జపాన్ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశంలో ‘యూజెనిక్స్ ప్రొటెక్షన్ లా’ కింద బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శారీరక వికలాంగులు పిల్లలను కనకుండా నిరోధించడానికి ప్రభుత్వం గతంలో ఈ చట్టం చేసింది. 1950- 1970 మధ్యకాలంలో పుట్టే పిల్లల్లో శారీరక లోపాలను నివారించడానికి ఈ చట్టం చేశారు. ఈ చట్టం కింద దేశంలోని సుమారు 25 వేల మందికి వారి అనుమతి లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.
‘యూజెనిక్స్ ప్రొటెక్షన్ లా’ను యుద్ధానంతర కాలంలో జరిగిన అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనగా జపాన్ న్యాయవాదులు అభివర్ణించారు. ఈ నేపధ్యంలో 1948 నాటి ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. జపాన్‌లోని ఐదు దిగువ న్యాయస్థానాల నుంచి ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ, ‘కుటుంబ నియంత్రణ’ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
తీర్పు అనంతరం కోర్టు బయట బాధితులు సుప్రీకోర్టు న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. టోక్యోలోని 81 ఏళ్ల వాది సబురో కితా మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పుడు నేను నా ఆనందాన్ని వ్యక్తపరచలేకపోతున్నాను. 1957లో 14 ఏళ్ల వయసులో ఉన్నప్పడు బలవంతంగా నాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఇది జరిగింది. ఈ విషయాన్ని నా భర్య చనిపోయే ముందు ఆమెకు తెలిపాను. తన వల్లే పిల్లలు పుట్టలేదని భార్య ముందు పశ్చాత్తాప పడ్డాను’ అని తెలిపారు. కాగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా బాధితులకు క్షమాపణలు తెలిపారు. బాధితులకు పరిహారాన్ని అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment