లండన్: ఏ ముహూర్తాన కరోనా వైరస్ పురుడు పోసుకుందో.. అప్పటి నుంచి ఏదో ఒక వైరస్ ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. ఇంగ్లండ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు సడలించగా, మరో వైరస్ వెలుగులోకి వచ్చి వణుకు పుట్టిస్తోంది. తాజాగా యూకేలో నోరో వైరస్ వెలుగులోకి రావడమే గాక అతి తక్కువ సమయంలోనే గణనీయంగా దీని బారిన పడ్డ బాధితుల సంఖ్య పెరిగినట్లు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్‌ఇ) తెలిపింది.
గత ఐదు వారాల్లో 154 మంది నోరో వైరస్ బారిన పడటంతో దీనిపై ప్రజలకు అప్రమత్తత అవసరమని హెచ్చరికలు జారీ చేసింది. ఇది వేగంగా వ్యాపించే గుణం కలిగి ఉందని అక్కడి వైద్యాధికారులు తెలిపారు. నోరో వైరస్ ప్రధాన లక్షణాలుగా.. కడుపు నొప్పి, డయేరియా, వాంతులు, జ్వరం ఉంటుందని, ముఖ్యంగా కడుపుపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని చెప్తున్నారు. మరింత ఆందోళన కలిగించే అంశమేమంటే, ముఖ్యంగా నర్సరీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు పీహెచ్‌ఈ తెలిపింది.
సీడీసీ ప్రకారం.. ఈ వైరస్ సంక్రమణ..వైరస్ సోకిన వ్యక్తి ద్వారా, కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు రెండు, మూడు రోజులు ఉంటాయని పేర్కొంది. ప్రత్యేకంగా దీనికంటూ ఎటువంటి మందు లేదని అంటున్నారు. వాంతులు, విరోచనాలు వల్ల మన శరీరం కోల్పోయిన ద్రవాన్ని భర్తీ చేయడానికి పుష్కలంగా ద్రవాలను తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment