ప్రతీకాత్మక చిత్రం
కాస్త వేడిగానో, చల్లగానో నీళ్లతో స్నానం ఎవరైనా చేస్తారు.. మరి కరెంట్‌తో స్నానం చేస్తారా?.. వామ్మో ఇదేం పిచ్చి? ప్రాణాలు తీసే కరెంట్‌తో స్నానం చేయడం ఏమిటి? అంటారా.. ఇది నిజమే! జపాన్‌లో చాలా మంది అప్పుడప్పుడూ ఇట్లా కరెంట్ స్నానాలు చేస్తూనే ఉంటారు. దానికి ప్రత్యేకంగా ‘డెంకి బురో (ఎలక్ట్రిక్ బాత్)’ అని పేరు కూడా ఉంది. దీని సంగతేంటో తెలుసుకుందామా?..
నీళ్లకు, కరెంట్‌కు లింకు పెట్టొద్దని చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. వాటర్ హీటర్లు, గీజర్లు వంటివాటితో ప్రమాదాలు జరగడాన్ని చూస్తూనే ఉన్నాం. కానీ అదంతా హైఓల్టేజీ (ఎక్కువ తీవ్రత ఉన్న) కరెంట్. మరి డెంకి బురో స్నానాలకు వాడేది లోఓల్టేజీ కరెంట్. అంటే కొద్దిగా షాకి చ్చినట్టు అనిపిస్తూ.. మరీ పెద్దగా ఇబ్బంది కలగని కరెంట్ అన్నమాట. మన ఇళ్లలో వాడే ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఉపకరణాలకు సరఫరా అయ్యే విద్యుత్ 220 నుంచి 240 వోల్టుల మధ్య ఉంటుంది. డెంకి బురోలో 5 నుంచి 15 వోల్టేజీల మధ్య తీవ్రత ఉండే కరెంటును ఉపయోగిస్తారు.
ఇంటా, బయటా.. ప్రత్యేక పూల్స్..
జపాన్‌లో డెంకి బురో స్నానాల కోసం ప్రత్యేకంగా బాత్‌టబ్‌లు, చిన్నపాటి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. వాటిలో రెండు వైపులా లోహపు పట్టీలను అమర్చి.. విద్యుత్ వైర్‌లో ఉండే రెండు తీగలను వాటికి అనుసంధానం చేస్తారు. ఆ లోహపు పట్టీలు మునిగేదాకా నీటిని నింపి, విద్యుత్ సరఫరా చేస్తే.. ఓ వైపు నుంచి మరోవైపునకు కరెంటు సరఫరా అవుతుంది. కొందరు వీటిని ఇళ్లలో ఏర్పాటు చేసుకుంటారు. బయట పబ్లిక్ బాత్ హౌజ్‌లలో కూడా డెంకి బురో సౌకర్యం ఉంటుంది. మనం బయటికి వెళ్లినప్పుడు ఏదో హోటల్‌కు వెళ్లి కాఫీ, చాయ్ తాగుతుంటాం కదా. అలా జపాన్‌లో కొందరు రిలాక్సేషన్ కోసం బాత్‌హౌజ్‌లకు వెళ్లి కరెంట్ స్నానాలు చేస్తుంటారు. జపాన్‌లో ఇలా కరెంట్ స్నానాల అలవాటు 18వ శతాబ్దం నుంచే ఉందట.
ఎందుకిలా.. ఏమిటి లాభం?
ఈ బాత్‌టబ్, మినీ స్విమ్మింగ్ పూల్స్‌లో స్నానం చేసేవారికి స్వల్పంగా కరెంట్ షాక్ తగులుతూ ఉంటుంది. ఇది నాడుల ద్వారా వ్యాపిస్తూ.. కండరాల్లో సన్నగా వణుకు (జలదరింపు) పుట్టిస్తుంది. అలసిపోయిన కండరాలు దీనితో రిలాక్స్ అవుతాయని.. ముఖ్యంగా కీళ్లు, వెన్ను, మెడ నొప్పి (రుమాటిజం, స్పాండిలైటిస్) వంటి సమస్యలున్న వారికి మంచి రిలీఫ్‌ను ఇస్తుందని చెప్తారు.
► అమెరికా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు ఉపశమనం కోసం
డెంకి బురో తరహాలో ఎలక్ట్రోథెరపీ ఇవ్వడం గమనార్హం.
► ఇప్పటికీ పలు రకాల వైద్య చికిత్సల్లో వివిధ వోల్టేజీల్లో విద్యుత్ షాక్‌ను ఇస్తుంటారు. స్వల్ప స్థాయి కరెంట్ షాక్ వల్ల శరీరంలో నాడులు స్పందించి మెదడుకు సిగ్నల్స్ పంపుతాయని, ఈ క్రమంలో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుం దని కొందరు వైద్య నిపుణులు చెప్తున్నారు.
► మరో పరిశోధన ప్రకారం.. స్వల్పస్థాయి కరెంట్ ప్రవాహంతో శరీరంలో ఎండార్ఫిన్లుగా పిలిచే సహజ పెయిన్ కిల్లర్లు విడుదలవుతాయి. దానితో కీళ్లు, వెన్ను, మెడ నొప్పుల వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
► కరెంట్ వోల్టేజీని తట్టుకునే సామర్థ్యం ఒక్కొక్క రిలో ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు కొంద రిలో 10 వోల్టుల కరెంటు షాక్‌ను, నొప్పిని కలి గిస్తే.. మరికొందరికి మాత్రం హాయిగా, విశ్రాం తిగా ఉంటుంది. అందుకే అవసరమైనట్టుగా ఓల్టేజీని తగ్గిస్తూ, పెంచుకుంటూ ఉంటారు.
దయచేసి ఇళ్లల్లో ప్రయత్నించకండి
అసలే కరెంటు, నీళ్ల జోడీ డేంజర్. వోల్టేజీలో తేడా వచ్చిందంటే ప్రాణాలకు ప్రమాదమే. అంతేకాదు.. మనకు ఎంత వోల్టేజీ అవసరమన్నది కూడా తెలియదు. పైగా సర్జరీలు జరిగినవారు, శరీరంలో రాడ్లు, ప్లేట్లు వంటివి అమర్చుకున్నవారు, గుండె జబ్బులున్నవారి విషయంలో మరింత అప్రమత్తత అవసరమని.. మొదట వైద్యులను సంప్రదించాకే డెంకి బురోకు వెళ్లాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జపాన్‌లో కొందరు డాక్టర్లు ప్రత్యేకంగా డెంకి బురో కోసం సలహాలు కూడా ఇస్తుంటారట.
ఇది కేవలం సమాచారం ఇచ్చిన కథనం. దయచేసి ఎవరూ ఇంటా బయట ఇలాంటివి ప్రయత్నించకండి.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment