిన వాన నీరు అదే ప్రాంతంలో పూర్తిగా వాడుకునేలా సహజసిద్ధమైన ఏర్పాట్లు చేయడం స్పాంజ్‌ సిటీస్‌. ఒక్క మాట­లో చెప్పాలంటే వర్షపు నీటిని ఒక స్పాంజ్‌లా పీల్చుకునేలా నగరాల రూపురేఖలు మార్చడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

ఈ ప్రాజెక్టు ఎంతవరకు అమలైంది? 
చైనా ఈ ప్రాజెక్టుని అత్యంత ఘనంగా ప్రకటించింది కానీ ఆచరణలో ఇంకా వేగం పుంజుకోలేదు. 2015లో పైలెట్‌ ప్రాజెక్టుగా మొదలు పెట్టి 30 నగరాలను స్పాంజ్‌ సిటీలుగా మార్చింది. ఒక్కో నగరం మీద వెయ్యి కోట్ల యువాన్‌లకు పైనే ఖర్చు పెట్టింది. గత ఏడాది మొత్తం 654 నగరాలకు గాను 64 నగరాలకు స్పాంజ్‌ సిటీ మార్గదర్శకాలు పాటించాలని నిబంధనలు విధించారు. 1978 నుంచి గణాంకాలను పరిశీలిస్తే చైనా పట్టణ ప్రాంత జనాభా అయిదు రెట్లు పెరిగింది. చైనా జనాభాలో 90 కోట్ల మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. ఉత్తర చైనా మినహాయించి మిగిలిన పట్టణ ప్రాంత జనాభా అంతా వరద ముప్పులో ఉంది. అందుకే స్పాంజ్‌ సిటీస్‌ నిర్మాణం వేగవంతం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. స్పాంజ్‌ సిటీస్‌ పై ఒక చట్టాన్ని తీసుకువస్తేనే త్వరితగతిన వీటి నిర్మాణం పూర్తి అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

స్పాంజ్‌ సిటీల నిర్మాణం ఇలా!
► నగరంలో రెయిన్‌ గార్డ్స్‌ నిర్మాణం  
► వర్షం నీరు రహదారులపై నిలవకుండా నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా రహదారుల నిర్మాణం  
► రోడ్డుకిరువైపు పేవ్‌మెంట్ల మీద, ప్రతీ భవనంలోనూ వాన నీరు భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతల ఏర్పాటు  
► నీరు నిల్వ చేయడానికి కొత్తగా కాలువలు, చెరువుల తవ్వకం  
► వాన నీరు రిజర్వాయర్లలోకి వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మాణం
► చిత్తడి నేలల పునరుద్ధరణ
► ప్రతీ భవనంపైనా రూఫ్‌ గార్డెన్స్‌ ఏర్పాటు
► వర్షం నీరుని శుద్ధి చేస్తూ తిరిగి వాడుకోవడానికి ఉపయోగపడేలా ఎక్కడికక్కడ ప్లాంట్ల నిర్మాణం  


స్పాంజ్‌ సిటీలకూ పరిమితులున్నాయ్‌..!
చైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పాంజ్‌ సిటీలను నిర్మించినప్పటికీ ఈ ఏడాది వరద బీభత్సాన్ని ఎదుర్కోవడం సులభం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెనాన్‌ ప్రావిన్స్‌లోని జెంగ్‌జూ నగరాన్ని పూర్తి స్థాయిలో స్పాంజ్‌ సిటీగా మార్చేసింది. 2016 నుంచి 2021 మధ్య కేవలం ఈ ఒక్క నగరంపైనే 6 వేల కోట్ల యువాన్‌లు ఖర్చు పెట్టింది. అయినప్పటికీ వరదల్ని ఎదుర్కోలేక జెంగ్‌జూ నగరం నీట మునిగింది. దీనికీ కారణాలన్నాయి. చైనా తలపెట్టిన స్పాంజ్‌ సిటీలు రోజుకి 20 సెంటీ మీటర్ల వర్షం కురిస్తే తట్టుకోగలవు.

అలాంటిది గత జులైలో జెంగ్‌జూలో ఒక గంటలో 20 సెంటీ మీటర్ల వాన కురిసింది. ఇక బీజింగ్‌ పరిసరాల్లో మూడు రోజుల్లో 75 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంతే కాకుండా ఉత్తర చైనాలో సాధారణంగా వర్షలు అంతగా కురవవు. అందుకే ఆ ప్రాంతంలో ఇంకా స్పాంజ్‌ సిటీల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించలేదు.. ఈ ఏడాది వాతావరణ మార్పుల ప్రభావంతో ఉత్తర చైనాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసాయి. అక్కడ స్పాంజ్‌ సిటీల నిర్మాణం జరగకపోవడంతో వరదలు పోటెత్తాయి. చైనా ఎన్ని చర్యలు చేపట్టి కోట్లాది యువాన్‌లు ఖర్చు చేసినా ప్రకృతి ముందు తలవంచక తప్పలేదు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement